కెనడా ఇన్వెస్టర్లకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపు
వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశాల్లో ఒకటైన భారత్‌లో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ నేపథ్యంలో భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు రావాలని కెనడా ఇన్వెస్టర్లను ఆహా్వనించారు. పెద్ద సంఖ్యలో యువ జనాభాతో నిలకడగా వృద్ధి సాధిస్తూ భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశంగా నిలుస్తోందన్నారు.
దేశీయంగా వినియోగం భారీగా పెరుగుతోందని, క్యాపిటల్ మార్కెట్లు కూడా విస్తరిస్తున్నాయని వివరించారు. ‘దీర్ఘకాలిక కోణంలో ఆలోచిస్తున్న కెనడా ఇన్వెస్టర్లకు భారత్‌లో అసమానమైన అవకాశాలు ఉన్నాయి. భారీ స్థాయి, సుస్థిర వృద్ధి, యువ జనాభా, పెరుగుతున్న వినియోగం మొదలైన సానుకూలాంశాలు ఉన్నాయి‘ అని టొరంటోలో పరిశ్రమ దిగ్గజాలతో భేటీ సందర్భంగా ఆమె చెప్పారు.
పెరుగుతున్న మధ్య తరగతి వర్గం, ప్రపంచ స్థాయి డిజిటల్ మౌలిక సదుపాయాలు, పట్టణీకరణ వేగవంతం అవుతుండటం తదితర కారణాలతో ఎకానమీలోని ప్రతి రంగంలోనూ కొత్త అవకాశాలు వస్తున్నాయన్నారు. పటిష్టమైన డిజిటల్ వ్యవస్థతో ఆర్థిక, వాణిజ్య సేవలు ప్రజలకు మరింత అందుబాటులోకి వచ్చాయని మంత్రి చెప్పారు. లావాదేవీలపరంగా చూస్తే ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ టైమ్ పేమెంట్స్ సిస్టమ్‌గా యూపీఐ ఎదిగిందని, ఆర్థిక సమ్మిళితత్వం, వినూత్నతకు నిదర్శనంగా నిలుస్తోందన్నారు.


