ఢిల్లీలో కదంతొక్కిన యువత ధైర్యం అమోఘం
ఈ తరానికి చెందినందుకు గర్విస్తున్నా
ఇంటర్వ్యూలో ‘మిస్ యూనివర్స్ ఇండియా’ కెజియా లిజ్ మెజో
జైపూర్: నీట్–యూజీ సహా అన్ని రకాల పరీక్షల్లో జవాబుదారీతనం, పారదర్శకత కోసం ఇటీవల ఢిల్లీలో వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపిన యువత ధైర్యాన్ని ‘మిస్ యూనివర్స్ ఇండియా–2026’విజేత కెజియా లిజ్ మెజో ప్రశంసించారు. న్యాయం కోసం గళమెత్తడం దేశం పట్ల వారికి ఉన్న ప్రేమను, అభిమానాన్ని ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. ఆదివారం రాత్రి జైపూర్‌లో జరిగిన గ్రాండ్ ఫినాలేలో ‘మిస్ యూనివర్స్ ఇండియా 2026’కిరీటాన్ని ఆమె గెల్చుకున్న సంగతి తెలిసిందే. ఎంతో ధైర్యవంతులు, ఒకరికొకరు అండగా నిలిచే తరానికి చెందినందుకు చాలా గర్వపడుతున్నానని చెప్పారు.
19 ఏళ్ల కెజియా లిజ్ మెజో తాజాగా ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన నిరసనలో పాల్గొన్న యువత గురించి స్పందించారు. సరైన దాని కోసం నిరసన తెలిపేందుకు ముందుకు వచి్చన ప్రతి విద్యారి్థకీ, ప్రతి ఒక్కరికీ, మన దేశ శ్రేయస్సు కోసం ఏకమైన వారందరికీ సెల్యూట్ చేస్తున్నానని తెలిపారు. లక్ష్యం కోసం గళమెత్తడానికి ధైర్యం కావాలని చెప్పారు. యువతరంలో తాను కూడా ఒక భాగమైనందుకు గర్విస్తున్నానని వివరించారు. యువత ముందంజలో ఉన్న గొప్ప భారతదేశానికి తాను ప్రాతినిధ్యం వహిస్తున్నానని ఉద్ఘాటించారు.
సామాన్యమైన యువతినే..
కేరళకు చెందిన కెజియా లిజ్ మెజో ఈ ఏడాది జరిగే మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ తరఫున పాల్గొనబోతున్నారు. ఇలాంటి పోటీల్లో విజేతగా నెగ్గి కిరీటాన్ని ధరించడం అనేది కేవలం వ్యక్తిగత విజయం మాత్రమే కాదని.. దేశవ్యాప్తంగా ఉన్న యువతుల ఆకాంక్షలను మోయడమేనని అన్నారు. ‘‘అర్హత ఉన్నవారిలో నేనొక్కదాన్నే లేను. అంతిమ విజేతను కూడా నేనే అవుతానని చెప్పలేను. యువతకు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని పొందినదాన్ని మాత్రమే నేను. వారి గొంతుకలను అందరికీ వినిపించడం నా బాధ్యత’’అని చెప్పారు.
తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. అందాల పోటీలు తన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమని వెల్లడించారు. అయితే, చిన్న వయసులో మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకోవాలని కలలు కనడం మొదలుపెట్టినప్పుడు అది అసాధ్యమైన పనిగానే అనిపించేదని చెప్పారు. ఈ ప్రయాణంలో కొన్నిసార్లు భయపడడం, ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం వంటివి చోటుచేసుకున్నాయని తెలిపారు.
తనలో బలహీనతకు సంబంధించిన క్షణాలు చాలానే ఉన్నాయని, అంతిమంగా చూస్తే తాను కూడా సామాన్యమైన యువతినేనని స్పష్టంచేశారు. ఏదైనా ఒక విషయం కోసం ఎంతగానో శ్రమిస్తూ కలలు కంటూ కళ్లు మూసినప్పుడు భయాలు కలగడం సహజమేనని, సందేహాలు కూడా అనివార్యమని అన్నారు.
న్యాయవాదిగా పనిచేస్తా..
ప్రపంచ స్థాయి పోటీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం ఆనందంగా ఉందని కెజియా లిజ్ మెజో తెలియజేశారు. కేవలం తన సొంత రాష్ట్రానికే కాకుండా, దేశం మొత్తానికి సంబంధించిన వైవిధ్యాన్ని తనతోపాటు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మన దేశంలోని ప్రతి ప్రాంతానికీ ప్రాతినిధ్యం వహిస్తానని తెలిపారు. మిస్ యూనివర్స్ ఇండియా పోటీలో వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన పోటీదారులను కలవడం వల్ల వారి సంస్కృతులు, సంప్రదాయాల గురించి తెలుసుకునే అవకాశం లభించిందని పేర్కొన్నారు.
మిస్ యూనివర్స్ పోటీకి వెళ్లినప్పుడు దేశంలో ప్రతి ప్రాంతం వైవిధ్యాన్ని, ఆయా నేలల విశేషాలను తన వెంట తీసుకెళ్తానని వ్యాఖ్యానించారు. మిస్ యూనివర్స్ పోటీలో గెలిచిన తర్వాత కూడా న్యాయవాదిగా పనిచేస్తానని స్పష్టంచేశారు. తన ఆశయాలకు అందాల పోటీ అడ్డంకి కాదన్నారు. న్యాయశాస్త్రం అంటే ఎంతో ఇష్టమని, తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడే న్యాయవాది కావాలని లక్ష్యంగా పెట్టుకున్నానని పేర్కొన్నారు.
ఆ లక్ష్యాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేనని చెప్పారు. సమాజంలో సానుకూల మార్పును తీసుకురావడానికి చట్టాన్ని వినియోగిస్తానని, ఈ కిరీటంతో పాటు ఆ పనిని కచ్చితంగా చేయగలనని నమ్ముతున్నానని వెల్లడించారు. అందం గురించిన మెజో తన అభిప్రాయం వ్యక్తంచేశారు.అది కేవలం శారీరక రూపానికి మాత్రమే పరిమితం కాదని అన్నారు.


