న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లోని కీలక సైనిక ప్రాంతం కిరణా హిల్స్‌పై భారత డ్రోన్ దాడి చేసిందా?. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా జరిగిన ఈ పరిణామం గురించి ఇన్నాళ్లుగా సందేహాలు కొనసాగుతూ వచ్చాయి. అయితే దానికి మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ తాజాగా చెక్ పెట్టారు. అది అనుకోకుండా జరిగిందంటూ ఆయన వివరణ ఇచ్చారు.
కిరణా హిల్స్‌ను భారత్ ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకోలేదని జనరల్ అనిల్ చౌహాన్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన జనరల్ చౌహాన్.. ఆ ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో సర్గోధా చుట్టుపక్కల రాడార్లను గుర్తించేందుకు లాయిటరింగ్ మ్యూనిషన్లను మోహరించినట్లు చౌహాన్ వెల్లడించారు. సర్గోధాకు సుమారు 10 కిలోమీటర్ల ఉత్తరాన కిరణా హిల్స్ ఉన్నాయి. ఈ ప్రాంతం పాకిస్థాన్ సైనిక, అణు మౌలిక సదుపాయాలతో సంబంధం ఉన్న కీలక ప్రాంతంగా చాలాకాలంగా ప్రచారంలో ఉంది. సర్గోధా పరిసరాల్లోని రాడార్లను గుర్తించి దాడి చేయడమే ఆ డ్రోన్ల లక్ష్యం. ఇలాంటి లాయిటరింగ్ మ్యూనిషన్లు కొంతసేపు గాల్లో తిరుగుతూ లక్ష్యాన్ని వెతుకుతాయని, సాధారణంగా దాదాపు రెండు గంటల వరకు గాలింపును కొనసాగించగలవని వివరించారు. నిర్ణీత సమయంలో లక్ష్యం దొరకకపోతే అవి తిరిగి వచ్చి ఎక్కడో ఒకచోట కూలిపోయే అవకాశం ఉంటుందని చెప్పారు.
‘‘మేము కిరణా హిల్స్‌ను లక్ష్యంగా చేసుకోలేదు. రాడార్ల కోసం పంపిన లాయిటరింగ్ మ్యూనిషన్ లక్ష్యాన్ని గుర్తించలేకపోవడంతో చివరకు ఆ కొండల్లో ఒకదాన్ని ఢీకొని ఉండొచ్చు’’ అని చౌహాన్ వివరించారు. ఆ సమయంలో కిరణా హిల్స్ నుంచి పొగలు వస్తున్న దృశ్యాలు పాకిస్థాన్ మీడియా ద్వారా బయటకు రావడం కూడా ఈ ప్రాంతంపై అనేక అనుమానాలకు దారితీసింది. అయితే అది అక్కడి అణు స్థావరంపై ఉద్దేశపూర్వక దాడికి సంబంధించిన ఆధారం కాదని చౌహాన్ వ్యాఖ్యలు స్పష్టం చేశాయి.
లోయర్ ఎయిర్‌స్పేస్.. భారత్ వ్యూహం
ఆపరేషన్ సిందూర్‌లో భారత్ అనుసరించిన వ్యూహంపై కూడా మాజీ సీడీఎస్ కీలక విషయాలు వెల్లడించారు. గతంలో ఉరీ ఘటన తర్వాత చేపట్టిన భూదాడులు, పుల్వామా అనంతరం నిర్వహించిన భారీ వైమానిక దాడులకు భిన్నంగా ఈసారి తక్కువ ఎత్తులోని గగనతలాన్ని వినియోగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. డ్రోన్లు, లాయిటరింగ్ మ్యూనిషన్లు, అటాక్ హెలికాప్టర్లు వంటి ఆయుధ వ్యవస్థలకు ఈ లోయర్ ఎయిర్‌స్పేస్ అనుకూలంగా ఉంటుందని చెప్పారు. తద్వారా కంట్రోల్‌లో ఉంటూనే.. అనూహ్య దాడులతో లక్ష్యాలను ఛేదించే అవకాశం లభించిందని వివరించారు.
పాక్ చర్చలకు వచ్చినా.. సర్గోధాపై దాడికి ఓకే
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ చర్చలకు ముందుకొచ్చినప్పటికీ, సర్గోధాపై దాడికి భారత్ అనుమతించినట్లు చౌహాన్ వెల్లడించారు. పాకిస్థాన్ నుంచి చర్చల కోసం ఫోన్ వచ్చిన సమయంలోనే వైమానిక దళాధిపతి సర్గోధాపై దాడి చేయాలా అని తనను అడిగారని తెలిపారు. తాను ‘‘వెళ్లండి.. దాడి చేయండి’’ అని సూచించినట్లు చెప్పారు. అంతేకాకుండా మరో రెండు లక్ష్యాలను గుర్తించాలని ఆదేశించినట్లు వెల్లడించారు.
అందులో ఒకటిగా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని స్కార్దూను గుర్తించారు. దాడికి అనుమతి లభించినప్పటికీ అక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆ లక్ష్యాన్ని మార్చాల్సి వచ్చిందని చెప్పారు. చివరకు భోలారి వైమానిక స్థావరంలోని హ్యాంగర్‌పై భారత వైమానిక దళం దాడి చేసిందని చెప్పారు.
భోలారి దాడి.. భారీ నష్టం
మే 10న జరిగిన భారత వైమానిక దాడుల్లో భోలారి ఎయిర్‌బేస్‌పై జరిగిన దాడి కీలకంగా నిలిచింది. అక్కడి ఓ హ్యాంగర్ పైకప్పులో భారీ రంధ్రం ఏర్పడినట్లు ఉపగ్రహ చిత్రాలు వెల్లడించాయి. దాడి తీవ్రతకు నిదర్శనంగా హ్యాంగర్ చుట్టూ శకలాలు కనిపించాయి.
ఇక పాక్ తాను జరిపిన దాడులపై ఎలాంటి స్పష్టత లేకుండా ఉండిపోయిందని అనిల్ చౌహాన్ అన్నారు. అమెరికా, చైనా సంస్థలకు చెందిన వాణిజ్య ఉపగ్రహ చిత్రాల ద్వారా సమాచారం పొందేందుకు ప్రయత్నించినప్పటికీ ఆశించిన ఆధారాలు లభించలేదని ఆయన పేర్కొన్నారు.
సమన్వయమే మన బలం
ఆపరేషన్ సిందూర్‌లో భారత్ పైచేయి సాధించడానికి మెరుగైన పరిస్థితుల అవగాహన, యుద్ధభూమిపై పారదర్శకత, మూడు దళాల మధ్య సమన్వయం కీలకంగా పనిచేశాయని చౌహాన్ అన్నారు. సైన్యం, నౌకాదళం, వైమానిక దళాలకు ఒకే ఆపరేషనల్ చిత్రంపై అవగాహన ఉండటం వల్ల వేగంగా నిర్ణయాలు తీసుకోగలిగామని వివరించారు. అదే సమయంలో రాజకీయ నాయకత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడం, సైన్యానికి ఆపరేషనల్ స్వేచ్ఛ లభించడం కూడా విజయానికి కారణమైందని చెప్పారు.
2025 ఏప్రిల్ 22న జమ్ము కశ్మీర్ అనంత్‌నాగ్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతిగా భారత్ మే 7న ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సాయుధ దళాలు దాడులు నిర్వహించాయి. తదనంతరం పాకిస్థాన్ సైనిక చర్యలకు దిగడంతో భారత్ తన దాడులను విస్తరించి పాక్ వైమానిక స్థావరాలు, రాడార్ కేంద్రాలు, ఇతర సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంది. మే 10న ఇరుదేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో) మధ్య సంప్రదింపుల అనంతరం కాల్పుల విరమణ అమల్లోకి వచ్చి ఉద్రిక్తతలు ఆగిపోయాయి.
ఇదీ చదవండి: అమెరికా ఆశలు తగ్గుముఖం!


