ఆర్థిక కష్టాలు.. కూతురి కోసం ఇంట్లోనే ‘కోర్టు’ నిర్మించి.. ఇలా | Meet the man who shaped Treesa Jolly Story Behind Medal | Sakshi
Sakshi News home page

ఆర్థిక కష్టాలు.. కూతురి కోసం ఇంట్లోనే ‘కోర్టు’ నిర్మించి.. ఇలా

Aug 24 2026 5:14 PM | Updated on Aug 24 2026 5:23 PM

Meet the man who shaped Treesa Jolly Story Behind Medal

ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన పుల్లెల గాయత్రి గోపీచంద్‌- ట్రెసా జాలీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ మెగా టోర్నీలో మహిళల డబుల్స్‌ విభాగంలో ఈ జోడి కాంస్యంతో మెరిసింది. ఆ సమయంలో పుల్లెల గాయత్రి తండ్రి, ఆల్‌ ఇంగ్లండ్‌ మాజీ చాంపియన్‌, చీఫ్‌ నేషనల్‌ కోచ్‌ గోపీచంద్‌ కూడా ఢిల్లీలోనే ఉండి మ్యాచ్‌ను వీక్షించాడు.

తన కుమార్తె గాయత్రి, ట్రెసా విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటూ గర్వంతో ఉప్పొంగిపోయాడు. నిజానికి బ్యాడ్మింటన్‌ గురించి తెలిసిన వారికి గోపీచంద్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన కూతురు గాయత్రి తండ్రి అడుగుజాడల్లో బ్యాడ్మింటన్‌ను కెరీర్‌గా ఎంచుకుని ముందుకు సాగుతోంది.

అయితే, గాయత్రి- ట్రెసా సాధించిన విజయం మరో వ్యక్తి కళ్లు కూడా ఆనందంతో చెమర్చేలా చేసింది. ఆయన మరెవరో కాదు ట్రెసా తండ్రి జాలీ మాథ్యూ. కేరళకు చెందిన ఆయన కూతురి కోసం స్వయంగా బ్యాడ్మింటన్‌ కోర్టును నిర్మించాడు. అన్నీ తానై కూతురిని ముందుకు నడిపి ఆమెను ఈస్థాయికి చేర్చాడు.

పీఈటీ టీచర్‌.. వాలీబాల్‌ కోచ్‌
కేరళలోని చెరుప్పుళ అనే చిన్న పట్టణం. అక్కడ బ్యాడ్మింటన్‌ కోర్టులు లేవు. అయితే, జామీ మాథ్యూ మాత్రం తన కూతురి కల నెరవేరాలంటే తాను శ్రమించక తప్పదనే నిర్ణయానికి వచ్చారు. జాలీ మాథ్యూ పీఈటీ టీచర్‌. అంతేకాదు ఆయన వాలీబాల్‌ కోచ్‌ కూడా!

ఇంటి ఆవరణలోనే..
తన ఇంటి ఆవరణలోనే వాలీబాల్‌ కోర్టును నిర్మించి.. అక్కడే యువ ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చేవాడు. ట్రెసా, ఆమె అక్కడ పక్కన నిలబడి వారి ఆటను చూస్తూ ఉండేవారు. తన కూతుళ్లు ఇద్దరు ఆసక్తిగా వాలీబాల్‌ను వీక్షించడం చూసిన మాథ్యూ.. ఇద్దరూ వాలీబాల్‌ ప్లేయర్లు అవుతారని ఊహించారు. అయితే, ట్రెసాకు బ్యాడ్మింటన్‌లో మరింత ఆసక్తి ఉందని గమనించి ఆ దిశగా ప్రోత్సహించాడు.

ఈ విషయం గురించి మాథ్యూ ఇండియా టుడేతో మాట్లాడుతూ.. ‘‘ట్రెసాకు ఆటల పట్ల అమితాసక్తి ఉండేది. నేను ఇంట్లోనే చాలా మంది అమ్మాయిలకు వాలీబాల్‌ శిక్షణ ఇచ్చాను. నా కూతుళ్లకు కూడా ఎందుకు ట్రెయినింగ్‌ ఇవ్వకూడదనే ప్రశ్న తలెత్తింది.

ఇండోర్‌ కోర్టు నిర్మించి..
ట్రెసా బాగా ఆసక్తిగా ఉండేది. అయితే, బ్యాడ్మింటన్‌ ఆడటం మొదలుపెట్టాక తన ఆసక్తి మారిపోయింది. అయితే, మా ప్రాంతంలో అసలు బ్యాడ్మింటన్‌ కోర్టులు లేవు. అందుకే నేనే మా ఇంట్లో ఓ ఇండోర్‌ కోర్టు కట్టించి.. అక్కడే ట్రెసాకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాను.

