IND VS SL: టీమిండియాకు బ్యాడ్‌ న్యూస్‌ | India vs Sri Lanka 2nd Test Day 3 Weather Update: Rain To Play Major Role In Colombo | Sakshi
Sakshi News home page

IND VS SL: టీమిండియాకు బ్యాడ్‌ న్యూస్‌

Aug 25 2026 7:28 AM | Updated on Aug 25 2026 7:28 AM

India vs Sri Lanka 2nd Test Day 3 Weather Update: Rain To Play Major Role In Colombo

source: BCCI X

టీమిండియాకు చేదు వార్త. కొలొంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు ఆటకు వర్షం ప్రధాన అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే రెండో రోజు మ్యాచ్‌కు పలుమార్లు వర్షం, మేఘావృత వాతావరణం అంతరాయం కలిగించింది.

మంగళవారం ఉదయం కొలంబోలో ఆకాశం మేఘావృతంగా ఉండటంతో పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. ఉష్ణోగ్రత సుమారు 31 డిగ్రీల సెల్సియస్‌గా ఉండనుండగా, ఉదయం వర్షం పడే అవకాశం 82 శాతంగా ఉంది. మధ్యాహ్నం కూడా వర్ష సూచనలు కొనసాగనున్నాయి. ఆ సమయంలో వర్షం పడే అవకాశం 56 శాతంగా అంచనా వేశారు.

సాయంత్రం పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. వర్షం పడే అవకాశం 86 శాతంగా ఉండటంతో పాటు మేఘావృతం 98 శాతం, తేమ 79 శాతం వరకు ఉండొచ్చని అంచనాలు చెబుతున్నాయి.

జురెల్‌ శతకంతో భారత్‌ భారీ స్కోరు
మ్యాచ్‌ విషయానికొస్తే భారత్‌ పూర్తి ఆధిపత్యంలో ఉంది. రెండో రోజు ధ్రువ్‌ జురెల్‌ అద్భుత శతకంతో భారత్‌ 503/9 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. జురెల్‌ 171 బంతుల్లో 9 ఫోర్లతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

రిషభ్‌ పంత్‌ 63 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడగా, జురెల్‌తో కలిసి ఏడో వికెట్‌కు 112 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి 8/2తో రెండో రోజు ఆటను ముగించింది.

ప్రస్తుతం శ్రీలంక 495 పరుగుల భారీ లోటుతో ఉంది. భారత్‌ ఇప్పటికే మ్యాచ్‌పై పట్టు సాధించిన నేపథ్యంలో మూడో రోజు వర్షం ఎంత మేరకు ఆటను ప్రభావితం చేస్తుందన్నది కీలకంగా మారింది.

పడిక్కల్‌ శతకం
వన్‌డౌన్‌ బ్యాటర్‌ పడిక్కల్‌ వరుసగా రెండో టెస్ట్‌లోనూ సెంచరీ చేశాడు. తొలి టెస్ట్‌లో భారీ శతకం చేసిన అతడు.. రెండో మ్యాచ్‌ తొలి రోజే సెంచరీ (117) పూర్తి చేశాడు. జురెల్‌, పడిక్కల్‌ సెంచరీలతో కదంతొక్కగా.. పంత్‌తో పాటు కెప్టెన్‌ గిల్‌ (50) కూడా అర్ద సెంచరీతో రాణించాడు. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (45), రవీంద్ర జడేజా (43) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు.

ఆధిక్యంలో భారత్‌
కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం శ్రీలంకలో పర్యటిస్తున్న భారత్‌ తొలి టెస్ట్‌లో విజయం సాధించి 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement