PC: BCCI/X
టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో విఫలమైనప్పటికీ.. వైట్‌బాల్ క్రికెట్‌లో మాత్రం గంభీర్‌ను పెద్దగా తప్పుపట్టాల్సిన పనిలేదన్నాడు. అయితే, వైట్‌బాల్ క్రికెట్‌లో కొంతమంది పేరు మోసిన ఆటగాళ్లను కూడా కూరలో కరివేపాకులా తీసేసారంటూ.. గంభీర్ బృందం తీరును విమర్శించాడు.
కాగా టీమిండియా ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసులో ఉండాలంటే లంకతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో వైట్‌వాషష్ చేయాల్సిందే. ఈ క్రమంలో తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్.. రెండో టెస్టులోనూ విజయంపై కన్నేసింది.
ఇదిలా ఉంటే.. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3-0, సౌతాఫ్రికా చేతిలో 2-0తో వైట్‌వాష్ కావడం వల్లే టీమిండియా డబ్ల్యూటీసీ ప్రయాణం కఠినంగా మారింది. ఈ నేపథ్యంలో గంభీర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. టెస్టు కోచ్‌గా అతడిని తొలగించాలనే అప్పట్లోనే డిమాండ్లు పెరిగాయి.
ఇక ఇటీవల టీమిండియా అనూహ్య రీతిలో ఐర్లాండ్ గడ్డ మీద ఆతిథ్య జట్టు చేతిలో కనీవినీ ఎరుగని రీతిలో 2-0తో టీ20 సిరీస్‌లో క్లీన్‌స్వీప్ అయింది. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో 4-0తో వైట్‌వాష్ అయిన భారత జట్టు.. వన్డే సిరీస్‌ను 1-2తో కోల్పోయింది. దీంతో వైట్‌బాల్ కోచ్‌గానూ గంభీర్ పనికిరాడనే విమర్శలు వచ్చాయి.
కాగా భారత్‌కు టీ20 ప్రపంచకప్-2026 టైటిల్ అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై యాజమాన్యం వేటువేసిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీ తర్వాత టీమిండియా తొలిసారిగా ఐర్లాండ్ పర్యటనకు వెళ్లగా.. సూర్యను కెప్టెన్‌గా తప్పించడమే కాకుండా జట్టులోనే స్థానం లేకుండా చేశారు. అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు అప్పగించారు.
మరోవైపు.. మహ్మద్ షమీ కూడా చాన్నాళ్లుగా పునరాగమనం కోసం ఎదురుచూస్తున్నా సెలక్టర్లు కరుణించడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ స్పందించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ..
‘‘కొంతమంది ఆటగాళ్లను మరీ కూరలో కరివేపాకులా తీసేసారు. వాళ్లను ఇంకాస్త మంచిగా చూసుకోవాల్సింది. సూర్య విషయంలో ఇదే జరిగింది. వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత అతడిపై నిర్దాక్షిణ్యంగా వేటువేశారు.
ఇక సూర్య మాదిరే మరో ప్లేయర్ షమీ కూడా ఉన్నాడు. వీరి విషయంలో మేనేజ్‌మెంట్ వ్యవహారశైలి ఇంకాస్త మెరుగ్గా ఉంటే బాగుండేది. ఇవి తప్ప వైట్‌బాల్ క్రికెట్‌లో గంభీర్‌ను తప్పుబట్టడానికి పెద్దగా ఏమీ లేదు’’ అని వసీం జాఫర్ పేర్కొన్నాడు.
అదే విధంగా.. ‘‘టెస్టుల్లో మాత్రం సొంతగడ్డపై న్యూజిలాండ్, సౌతాఫ్రికా చేతిలో టీమిండియా వైట్‌వాష్ కావడం సాధారణ విషయం కాదు. ఈ మచ్చ గంభీర్ కెరీర్‌పై ఎప్పటికీ ఉండిపోతుంది. అతడితో పాటు కెప్టెన్, ఆటగాళ్లు కూడా ఈ భారాన్ని మోయాల్సి ఉంటుంది.
విదేశీ జట్లకు టీమిండియాను వారి స్వదేశంలో ఓడించడం అంత సులువు కాదు. అలాంటిది ఏకంగా రెండు వైట్‌వాష్‌లు. ఒకవేళ మనం ఆ సిరీస్ గెలిచి ఉంటే.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఇప్పుడు అగ్రస్థానంలో ఉండేవాళ్లము. టెస్టు కోచ్‌గా గంభీర్ ఇంకా మెరుగుపడాలి. అతడొక్కడే కాదు.. జట్టు కూడా మారాలి.
అయితే, కొన్నిసార్లు సెలక్షన్ విషయంలో తప్పిదాల వల్ల కూడా మూల్యం చెల్లించాల్సి వస్తుంది’’ అని వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. కాగా గంభీర్ మార్గదర్శనంలో టీమిండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (వన్డే)-2025, టీ20 ప్రపంచకప్-2026 టైటిళ్లు గెలిచింది. అయితే, డబ్ల్యూటీసీ 2025 ఫైనల్‌కు మాత్రం చేరలేకపోయింది.


