ఐక్యరాజ్య సమితిలో భారత్
ఐక్యరాజ్య సమితి: అంతర్జాతీయ సమాజం కలిసికట్టుగా పనిచేసి సముద్రమార్గాల భద్రతను కాపాడాలని భారత్ విజ్ఞప్తి చేసింది. ఇంధనంతోపాటు ఆహారం, ఎరువుల రవాణా సాఫీగా జరిగేందుకు ఇది అత్యవసరమని ఐక్యరాజ్య సమితిలో భారత్ శాశ్వత ప్రతినిధి హరీశ్ పర్వతనేని స్పష్టం చేశారు. ‘‘సాయుధ ఘర్షణల అత్యంత తీవ్రమైన మానవతా పరిణామాల్లో ఆహార కొరత ఒకటి.
ఈనాటి ఘర్షణల ప్రభావం యుద్ధం జరుగుతున్న ప్రాంతాలకు మించి దూర ప్రాంతాలపైనా పడుతోంది’’అని స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిర్వహించిన ఉన్నతస్థాయి చర్చలో ఆయన మాట్లాడుతూ యుద్ధాల వల్ల ఇంధన మార్కెట్లు దెబ్బ తింటున్నాయి. ఎరువుల సరఫరా ప్రభావితమవుతోంది. సముద్ర రవాణా, మానవతా సహాయం, వ్యవసాయ వాణిజ్యానికి అంతరాయం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ప్రాంతంలో జరిగే ఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతకు ముప్పుగా మారుతున్నాయన్నారు.
ఈ ప్రభావం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఎక్కువగా ఉంటుందన్నారు. సాయుధ ఘర్షణల వల్ల జరుగుతున్న మానవీయ నష్టాన్ని తగ్గించడం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తొలి ప్రాథమ్యం కావాలని కోరారు. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా వాణిజ్య నౌకల రాకపోకలకు భద్రత, స్వేచ్ఛ కల్పించాలని చెప్పారు. కీలక సముద్ర మార్గాలు, మౌలిక సదుపాయాల రక్షణకు అంతర్జాతీయ సమాజం కలిసి పనిచేయాలని సూచించారు.
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడుతూ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యధిక సాయుధ ఘర్షణలు చోటు చేసుకున్నది గత ఏడాదేనని, అదే సమయంలో ఆకలి సమస్య కూడా పెచ్చరిల్లిందని తెలిపారు. గత ఏడాది ఒకేసారి సూడాన్, గాజాల్లో కరవు పరిస్థితులు ఏర్పడ్డాయని ఐక్యరాజ్యసమితి తాజా ‘హంగర్ హాట్‌స్పాట్స్’నివేదిక ప్రస్తావిస్తూ చెప్పారు. ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా–ఇజ్రాయెల్ –ఇరాన్‌ల యుద్ధం కొనసాగుతూండటం వల్ల హర్మూజ్ జలసంధిపై ఆంక్షలు, ఘర్షణల కారణంగా వస్తువుల ధరలు పెరిగాయని చెప్పారు.


