ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో మెరిసిన ఫ్రాన్స్ షట్లర్లు
తొలిసారి రెండు వరల్డ్ టైటిల్స్ సొంతం
పురుషుల సింగిల్స్‌లో జగజ్జేతగా అలెక్స్ లానియర్
మిక్స్‌డ్ డబుల్స్ విన్నర్స్‌గా థోమ్ గికెల్–డెల్ఫిన్ డెల్‌ర్యూ జోడీ
బ్యాడ్మింటన్ అంటే ముందుగా గుర్తుకొచ్చే దేశాలు చైనా, ఇండోనేసియా, దక్షిణ కొరియా, మలేసియా, థాయ్‌లాండ్, చైనీస్ తైపీ, భారత్, సింగపూర్, డెన్మార్క్... ప్రపంచ బ్యాడ్మింటన్‌లో ఈ దేశాల ఆటగాళ్లదే గుత్తాధిపత్యం... ఏ స్థాయి టోర్నీ అయినా ఒక విభాగంలో కాకపోతే మరో విభాగంలో ఈ దేశాల క్రీడాకారులే విజేతలుగా కనిపిస్తుంటారు. ఇక నుంచి కొన్నేళ్లపాటు పై దేశాల ఆటగాళ్ల సరసన కొత్తగా ఫ్రాన్స్ దేశ ప్లేయర్లు కూడా పోడియంపై చాలాసార్లు కనిపించడం మొదలవుతుంది. కారణం కొన్నాళ్లుగా ఆసియా ఆటగాళ్లకు దీటుగా ఫ్రాన్స్ షట్లర్లు మెరిపిస్తున్నారు.
తాజాగా ఆదివారం న్యూఢిల్లీలో ముగిసిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఎవ్వరూ ఊహించని విధంగా ఫ్రాన్స్ ప్లేయర్లు రెండు విభాగాల్లో విశ్వ విజేతలుగా అవతరించారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో థోమ్ గికెల్–డెల్ఫిన్ డెల్‌ర్యూ జోడీ...పురుషుల సింగిల్స్‌లో అలెక్స్ లానియర్ ప్రపంచ టైటిల్స్ సాధించి అదరగొట్టారు. 49 ఏళ్ల ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ చరిత్రలో ఫ్రాన్స్ జట్టు ఖాతాలో చేరిన తొలి రెండు స్వర్ణ పతకాలు ఇవే కావడం విశేషం. 1983 తర్వాత యూరోప్ దేశానికి చెందిన చెందిన ప్లేయర్లు రెండు విభాగాల్లో విజేతలుగా నిలవడం మరో విశేషం.
న్యూఢిల్లీ: ఫ్రాన్స్ బ్యాడ్మింటన్ ప్లేయర్లకు న్యూఢిల్లీ ఎప్పటికీ గుర్తిండిపోనుంది. తమ దేశ బ్యాడ్మింటన్ చరిత్రలోనే ఆదివారం ఫ్రాన్స్ ప్లేయర్లు అతిపెద్ద విజయాలు అందుకోవడం దీనికి కారణం. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తొలిసారి ఫ్రాన్స్ దేశం నుంచి విశ్వవిజేతలు అవతరించారు. ఆదివారం ముగిసిన 30వ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో ప్రపంచ ఐదో ర్యాంక్ జోడీ థోమ్ గికెల్–డెల్ఫిన్ డెల్‌ర్యూ ద్వయం... పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ 10వ ర్యాంకర్ అలెక్స్ లానియర్ టైటిల్స్ దక్కించుకున్నారు.
మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో గికెల్–డెల్ఫిన్ జోడీ 22–20, 19–21, 21–15తో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ ద్వయం ఫెంగ్ యాన్ జె–హువాంగ్ డాంగ్ పింగ్‌ను బోల్తా కొట్టించింది. 78 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో గికెల్–డెల్ఫిన్ జంట అద్భుత సమన్వయంతో ఆడి చైనా జోడీకి చెక్ పెట్టింది. గతంలో ఫెంగ్ యాన్ జె–హువాంగ్ డాంగ్ పింగ్‌లతో ఆడిన నాలుగుసార్లూ ఓడిపోయిన గికెల్–డెల్ఫిన్ ఐదో ప్రయత్నంలో చిరస్మరణీయ విజయం అందుకున్నారు. నిర్ణాయక మూడో గేమ్‌లో ఫ్రాన్స్ జంట ఆరంభంలోనే 3–0తో ఆధిక్యంలోకి వెళ్లి వెనుదిరిగి చూడలేదు.

