టీమిండియా సెలబ్రేషన్ (PC: BCCI X
టీమిండియాతో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 290 పరుగులకు ఆలౌట్ అయింది. పసిందు సూరియబండారా భారీ అర్ధ శతకం (80)తో రాణించగా.. సొనాల్ దినుష శతక్కొట్టాడు. ఏడో స్థానంలో వచ్చిన దినుష 162 బంతులు ఎదుర్కొని 103 పరుగులు సాధించాడు. అయితే, మిగతా వారంతా విఫలం కావడంతో శ్రీలంకకు ఫాలో ఆన్ గండం తప్పలేదు.
కాగా కొలంబో వేదికగా శ్రీలంక- భారత్ మధ్య ఆదివారం రెండో టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దేవదత్ పడిక్కల్ (117) శతక్కొట్టగా.. ధ్రువ్ జురెల్ అజేయ శతకం (115) సాధించాడు. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (63), కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (50) హాఫ్ సెంచరీలతో అలరించగా.. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 45 పరుగులతో రాణించాడు.
ఫలితంగా సోమవారం నాటి రెండో రోజు ఆటలో భారత్ 503-9 పరుగుల భారీ స్కోరు వద్ద తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. లంక బౌలర్లలో అసిత ఫెర్నాండో నాలుగు వికెట్లతో చెలరేగగా.. ప్రభాత్ జయసూరియ, కేశారా నువాంత చెరో రెండు వికెట్లు తీశారు. లాహిరు కుమారకు ఒక వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లంక రెండో ఆటలో రెండు వికెట్ల నష్టానికి కేవలం ఎనిమిది పరుగులే చేసింది. ఈ క్రమంలో 8/2 ఓవర్ నైట్ స్కోరుతో మంగళవారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టిన శ్రీలంకకు పసిందు ఊపిరిలూదాడు. మొత్తంగా 133 బంతుల్లో 80 పరుగులు సాధించాడు. అయితే, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో బౌల్డ్ కావడంతో అతడి ఇన్నింగ్స్‌కు తెరపడింది.
మిగతా వారిలో కమిందు మెండిస్ (32) ఓ మోస్తరుగా రాణించగా.. కెప్టెన్ ధనంజయ డి సిల్వ (8), వికెట్ కీపర్ బ్యాటర్ నిరోషన్ డిక్‌వెల్లా (0) పూర్తిగా విఫలమయ్యారు. ఇలాంటి దశలో సొనాల్ దినుష పట్టుదలగా నిలబడ్డాడు. ఫలితంగా మూడో రోజు ఆట ముగిసే సరికి శ్రీలంక ఎనిమిది వికెట్ల నష్టానికి 265 పరుగులు చేయగలిగింది.
ఇక బుధవారం నాటి నాలుగో రోజు ఆటను 265/8తో మొదలుపెట్టగా.. సారాంశ్ జైన్ లాహిరు కుమార (12)ను వెనక్కి పంపాడు. అప్పటికే సెంచరీ పూర్తి చేసుకున్న దినుషను సైతం సారాంశ్ పెవిలియన్‌కు పంపడంతో లంక ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో ప్రసిద్ కృష్ణ, మానవ్ సుతార్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. సారాంశ్ జైన్‌కు రెండు, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజాలకు తలా ఒక వికెట్ దక్కాయి.
ఫాలో ఆన్ అంటే?
టెస్టు క్రికెట్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు.. సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు కంటే తొలి ఇన్నింగ్స్‌లో కనీసం 200 లేదా అంతకంటే ఎక్కువ ఆధిక్యంలో ఉంటే.. ఫాలో ఆన్ ఆడిస్తుంది. అంటే.. సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు ఆలౌట్ కాగానే మళ్లీ బ్యాటింగ్ చేయమని కోరుతుంది.
మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (MCC)లోని 14.1.1 నిబంధన ప్రకారం తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యంలో ఉన్న జట్టుకు ఈ హక్కు లభిస్తుంది. భారత్- శ్రీలంక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. లంకను 290 పరుగులకు ఆలౌట్ చేసింది. తద్వారా తొలి ఇన్నింగ్స్‌లో 213 పరుగుల ఆధిక్యం సాధించింది.
కాబట్టి ఫాలో ఆన్ ఆడిస్తోంది. అసలే ఈ మ్యాచ్‌కు వాన ముప్పు ఉంది. మరోవైపు ఆట ఇప్పటికే నాలుగో రోజుకు చేరుకుంది. దీంతో టీమిండియా ఫాలో ఆన్‌కు మొగ్గుచూపింది. కాగా తొలి టెస్టులో భారత్ 165 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను చిత్తు చేసిన సంగతి తెలిసిందే.
చదవండి: భువీ విజృంభణ


