మూడు వేలకు చేరిన కేసులు
అత్యవసర సమీక్ష నిర్వహించిన సీఎం రేఖా గుప్తా
ఆందోళన అక్కర్లేదన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో స్వైన్ ఫ్లూ(హెచ్1ఎన్1) కేసులు కలకలం రేపుతున్నాయి. నగరంలో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటివరకు 3,000 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కావడం అధికార యంత్రాంగాన్ని కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో తక్షణ నివారణ చర్యలు, వైద్య సదుపాయాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేఖా గుప్తా మంగళవారం ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, పలువురు మంత్రులతో సీఎం రేఖా గుప్తా ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించారు. నగరవ్యాప్తంగా స్వైన్ ఫ్లూ వ్యాప్తి తీరు, ఆస్పత్రుల్లో బాధితులకు అందుతున్న వైద్య సేవలు, ఔషధాల లభ్యత తదితర అంశాలపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రోగులకు మెరుగైన వైద్యం అందించడంలో ఎలాంటి రాజీ పడొద్దని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య మరింత పెరిగితే, దానికి అనుగుణంగా అదనపు ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. అవసరమైన చోట పడకల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమీక్షా సమావేశం అనంతరం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పంకజ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. నగరంలో స్వైన్ ఫ్లూ పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని స్పష్టంచేశారు. కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు చికిత్స అందించేందుకు సరిపడా వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారని స్పష్టం చేశారు. స్వైన్ ఫ్లూ చికిత్సకు అవసరమైన ఔషధాలు, ఇతర అత్యవసర వైద్య పరికరాల నిల్వలు పూర్తిస్థాయిలో ఉన్నాయని మంత్రి వివరించారు. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి వ్యాధి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రులను ఆశ్రయించాలని ప్రజలకు సూచించారు. సొంత వైద్యం చేసుకోకుండా, వైద్యుల సలహా మేరకే ఔషధాలు ఉపయోగించాలని కోరారు.


