జైస్వాల్‌-అసిత ఘటనపై భారత బ్యాటింగ్‌ కోచ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు | India Coach Breaks Silence On Yashasvi Jaiswal, Asitha Fernando Fight | Sakshi
Sakshi News home page

జైస్వాల్‌-అసిత ఘటనపై భారత బ్యాటింగ్‌ కోచ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Aug 24 2026 7:29 AM | Updated on Aug 24 2026 7:34 AM

India Coach Breaks Silence On Yashasvi Jaiswal, Asitha Fernando Fight

source: BCCI X

భారత్-శ్రీలంక మధ్య కొలంబో టెస్టు తొలి రోజు ఆటలో చోటుచేసుకున్న యశస్వి జైస్వాల్‌, శ్రీలంక పేసర్‌ అసిత ఫెర్నాండో మధ్య వాగ్వాదంపై భారత బ్యాటింగ్ కోచ్‌ సితాన్షు కోటక్ స్పందించాడు. జైస్వాల్‌ బౌలర్‌కు అంత దగ్గరగా వెళ్లడం సరైంది కాదని, అయితే టెస్టు క్రికెట్‌లో తీవ్ర పోటీ మధ్య ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు చోటుచేసుకుంటాయని ఆయన పేర్కొన్నాడు.

తొలి రోజు ఉదయం సెషన్‌లో ఈ ఘటన జరిగింది. ఫెర్నాండో వేసిన ఓవర్లో జైస్వాల్‌ వరుసగా మూడు ఫోర్లు బాదాడు. అయితే అదే ఓవర్లో ఫెర్నాండో జైస్వాల్‌ను ఔట్ చేశాడు. అనంతరం శ్రీలంక ఆటగాళ్లతో కలిసి ఫెర్నాండో సంబరాలు చేసుకుంటూ జైస్వాల్‌కు సెండ్‌ఆఫ్ ఇచ్చినట్లు కనిపించింది.

దీంతో ఆగ్రహించిన జైస్వాల్‌ వెనక్కి తిరిగి ఫెర్నాండో వైపు నడుచుకుంటూ వెళ్లాడు. ఇద్దరూ ఎదురెదురుగా వచ్చి తలలతో ఢీకొట్టుకున్నారు. వెంటనే శ్రీలంక ఆటగాళ్లు జోక్యం చేసుకుని ఇద్దరినీ విడదీశారు.

ఈ ఘటనపై సితాన్షు కోటక్ మాట్లాడుతూ, “బౌలర్‌ ఏదో వ్యాఖ్య చేశాడని అనుకుంటున్నాను. అది ఉద్వేగభరిత పరిస్థితుల్లో జరిగింది. జైస్వాల్‌ అతడి దగ్గరకు అంతగా వెళ్లకూడదు. కానీ ఆ క్షణంలో అలా జరిగిపోయింది” అని చెప్పాడు.

శ్రీలంక బౌలింగ్ కోచ్‌ రియాన్ వాన్ నీకెర్క్ కూడా ఇదే తరహాలో స్పందించాడు. టెస్టు క్రికెట్‌లో భారత్ వంటి జట్టుతో ఆడుతున్నప్పుడు బౌలర్లు ఎప్పుడూ పోరాట స్ఫూర్తితో ఉండాలని, ఆటలోని తీవ్రమైన భావోద్వేగాలే ఇలాంటి మాటల మార్పిడికి కారణమవుతాయని పేర్కొన్నాడు.

“ఇది కఠినమైన టెస్టు క్రికెట్. భారత్ లాంటి జట్టుతో ఆడుతున్నప్పుడు వెనక్కి తగ్గి కేవలం బంతులు వేయడం సాధ్యం కాదు. ఎప్పుడూ సవాలు విసురుతూ, ఏదో ఒకటి సృష్టించేందుకు ప్రయత్నించాలి. మాటల తూటాలు కూడా ఆ భావోద్వేగాల నుంచి వచ్చినవే” అని వాన్ నీకెర్క్ తెలిపాడు.

అయితే కోచ్‌ల మాదిరిగా మ్యాచ్‌ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ఈ ఘటనను తేలికగా తీసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఆటగాళ్లకు సెండ్‌ఆఫ్‌లు, అనుచిత ప్రవర్తనపై ఐసీసీ నిబంధనలు ఉన్నాయి. వీడియో ఫుటేజీ పరిశీలనలో జైస్వాల్‌, ఫెర్నాండో మధ్య అనుచిత వ్యవహారం జరిగినట్లు తేలితే ఇద్దరిపైనా లేదా సంబంధిత ఆటగాడిపైనా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే, కొలొంబో టెస్ట్‌ తొలి రోజు భారత బ్యాటర్లు పైచేయి సాధించారు. వన్‌ డౌన్‌ బ్యాటర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ (117) వరుసగా రెండో టెస్ట్‌లో సెంచరీతో కదంతొక్కగా.. శుభ్‌మన్‌ గిల్‌ (50), యశస్వి జైస్వాల్‌ (45), రవీంద్ర జడేజా (43) రాణించారు. 

కేఎల్‌ రాహుల్‌ (18) నిరాశపర్చగా.. రిషబ్‌ పంత్‌ (3) రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ స్కోర్‌ 300-5గా ఉంది. ధ్రువ్‌ జురెల్‌ (7), సరాన్ష్‌ జైన్‌ (4) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్‌ సిరీస్‌లో భారత్‌ తొలి టెస్ట్‌ గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement