మెరిసిన పసిందు, దినుష.. ఇంకా వెనుకబడే ఉన్న శ్రీలంక | IND vs SL 2nd Test Day 3: Sri Lanka trail by 238 runs | Sakshi
Sakshi News home page

మెరిసిన పసిందు, దినుష.. ఇంకా వెనుకబడే ఉన్న శ్రీలంక

Aug 25 2026 5:20 PM | Updated on Aug 25 2026 5:46 PM

IND vs SL 2nd Test Day 3: Sri Lanka trail by 238 runs

వికెట్‌ తీసిన సంబరంలో టీమిండియా (PC: BCCI X)

టీమిండియాతో రెండో టెస్టు మూడో రోజు ఆటలో శ్రీలంక పోరాట పటిమ కనబరిచింది. కొలంబోలో 8/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో మంగళవారం ఆట మొదలుపెట్టింది ఆతిథ్య జట్టు. కాసేటికే ఓపెనర్‌ కమిల్‌​ మిశారా (19) వెనుదిరిగినప్పటికీ.. నాలుగో నంబర్‌ బ్యాటర్‌ పసిందు సూరియబండారా పట్టుదలగా నిలబడ్డాడు.

మెరిసిన పసిందు
భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతూ.. కమిందు మెండిస్‌తో కలిసి ఐదో వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. మొత్తంగా 133 బంతులు ఎదుర్కొన్న పసిందు తొమ్మిది ఫోర్ల సాయంతో 80 పరుగులు సాధించాడు. అయితే, సెంచరీ దిశగా పయనిస్తున్న వేళ రవీంద్ర జడేజా అద్భుత బంతితో పసిందును బౌల్డ్‌ చేశాడు. దీంతో టీమిండియాకు మంచి బ్రేక్‌ లభించింది.

మిగిలిన వారిలో కమిందు మెండిస్‌ (32) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్‌ ధనంజయ డి సిల్వ (8) విఫలమయ్యాడు. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ నిరోషన్‌ డిక్‌వెల్లా డకౌట్‌ అయి నిరాశపరచగా.. ఈసారి సొనాల్‌ దినుష బాధ్యత తీసుకున్నాడు. అతడికి తోడుగా కేశారా నువాంత (74 బంతుల్లో 18) నిలబడ్డాడు.

దినుష పోరాటం
మంగళవారం ఆట ముగిసే సమయానికి దినుష 137 బంతుల్లో 85 పరుగులతో అజేయంగా నిలవగా.. అతడికి తోడుగా లాహిరు కుమార (8*) నిలిచాడు. వర్షం వల్ల భోజన విరామం తర్వాత ఆటకు అంతరాయం కలిగింది. ఆ తర్వాత చాలా సేపు ఆట కొనసాగగా.. మూడో సెషన్‌ను మధ్యాహ్నం 3.45 నుంచి సాయంత్రం 5.45 నిమిషాల వరకు నిర్వహించాలని భావించారు. 

అయితే, మరోసారి వర్షం వల్ల అంతరాయం కలగడంతో దాదాపు ఇరవై ఎనిమిది నిమిషాలకు ముందుగానే ఆటను నిలిపివేశారు. అప్పటికి శ్రీలంక ఎనిమిది వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కంటే.. ఇంకా 238 పరుగులు వెనుబడి ఉంది. 

ఓవరాల్‌గా భారత బౌలర్లలో ప్రసిద్‌ కృష్ణ, మానవ్‌ సుతార్‌ చెరో మూడు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా, మహ్మద్‌ సిరాజ్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. కాగా రెండో రోజు ఆటలో భారత్‌ తొమ్మిది వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద తమ మొదటి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసిన సంగతి తెలిసిందే.

చదవండి: టెక్నిక్‌ లేకుండా ఆడతాడు.. పంత్‌కు అదొక్కటే ప్లస్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement