సరికొత్త ఈక్వల్ ఎర్త్ మ్యాప్ సిద్ధం
ఐక్యరాజ్యసమితి ఆమోదం
అమెరికా వ్యతిరేకం, భారత్ మద్దతు
అవును. మీరు చదివింది అక్షరాలా నిజం. ఎప్పుడో జీపీఎస్, లైడార్ వంటి టెక్నాలజీలేవీ లేని కాలంలో ఫ్రెంచ్ కార్టోగ్రాఫర్ మెర్కాటర్ తయారు చేసిన మ్యాప్ స్థానంలో ఐక్యరాజ్యసమితి సరికొత్త ప్రపంచ పటాన్ని అధికారికంగా ఆమోదించింది.
పాత మ్యాప్‌లో ఆఫ్రికా, లాటిన్ అమెరికా, దక్షిణాసియాలు వాటి వాస్తవ సైజు కంటే తక్కువగా కనిపిస్తున్నాయని, దాన్ని సరిచేస్తూ ‘ఈక్వల్ ఎర్త్’పేరుతో కొత్త మ్యాప్ తయారు చేశామని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. భారత్ సహా మొత్తం 164 దేశాలు ఈ ప్రతిపాదనకు మద్దతు తెలపగా అగ్రరాజ్యం అమెరికా వ్యతిరేకించింది. ఆరు దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయాయి. విద్య, మీడియా, అంతర్జాతీయ విధానాల్లో దేశాలకు తగిన ప్రాధా న్యం లభించాలన్నది ఈ మార్పు ఉద్దేశం.
ఒకసారి ప్రపంచపటాన్ని చూడండి. ఎగువభాగంలో గ్రీన్‌ల్యాండ్.. దిగువన ఆఫ్రికా ఖండం కనిపిస్తాయి. రెండింటిలో ఏది పెద్దదంటే మీరేమంటారు? సహజంగానే గ్రీన్‌ల్యాండ్ అని సమాధానం వస్తుంది. కానీ.. దీంతోపోలిస్తే ఆఫ్రికా ఒకటి కాదు..రెండు కాదు.. 14 రెట్లు ఎక్కువ సైజుంటుంది. మెర్కాటర్ అనే మ్యాపుల తయారీదారు 1569లో సిద్ధం చేసిన మ్యాప్‌నే మనం ఇప్పటికీ వాడుతూండటం దీనికి కారణం. ఇదొక్కటే కాదు.. ఇలాంటి తేడాలు ఇంకా చాలానే ఉన్నాయి దీంట్లో.
ప్రపంచాన్ని కాగితంపై చూపించడానికి చేసుకున్న ఎన్నో రాజీల్లో మెర్కాటర్ మ్యాప్ ఒకటి. భూమి గుండ్రంగా త్రీడీలో ఉంటే.. కాగితం 2డీలో ఉండటం అసలు సమస్యకు కారణం. దీన్ని సరిచేసేందుకు మ్యాప్ ప్రొజెక్షన్ పద్ధతిని ఉపయోగించారు. ఫలితంగా ప్రపంచ ప్రఖ్యాత మెర్కాటర్ ప్రొజెక్షన్‌లో తేడాలు వచ్చేశాయి. భూమధ్య రేఖకు దూరంగా జరుగుతున్న కొద్దీ మ్యాప్‌లోని భూభాగాల పరిమాణం పెరిగిపోతూ ఉంటుంది.
అయితే అప్పట్లో మెర్కాటర్ ఈ మ్యాపును కేవలం సముద్రయానం కోసం మాత్రమే తయారు చేశాడు. అందుకే ఆఫ్రికా విస్తీర్ణం 303.7 కోట్ల చదరపు కిలోమీటర్లయినా.. మెర్కాటర్ మ్యాప్‌లో 21.7 కోట్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మాత్రమే ఉన్న గ్రీన్‌ల్యాండ్ కంటే చిన్నగా కనిపిస్తూంటుంది. అప్పట్లో సముద్రయానానికి మెర్కాటర్ మ్యాప్ బాగా పనిచేసింది కానీ.. ఈ తేడాలు అనేక ఇతర సమస్యలను తీసుకొచ్చాయి. ఈక్వల్ ఎర్త్ మ్యాప్ అవసరం ఏర్పడింది ఇందుకే.
బోజన్ సావ్రిచ్, టామ్ ప్యాటర్సన్, బెర్న్‌హార్డ్ జెన్నీ అనే ముగ్గురు కార్టోగ్రాఫర్‌లు 2018లో ‘ఈక్వల్ ఎర్త్’మ్యాప్‌ను రూపొందించారు. భూభాగాల విస్తీర్ణాన్ని సరిగ్గా చూపించడం ఈ ప్రొజెక్షన్ ముఖ్య ఉద్దేశం. అంతేకాదు...లెక్కల్లో గట్టిగా ఉండటమే కాకుండా.. చూసేందుకు కూడా సహజంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
వాస్తవానికి ప్రపంచ పటం విషయంలో కొన్ని వందల ప్రొజెక్షన్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ వీటిల్లో మెర్కాటర్ సహా ఓ డజను మాత్రమే ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈక్వల్ ఎర్త్ ప్రొజెక్షన్‌లో భూభాగాల పరిమాణాలు వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఉండటం వల్ల ఎవరో పెద్ద... మిగిలిన వారు చిన్న అన్న భావన భావన ఏర్పడే అవకాశం ఉండదని మద్దతుదారుల అంచనా.
ఆఫ్రికా దేశాల ఉద్యమం
ఈక్వల్ ఎర్త్ ప్రొజెక్షన్ మ్యాప్ ముఖ్యంగా ఆఫ్రికా దేశాల ఉద్యమం ఫలితంగానే సాకారమైందని చెప్పాలి. ఆఫ్రికన్ దేశం టోగో కొత్త మ్యాప్ ప్రతిపాదన చేయగా ఆఫ్రికన్ యూనియన్ మద్దతు ఇచ్చింది. ఆఫ్రికా పరిమాణాన్ని సరిగ్గా చూపడమే కాకుండా... పాత అసమానతలను సరి చేయాలన్నది ఆఫ్రికా దేశాల ఉద్దేశం. ఇందుకు తగ్గట్టుగానే ఐరాస తీర్మానం కూడా పాఠశాలల్లో, పాఠ్యపుస్తకాల్లో మీడియా, సంస్థలు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఈక్వల్ ఎర్త్ వంటి ప్రొజెక్షన్ల వినియోగాన్ని పెంచమని కోరుతోంది.
– సాక్షి, నేషనల్ డెస్క్


