మిస్ యూనివర్స్ ఇండియా–2026
కాజియాకు నలుగురిలో కలవడం అంటే ఇష్టం. టీనేజీలోకి వచ్చిన తరువాత ఆ ఇష్టం వెనకడుగు వేసింది. ‘నల్లపిల్ల’ అని ఎవరైనా వెక్కిరిస్తారేమో అనే భయం ఆమెలో ఉండేది. ఆ భయం కాస్తా ఆత్మన్యూనతగా మారింది. ఆత్మన్యూనత నుంచి ఆత్మవిశ్వాసంలోకి వచ్చిన తరువాత తనను తాను అద్భుతంగా తీర్చిదిద్దుకుంది కేరళలోని మావెళిక్కరకు చెందిన కాజియా లిజ్ మెజో.
తాజాగా...
ఈ నెల 23న జైపూర్‌లో జరిగిన ఫైనల్‌లో కాజియా లిజ్ మెజో ‘మిస్ యూనివర్స్ ఇండియా’ కిరీటాన్ని గెలుచుకుంది. ‘మిస్ యూనివర్స్ ఇండియా’ టైటిల్‌ను గెలిచిన తొలి కేరళ మహిళగా చరిత్ర సృష్టించింది. నవంబర్‌లో ప్యూర్టోరికోలో జరగనున్న 75వ మిస్ యూనివర్స్ పోటీలో మన దేశానికి ప్రాతినిధ్యం వహించనుంది. 19 సంవత్సరాల కాజియా న్యాయశాస్త్ర విద్యార్థిని. దేశవ్యాప్తంగా 52 మంది మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొన్నారు. వీరందరిలో కాజియా పిన్న వయస్కురాలు. వైష్ణవి గణేష్ ఫస్ట్ రన్నరప్‌గా, అనుశీ సాత్వలేకర్ సెకండ్ రన్నరప్‌గా నిలిచారు.
అబుదాబి (యూఏఈ)లో పెరిగిన కాజియా ‘బేబీ షో’లో పాల్గొనడం ద్వారా చిన్న వయసులోనే రంగస్థలంపై మెరిసింది. ఆ తరువాత కాలంలో శాస్త్రీయ నృత్యం వైపు అడుగులు వేసింది. అందరిలాగే బాల్యం అంటే కాజియాకు చాలా ఇష్టం. ‘చిన్నపిల్లగా ఉన్నప్పుడు భయమనేదే ఉండదు. సరదాగా గడపడం, అందమైన దుస్తులు ధరించడం, కార్టూన్ ప్రపంచంలోకి దూరడం..ఇలాంటి అద్భుతాలెన్నో బాల్యంలో ఉంటాయి’ అంటుంది కాజియా.
అభద్రత... ఆత్మన్యూనత...
టీనేజ్‌లోకి అడుగుపెట్టిన కాజియా బాల్యంలోని సంతోషానికి దూరం అయింది. డిజిటల్ ప్రపంచంలోని సోకాల్డ్ సౌందర్య ప్రమాణాల వైపు మొగ్గు చూపడం వల్ల ఆత్మవిశ్వాసం కోల్పోయింది.
‘నేను నలుపుగా ఉండడం వల్ల విపరీతమైన అభద్రతాభావానికి గురయ్యేదాన్ని. రకరకాల ఫెయిర్ నెస్ క్రీమ్‌ల యాడ్స్ చూస్తుండేదాన్ని. వాటిని చూసిన తరువాత నా శరీరాకృతి సరిగ్గా లేదు అనిపించేది.
నా ప్రతి ఫొటోకు ఫిల్టర్స్ ఉపయోగించేదాన్ని. కళ్లను పెద్దవిగా చేయడానికి, చర్మపు రంగులను మార్చేదాన్ని’ గతాన్ని గుర్తు తెచ్చుకుంది కాజియా.
మార్పు మొదలైంది...
మొదట్లో నలుగురిలో కలవడానికి ఇష్టపడే కాజియా, ‘నేను నలుపుగా ఉంటాను’ అని అతిగా ఆలోచించడం వల్ల ఆత్మన్యూనతకు గురయ్యేది. నలుగురిలో కలవడానికి ఇబ్బంది పడేది. అద్దంలో తన ముఖం తనకే నచ్చకపోయేది. అయితే, కొంతకాలం తరువాత తనను తాను సమీక్షించుకోవడం వల్ల ఆ తరువాత కాలంలో కాజియాలో చాలా మార్పు వచ్చింది.
‘బాహ్య సౌందర్యం కంటే ఆత్మ సౌందర్యం గొప్పది’ అనే విషయాన్ని తెలుసుకుంది. ఆత్మన్యూనత పోయింది. ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆ ఆత్మవిశ్వాసంతోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది.
