breaking news
Cartographers
-
ప్రపంచం మారిపోయింది!
అవును. మీరు చదివింది అక్షరాలా నిజం. ఎప్పుడో జీపీఎస్, లైడార్ వంటి టెక్నాలజీలేవీ లేని కాలంలో ఫ్రెంచ్ కార్టోగ్రాఫర్ మెర్కాటర్ తయారు చేసిన మ్యాప్ స్థానంలో ఐక్యరాజ్యసమితి సరికొత్త ప్రపంచ పటాన్ని అధికారికంగా ఆమోదించింది. పాత మ్యాప్‌లో ఆఫ్రికా, లాటిన్ అమెరికా, దక్షిణాసియాలు వాటి వాస్తవ సైజు కంటే తక్కువగా కనిపిస్తున్నాయని, దాన్ని సరిచేస్తూ ‘ఈక్వల్ ఎర్త్’పేరుతో కొత్త మ్యాప్ తయారు చేశామని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. భారత్ సహా మొత్తం 164 దేశాలు ఈ ప్రతిపాదనకు మద్దతు తెలపగా అగ్రరాజ్యం అమెరికా వ్యతిరేకించింది. ఆరు దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయాయి. విద్య, మీడియా, అంతర్జాతీయ విధానాల్లో దేశాలకు తగిన ప్రాధా న్యం లభించాలన్నది ఈ మార్పు ఉద్దేశం. ఒకసారి ప్రపంచపటాన్ని చూడండి. ఎగువభాగంలో గ్రీన్‌ల్యాండ్.. దిగువన ఆఫ్రికా ఖండం కనిపిస్తాయి. రెండింటిలో ఏది పెద్దదంటే మీరేమంటారు? సహజంగానే గ్రీన్‌ల్యాండ్ అని సమాధానం వస్తుంది. కానీ.. దీంతోపోలిస్తే ఆఫ్రికా ఒకటి కాదు..రెండు కాదు.. 14 రెట్లు ఎక్కువ సైజుంటుంది. మెర్కాటర్ అనే మ్యాపుల తయారీదారు 1569లో సిద్ధం చేసిన మ్యాప్‌నే మనం ఇప్పటికీ వాడుతూండటం దీనికి కారణం. ఇదొక్కటే కాదు.. ఇలాంటి తేడాలు ఇంకా చాలానే ఉన్నాయి దీంట్లో. ప్రపంచాన్ని కాగితంపై చూపించడానికి చేసుకున్న ఎన్నో రాజీల్లో మెర్కాటర్ మ్యాప్ ఒకటి. భూమి గుండ్రంగా త్రీడీలో ఉంటే.. కాగితం 2డీలో ఉండటం అసలు సమస్యకు కారణం. దీన్ని సరిచేసేందుకు మ్యాప్ ప్రొజెక్షన్ పద్ధతిని ఉపయోగించారు. ఫలితంగా ప్రపంచ ప్రఖ్యాత మెర్కాటర్ ప్రొజెక్షన్లో తేడాలు వచ్చేశాయి. భూమధ్య రేఖకు దూరంగా జరుగుతున్న కొద్దీ మ్యాప్‌లోని భూభాగాల పరిమాణం పెరిగిపోతూ ఉంటుంది. అయితే అప్పట్లో మెర్కాటర్ ఈ మ్యాపును కేవలం సముద్రయానం కోసం మాత్రమే తయారు చేశాడు. అందుకే ఆఫ్రికా విస్తీర్ణం 303.7 కోట్ల చదరపు కిలోమీటర్లయినా.. మెర్కాటర్ మ్యాప్‌లో 21.7 కోట్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మాత్రమే ఉన్న గ్రీన్‌ల్యాండ్ కంటే చిన్నగా కనిపిస్తూంటుంది. అప్పట్లో సముద్రయానానికి మెర్కాటర్ మ్యాప్ బాగా పనిచేసింది కానీ.. ఈ తేడాలు అనేక ఇతర సమస్యలను తీసుకొచ్చాయి. ఈక్వల్ ఎర్త్ మ్యాప్ అవసరం ఏర్పడింది ఇందుకే. బోజన్ సావ్రిచ్, టామ్ ప్యాటర్సన్, బెర్న్‌హార్డ్ జెన్నీ అనే ముగ్గురు కార్టోగ్రాఫర్లు 2018లో ‘ఈక్వల్ ఎర్త్’మ్యాప్‌ను రూపొందించారు. భూభాగాల విస్తీర్ణాన్ని సరిగ్గా చూపించడం ఈ ప్రొజెక్షన్ ముఖ్య ఉద్దేశం. అంతేకాదు...లెక్కల్లో గట్టిగా ఉండటమే కాకుండా.. చూసేందుకు కూడా సహజంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. వాస్తవానికి ప్రపంచ పటం విషయంలో కొన్ని వందల ప్రొజెక్షన్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ వీటిల్లో మెర్కాటర్ సహా ఓ డజను మాత్రమే ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈక్వల్ ఎర్త్ ప్రొజెక్షన్లో భూభాగాల పరిమాణాలు వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఉండటం వల్ల ఎవరో పెద్ద... మిగిలిన వారు చిన్న అన్న భావన భావన ఏర్పడే అవకాశం ఉండదని మద్దతుదారుల అంచనా.ఆఫ్రికా దేశాల ఉద్యమం ఈక్వల్ ఎర్త్ ప్రొజెక్షన్ మ్యాప్ ముఖ్యంగా ఆఫ్రికా దేశాల ఉద్యమం ఫలితంగానే సాకారమైందని చెప్పాలి. ఆఫ్రికన్ దేశం టోగో కొత్త మ్యాప్ ప్రతిపాదన చేయగా ఆఫ్రికన్ యూనియన్ మద్దతు ఇచ్చింది. ఆఫ్రికా పరిమాణాన్ని సరిగ్గా చూపడమే కాకుండా... పాత అసమానతలను సరి చేయాలన్నది ఆఫ్రికా దేశాల ఉద్దేశం. ఇందుకు తగ్గట్టుగానే ఐరాస తీర్మానం కూడా పాఠశాలల్లో, పాఠ్యపుస్తకాల్లో మీడియా, సంస్థలు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఈక్వల్ ఎర్త్ వంటి ప్రొజెక్షన్ల వినియోగాన్ని పెంచమని కోరుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆదరణ పెరుగుతున్న కెరీర్.. కార్టోగ్రాఫర్
ఒక ప్రాంత భౌగోళిక పరిస్థితులను, రూపురేఖలను తెలుసుకోవడానికి ఏకైక ఆధారం.. పటాలు(మ్యాప్స్). దేశాల మధ్య సరిహద్దులు, కొండలు, నదులు, సముద్రాలు, మైదానాలు, పీఠభూములు, నగరాలు, పట్టణాలు, పల్లెలు.. ఇలా భూమిపై ఉండే సమస్తాన్ని కళ్లముందుంచేవి పటాలే. మ్యాప్‌ల రూపకర్తలనే కార్టోగ్రాఫర్లు అంటారు. ఆధునిక కాలంలో ఎన్నో రంగాల్లో పటాల అవసరం ఉంటోంది. విదేశాల్లో డిమాండ్ కలిగిన కార్టోగ్రఫీ కెరీర్ ప్రస్తుతం మన దేశంలోనూ క్రమంగా ఆదరణ పొందుతోంది. అవకాశాలు ఎన్నెన్నో... కార్టోగ్రఫీ కోర్సులను అభ్యసించినవారికి రక్షణ శాఖ, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్(ఎన్ఐసీ), అగ్రికల్చర్ ఇంజనీరింగ్, విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, టెలి కమ్యూనికేషన్స్, ఉన్నత విద్య, పరిశోధనా కేంద్రాలు, స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, నేషనల్ సర్వే అండ్ మ్యాపింగ్ సంస్థలు, జియోలాజికల్ సర్వే, లాండ్ మేనేజ్మెంట్, ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ సర్వీసెస్, జాతీయ పార్కులు, ఫారెస్ట్ సర్వీస్, ఐటీ పరిశ్రమ, భూగర్భ గనుల సంస్థలు, డిజాస్టర్ మేనేజ్మెంట్, రవాణా, మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్ మేనేజ్మెంట్ వంటి విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి. సర్వేలు నిర్వహించే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో కార్టోగ్రాఫర్ల భాగస్వామ్యం తప్పనిసరి. కంప్యూటర్/మ్యాథమెటికల్/డిజైన్ స్కిల్స్ ఉన్నవారు ఈ రంగంలో సులువుగా రాణించొచ్చు. జియోమాటిక్స్ కన్సల్టెంట్, రీసెర్చ్ ఫెలో, పోస్ట్-డాక్టోరల్ ఫెలో, జీఐఎస్ అనలిస్ట్/కో-ఆర్డినేటర్, మ్యాపింగ్ సైంటిస్ట్, ప్రొఫెసర్, టెక్నికల్ సపోర్ట్ అనలిస్ట్, జీఐఎస్ సేల్స్ మేనేజర్, ఇంటర్నెట్ ప్రొడక్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, అప్లికేషన్స్ ప్రోగ్రామర్.. ఇలా వివిధ హోదాల్లో పనిచేయొచ్చు. కావాల్సిన నైపుణ్యాలు: కార్టోగ్రాఫర్లు విధుల్లో భాగంగా క్షేత్రస్థాయిలో విస్తృతంగా తిరగాల్సి ఉంటుంది. ఇందులో శారీరక శ్రమ, ఒత్తిళ్లు అధికం. వీటిని తట్టుకొనేవారే కార్టోగ్రఫీని కెరీర్‌గా ఎంచుకోవాలి. మెరుగైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఎప్పటికప్పుడు వృత్తిపరమైన పరిజ్ఞానం పెంచుకోవాలి. అర్హతలు: భారత్‌లో కార్టోగ్రఫీలో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్, పీజీ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్మీడియెట్ తర్వాత గ్రాడ్యుయేషన్‌లో చేరొచ్చు. ఇందులో ఉత్తీర్ణత సాధించి, పీజీ కూడా పూర్తి చేస్తే మంచి అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. బీఎస్సీ జాగ్రఫీ, ఎంఎస్సీ జాగ్రఫీ, ఎంఎస్సీ అప్లయిడ్ జాగ్రఫీ, ఎంఎస్సీ స్పేషియల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంఎస్సీ జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఎంఎస్సీ రిమోట్ సెన్సింగ్, ఎంఎస్సీ జియో ఇన్ఫర్మాటిక్స్, ఎంటెక్ జియోఇన్ఫర్మాటిక్స్, పీజీ డిప్లొమా ఇన్ జీఐఎస్ వంటి కోర్సులు చేసినవారు కూడా ఈ రంగంలో అడుగుపెట్టొచ్చు. వేతనాలు: కార్టోగ్రాఫర్లకు పని చేస్తున్న సంస్థను బట్టి జీతభత్యాలు అందుతాయి. ప్రారంభంలో నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు పొందొచ్చు. కనీసం రెండేళ్ల అనుభవం సంపాదిస్తే నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వేతనం ఉంటుంది. కార్పొరేట్ సంస్థలు రూ.లక్షల్లో వేతన ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: ఇండియన్ నేషనల్ కార్టోగ్రాఫిక్ అసోసియేషన్ వెబ్సైట్: www.incaindia.org మద్రాస్ యూనివర్సిటీ వెబ్సైట్: www.unom.ac.in అన్నామలై యూనివర్సిటీ వెబ్సైట్: http://annamalaiuniversity.ac.in/ జామియా మిలియా ఇస్లామియా-ఢిల్లీ వెబ్సైట్: www.jmi.ac.in ఉత్కళ్ యూనివర్సిటీ-భువనేశ్వర్ వెబ్సైట్: http://utkaluniversity.ac.in/


