రిషభ్ పంత్ (PC: BCCI X)
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. విదేశీ, తటస్థ వేదికలపై భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన వికెట్ కీపర్ బ్యాటర్‌గా రికార్డు సాధించాడు. ఈ క్రమంలో దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు.
విజయంతో మొదలు
కాగా టీమిండియా ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా ఆతిథ్య జట్టుతో రెండు టెస్టులు ఆడుతోంది. తొలి టెస్టులో లంకపై 165 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన భారత్.. కొలంబో వేదికగా ఆదివారం రెండో టెస్టు మొదలుపెట్టింది.
గాయపడిన పంత్
సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు ఆట పూర్తయ్యేసరికి ఐదు వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. అయితే, ఆదివారం ఆట సందర్భంగా పంత్ గాయపడి.. మూడు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మైదానాన్ని వీడాడు.
రీఎంట్రీ ఇచ్చి.. సరికొత్త చరిత్ర
ఈ క్రమంలో సోమవారం నాటి రెండో ఆట మొదలైన కాసేపటికే నైట్‌వాచ్‌మన్ సారాంశ్ జైన్ (6) అవుట్ కాగా.. పంత్ రీఎంట్రీ ఇచ్చాడు. ధ్రువ్ జురెల్‌తో కలిసి నిలకడగా ఆడిన పంత్.. డ్రింక్స్ బ్రేక్ సమయానికి 50 బంతుల్లో 30 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో విదేశీ, తటస్థ వేదికలపై టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన వికెట్ కీపర్ బ్యాటర్‌గా పంత్ రికార్డు సృష్టించాడు.
ఇదిలా ఉంటే.. సోమవారం నాటి రెండో రోజు ఆటలో భోజన విరామ సమయానికి.. టీమిండియా 112 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 419 పరుగులు సాధించింది. రిషభ్ పంత్ 63, ధ్రువ్ జురెల్ 59 పరుగులతో ఉన్నారు.
And just like that, Rishabh Pant is back to his old tricks! 😏🔥
Watch #SLvIND, 2nd Test, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/JLfk3vXwg0— Sony Sports Network (@SonySportsNetwk) August 24, 2026
విదేశీ, తటస్థ వేదికలపై టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్లు వీరే
1. రిషభ్ పంత్- 2501 పరుగులు (సగటు 41.68)
2. మహేంద్ర సింగ్ ధోని- 2496 పరుగులు (సగటు 32.84)
3. ఫారూఖ్ ఇంజనీర్- 1209 పరుగులు (సగటు 32.67)
4. సయ్యద్ కీర్మాణి- 1109 పరుగులు (సగటు 21.74)
5. కిరణ్ మోరే- 901 పరుగులు (సగటు 29.06).