విజయ పరంపర...
ఆత్మవిశ్వాసం దిశగా తనను తాను తీర్చిదిద్దుకున్న కాజియా 2024లో ‘మిస్ టీన్ దివా’ టైటిల్ గెలుచుకోవడం ద్వారా అంతర్జాతీయ స్థాయి పోటీలకు మార్గం సుగమం చేసుకుంది. 2025లో ‘మిస్ టీన్ ఇంటర్నేషనల్’లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి మొదటి రన్నరప్‌గా నిలిచింది. ఆ తరువాత ‘మిస్ యూనివర్స్ కేరళ’ విజేతగా నిలిచింది.
అలా జరగకూడదు...
‘సోషల్ మీడియా చాలా కృత్రిమమైనది. ఆ కృత్రిమత్వపు మాయలో పడిపోవద్దు. ఆత్మవిశ్వాసం లేని పిల్లలను విషపూరిత భావాలతో భయపెడితే సమాజానికి మనం ఏం సందేశం ఇస్తున్నట్లు?’ అని ప్రశిస్తోంది కాజియా. తాను ఒకప్పుడు ఎదుర్కొన్న డిజిటల్ ఒత్తిడి ఎవరూ ఎదుర్కోవద్దు అంటుంది. పరిపూర్ణత (పర్‌ఫెక్షన్) కోసం పాకులాడే ధోరణిని ఆమె వ్యతిరేకిస్తోంది. పేజెంట్ పోటీదారులు అనుసరించే జీవనశైలిని అనుసరించడానికి కాజియా నిరాకరిస్తోంది.
మల్టీ టాలెంట్...
మోడల్, శాస్త్రీయ నృత్యకారిణి మాత్రమే కాదు కాజియా గాయని కూడా. డ్రమ్స్, వయోలిన్ వాయిస్తుంది. టెడెక్స్ వేదికలపై పర్యావరణ పరిరక్షణ నుంచి ఆత్మవిశ్వాసం వరకు రకరకాల అంశాలపై స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాలు ఇస్తోంది. మాలీవుడ్ సినిమా ‘షైలాక్’తో నటిగా తొలి అడుగులు వేసింది.
‘నీ లక్ష్యాలు ఏమిటో ఒక నోట్‌బుక్‌లో రాసుకో’ అని కజియాను తల్లి ప్రోత్సహించేది. ‘హాలివుడ్ వాక్‌ఆఫ్ ఫేమ్‌లో చోటు సంపాదించాలి’....ఇలాంటి ఎన్నో లక్ష్యాలతో ఆ నోట్‌బుక్ నిండిపోయింది. పెద్ద కలలు కనే సాహసం ఆ రోజు నుంచే మొదలైంది.‘ఆ సాహమే నన్ను ఇక్కడికి వరకు తీసుకువచ్చింది’ అంటుంది కాజియా.
నిశ్శబ్దమంటే...
ఫైనల్ రౌండ్‌లో అడిగిన ‘మీ జీవితంలో నిశ్శబ్దానికున్న శబ్దాన్ని ఎలా వర్ణిస్తారు?’ అనే ప్రశ్నకు–
‘‘నేను ఈ వేదిక పైకి వచ్చే ముందు వరకు ఇక్కడ అంతా నిశబ్దమే. నటిగా, డ్యాన్సర్‌గా, అందాల పోటీలపై ఆసక్తి ఉన్న అమ్మాయిగా ఇలాంటి వేదికపైనే ఎదిగాను. ఈ వేదిక పైకి వచ్చే ముందు నిశబ్దంగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంట్లో ఉన్న అనుభూతి కలుగుతుంది. అలాంటి ప్రదేశంలోనే నేను ఉన్నాను, నా దేశంలో ఉన్నాను’’ అంటూ జవాబు ఇచ్చింది కాజియా.
దేవుడు ఇచ్చే తోట!
విజేత అంటే ఎవరో కాదు, ఒకసారి ఓడిపోయి గెలుపు కోసం మరోసారి ప్రయత్నించిన వ్యక్తి మాత్రమే. మీరు దేవుడిని ఒక పువ్వు అడిగారు. అది వెంటనే మీకు దొరక్క పోవచ్చు. గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే... ఒక పువ్వు కాదు, ఒక తోటే మీకు ఇవ్వడానికి దేవుడు ప్రయత్నాలు చేస్తున్నాడని! అయితే దేవుడు ఆ తోట ఇచ్చే వరకు మనం ఓపికగా ఉండాలి. ఆశాభావంతో ఉండాలి. సోషల్ మీడియాలో కనిపించేవాటిని చూసి గుడ్డిగా నమ్మకూడదు. అనుసరించకూడదు.
– కాజియా