ఈ గేమ్ మొత్తంలో ఒక్కసారి కూడా స్కోరు సమం కాకపోవడం గమనార్హం. రెండుసార్లు 12–11తో, 15–14తో ఆధిక్యం ఒక్క పాయింట్‌కు తగ్గిపోయింది. కీలకదశలో ఫ్రాన్స్ జోడీ విజృంభించి స్కోరు 15–14 వద్ద వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి 19–14తో ముందంజ వేసింది. ఆ తర్వాత చైనా జంటకు ఒక పాయింట్ సమర్పించుకొని విజయానికి అవసరమైన రెండు పాయింట్లు గెలిచి గికెల్–డెల్ఫిన్ సంబరాల్లో మునిగిపోయింది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో విజేతలకు స్వర్ణ, రజత, కాంస్య పతకాలు ప్రదానం చేస్తారు తప్ప ఎలాంటి ప్రైజ్‌మనీ ఇవ్వరు.
ఏకపక్షంగా...
పురుషుల సింగిల్స్ విభాగంలో అలెక్స్ లానియర్ రూపంలో మరో కొత్త చాంపియన్ అవతరించాడు. కేవలం 50 నిమిషాల్లో పదో ర్యాంకర్ లానియర్ 21–11, 21–11తో 11వ ర్యాంకర్ కొడాయ్ నరోకా (జపాన్)పై నెగ్గాడు. 2023లో వితిద్‌సర్న్ (థాయ్‌లాండ్), 2025లో షి యుకీ (చైనా) విజేతలుగా నిలిచారు. ఒలింపిక్స్ జరిగిన ఏడాది కావడంతో 2024లో ప్రపంచ చాంపియన్‌షిప్‌ను నిర్వహించలేదు. ఈసారి డిఫెండింగ్ చాంపియన్ షి యుకీ తొలి రౌండ్‌లోనే ఓడిపోవడంతో ఇతర ఆటగాళ్లకు టైటిల్ ద్వారాలు తెరుచుకున్నాయి.
కాస్త అనుకూలమైన ‘డ్రా’ పడటంతో లానియర్ దీనిని సద్వినియోగం చేసుకొని టైటిల్ పోరుకు దూసుకొచ్చాడు. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మాజీ చాంపియన్ వితిద్‌సర్న్‌పై 19–21, 21–16, 21–16తో ఓడించిన లానియర్... సెమీఫైనల్లో 16–21, 21–13, 21–14తో ప్రపంచ 7వ ర్యాంకర్ విక్టర్ లాయ్ (కెనడా)పై గెలుపొందాడు. ఫైనల్లో మాత్రం లానియర్‌కు ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాలేదు. వరుస గేముల్లో నరోకాను ఓడించిన లానియర్ జగజ్జేతగా నిలిచాడు.
అకానె జోరుకు ఆన్ సె యంగ్ బ్రేక్
మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా) రెండోసారి టైటిల్ సొంతం చేసుకుంది. 2023 చాంపియన్ ఆన్ సె యంగ్ 49 నిమిషాల్లో 21–17, 21–14తో ప్రపంచ రెండో ర్యాంకర్, డిఫెండింగ్ చాంపియన్ అకానె యామగుచి (జపాన్)పై గెలిచింది. ఆన్ సె యంగ్, అకానె యామగుచి ఇప్పటి వరకు 35 సార్లు ముఖాముఖిగా తలపడటం విశేషం. ఆన్ సె యంగ్ 20 సార్లు.. అకానె 15 సార్లు గెలుపొందారు. 2021, 2022, 2025లలో విశ్వవిజేతగా నిలిచిన అకానె యామగుచి ఈసారి గెలిచి ఉంటే మహిళల సింగిల్స్‌లో అత్యధికసార్లు టైటిల్ గెలిచిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పేది. అకానె యామగుచి, కరోలినా మారిన్ (స్పెయిన్) మూడుసార్లు చొప్పున ప్రపంచ టైటిల్ సాధించారు.

2019 తర్వాత ఒక్క స్వర్ణమే...
ఈసారి చైనా ప్లేయర్ల పతకాల వేటకు అడ్డుకట్ట పడింది. 2019 తర్వాత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో చైనా ఖాతాలో ఒక్క స్వర్ణమే చేరింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో మూడో ర్యాంక్ లియాంగ్ వె కెంగ్–వాంగ్ చాంగ్ (చైనా) జోడీ కేవలం 35 నిమిషాల్లో 21–17, 21–16తో నాలుగో ర్యాంక్ జంట ఆరోన్ చియా–సో వుయ్ యిక్ (మలేసియా)ను ఓడించింది. దాంతో 2018 తర్వాత పురుషుల డబుల్స్‌లో చైనాకు స్వర్ణ పతకం లభించింది.

21 ఏళ్ల తర్వాత...
మహిళల డబుల్స్ విభాగంలో ప్రపంచ మూడో ర్యాంక్ జోడీ బేక్ హానా–లీ సోహి (దక్షిణ కొరియా) టైటిల్‌ను సొంతం చేసుకుంది. 51 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో బేక్ హానా–లీ సోహి 21–15, 21–15తో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ జంట, డిఫెండింగ్ చాంపియన్ లియు షెంగ్ షు–టాన్ నింగ్ (చైనా)ను బోల్తా కొట్టించింది. దాంతో 21 ఏళ్ల తర్వాత ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల డబుల్స్‌లో కొరియా జోడీకి టైటిల్ లభించింది. చివరిసారి 1995లో గిల్ యంగ్ ఆ–జాంగ్ హైఓక్ జోడీ కొరియాకు మహిళల డబుల్స్‌లో టైటిల్ అందించింది.


