పడిక్కల్ (PC: BCCI X)
శ్రీలంక గడ్డ మీద టీమిండియా క్రికెటర్ దేవదత్ పడిక్కల్ సత్తా చాటుతున్నాడు. తొలి టెస్టులో భారీ శతకం (167)తో అలరించిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. రెండో టెస్టులోనూ సెంచరీ (117)తో కదం తొక్కాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ సంజయ్ మంజ్రేకర్ పడిక్కల్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.
NRIలా మారిపోయారు
అదే సమయంలో పెద్ద పెద్ద స్టార్లుగా పేరు తెచ్చుకున్న భారత బ్యాటర్లు మాత్రం ప్రస్తుతం ‘ప్రవాస భారతీయుల్లా’ మారిపోయారని మంజ్రేకర్ చురకలు అంటించాడు. దేశీయ పిచ్‌లపై ఆడటమే వారు మర్చిపోయారని.. అలాంటి వారికి పడిక్కల్ కనువిప్పు కలిగించాడని పేర్కొన్నాడు. దేశవాళీ క్రికెట్ ఆడితేనే ఎవరైనా మంచి ఫలితాలు రాబట్టగలరని చెప్పుకొచ్చాడు.
టీమిండియా తప్పుల్ని ఎత్తి చూపాడు
ఈ మేరకు సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ షోలో మాట్లాడుతూ.. ‘‘గత కొన్నేళ్లుగా టీమిండియా యాజమాన్యం చేస్తున్న తప్పులను పడిక్కల్ తన ఆట తీరుతో ఎత్తి చూపాడు. కొంతమంది మన బిగ్ స్టార్లు ఇప్పుడు NRIలుగా మారిపోయారు. భారత పిచ్‌లపై కంటే కూడా వాళ్లు విదేశాల్లోనే ఎక్కువ మ్యాచ్‌లు ఆడుతున్నారు.
ఎక్కడైతే తాము పుట్టి పెరిగామో.. ఎక్కడ ఆట నేర్చుకుని.. ఈ స్థాయికి ఎదిగామో వారు మర్చిపోయారు. దేశవాళీ క్రికెట్‌ను పూర్తిగా పక్కన పెట్టారు. ఐదారేళ్లుగా విదేశాల్లోనే ఎక్కువగా ఆడుతూ.. ఉపఖండ పిచ్‌లపై ఎలా ఆడాలో మనోళ్లు మర్చిపోయారు’’ అని మంజ్రేకర్ ఘాటు విమర్శలు చేశాడు.
కివీస్‌తో సిరీస్‌లో ఆడి ఉంటే..
కాగా పడిక్కల్ దేశీ క్రికెట్‌లో కర్ణాటక తరఫున ఆడుతూ రోజురోజుకీ తన ప్రదర్శన మెరుగుపరుచుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే శ్రీలంకలో కూడా స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై అతడు అదరగొడుతున్నాడని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. సీనియర్లు మాత్రం స్పిన్‌ను ఎదుర్కోవడంలో తడబడుతున్నారని చురకలు అంటించాడు.
అదే విధంగా.. గతేడాది టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టెస్టుల్లో 3-0తో వైట్‌వాష్ అవడాన్ని మంజ్రేకర్ ఈ సందర్భంగా ప్రస్తావించాడు. ఒకవేళ నాటి జట్టుకు పడిక్కల్‌ను ఎంపిక చేసి ఉంటే భారత జట్టుకు ఈ దుస్థితి పట్టేదికాదని అభిప్రాయపడ్డాడు. ఏదేమైనా టెస్టుల్లో మూడో స్థానానికి పడిక్కల్ సరిగ్గా సరిపోతాడని పేర్కొన్నాడు.
న్యూజిలాండ్ గడ్డ మీద ఎలా ఆడతాడో!
అయితే, శ్రీలంకలో రాణిస్తున్నప్పటికీ న్యూజిలాండ్ గడ్డ మీద పడిక్కల్ ఆడే విధానాన్ని బట్టే.. జట్టులో అతడి స్థానం ఏమిటనేది తేలుతుందని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు. కాగా శ్రీలంక పర్యటనలో పడిక్కల్ ఇప్పటికే 328 పరుగులు సాధించి.. ఈ సిరీస్‌లో ఇరుజట్లలో కలిపి టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.
కాగా టీమిండియా స్వదేశంలో కివీస్‌తో పాటు సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లోనూ 0-2తో వైట్‌వాష్‌కు గురైన సంగతి తెలిసిందే. ఫలితంగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. శ్రీలంకను వైట్‌వాష్ చేయడంతో పాటు తదుపరి న్యూజిలాండ్ పర్యటనలో రాణిస్తేనే టీమిండియా ఫైనల్ ఆశలు సజీవంగా ఉంటాయి.