ఆర్థికంగా కష్టాలు 
అయితే, గాలితో కూడిన వర్షం పడినప్పుడు టార్పాలిన్‌ కవర్లు ఎగిరిపోయేవి. దీంతో ప్రాక్టీస్‌ కష్టమయ్యేది. ఆర్థికంగా కూడా కష్టాలు మొదలయ్యాయి. ఓసారి రాష్ట్ర స్థాయి టోర్నమెంట్‌కు వెళ్లాము. అప్పుడే మన వ్యవస్థ ఎలా పనిచేస్తుందో పూర్తిగా అర్థమైంది.

స్థానిక ర్యాంకింగ్స్‌ ఆధారంగానే కేరళ జట్టుకు ఎంపిక చేస్తారనే విషయం తెలిసింది. వివిధ లోకల్‌ టోర్నీల్లో ఆడేందుకు మేము రాష్ట్రమంతా తిరిగేవాళ్లము. కానీ మాకు స్పాన్సర్లు దొరకలేదు. డబ్బుకు బాగా ఇబ్బంది అయ్యేది. ఏ అసోసియేషన్‌ కూడా మాకు సాయం చేయలేదు. దీంతో ఖర్చుల భారం తడిసిమోపెడు అయ్యేది.

అయితే, ఆశయం నుంచి మేము ఎప్పుడూ దూరం కాలేదు. నిజానికి ట్రెసా చదువులో ముందు ఉండేది. మా ఊర్లో పిల్లలంతా డాక్టర్‌, ఇంజనీర్‌.. లేదంటే మరేదైనా ఉద్యోగం కోసం చదివేవాళ్లు. ఊర్లో ఎంతో మంది ఇంజనీర్లు ఉండవచ్చు. కొంతమంది డాక్టర్లూ ఉండొచ్చు. కానీ భారత్‌కు ఆడిన ప్లేయర్లు ఎంతో మంది ఉండరు కదా!

అనిల్‌.. ఆ తర్వాత గోపీచంద్‌
ట్రెసా ముందు దేశానికి ఆడాలి. ఆ తర్వాత ఒలింపిక్స్‌కు వెళ్లాలి. అక్కడా పతకం గెలవాలి. ఇదే మా ధ్యేయం. అందుకు అనుగుణంగా ముందుకు వెళ్లాము. నా స్నేహితుడు అనిల్‌ రామంద్రన్‌.. కన్నూరు యూనివర్సిటీ స్పోర్ట్స్‌ హెడ్‌, బ్యాడ్మింటన్‌ స్పెషలిస్టు. ఆయనే నా కూతురికి కోచింగ్‌ ఇచ్చాడు.

ఆ తర్వాత గోపీచంద్‌ను కలిశాము. టార్గెట్‌ ఒలింపిక్స్‌ పోడియం స్కీమ్‌ (TOPS)కి ట్రెసా ఎంపికైనపుడు ఆమె ప్లస్‌ వన్‌ చదువుతోంది. ఆ సమయంలో హైదరాబాద్‌లో సీనియర్‌క్యాంపులో ఉన్న గోపీచంద్‌కు రిపోర్టు చేసేది. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగింది’’ అని జాలీ మాథ్యూ పుత్రికోత్సాహంతో పొంగిపోయాడు.

కాగా జూనియర్‌ లెవల్లో ప్రతిభ కనబరిచిన గాయత్రి, ట్రెసాను కలిపి డబుల్స్‌ జోడీగా ఎంపిక చేశారు. అప్పటి నుంచి జట్టుగా కొనసాగిన వీళ్లిద్దరు.. దాదాపు పదిహేనేళ్ల విరామం తర్వాత తొలిసారి భారత్‌కు ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో పతకం అందించారు. ఇక గాయత్రి, ట్రెసాలకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే.

చైనా జంట చేతిలో పరాజయం
న్యూఢిల్లీ వేదికగా శనివారం జరిగిన సెమీఫైనల్లో గాయత్రి–ట్రెసా జంట 21–18, 13–21, 8–21 స్కోరుతో చైనాకు చెందిన వరల్డ్‌ నంబర్‌వన్, డిఫెండింగ్‌ చాంపియన్‌ జంట ల్యూ షెంగ్‌ షూ – టాన్‌ నింగ్‌ చేతిలో పరాజయం పాలయ్యారు. 71 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో భారత జంట తొలి గేమ్‌ను గెలుచుకున్నా...ఆపై పట్టు కోల్పోయింది.

ఈ మ్యాచ్‌కు ముందు చైనా జోడితో ఏడు సార్లు తలపడి ఒకే ఒక సారి గెలిచిన భారత ద్వయం ఈ సారి కూడా ప్రభావం చూపలేకపోయింది. మ్యాచ్‌లో తొలి గేమ్‌ ఆసక్తికరంగా సాగింది. ఆరంభంలో గాయత్రి–ట్రెసా 7–2తో ముందంజ వేయగా, వరుసగా తొమ్మిది పాయింట్లు సాధించిన చైనా జంట 11–7తో నిలిచింది. 

ఆ తర్వాత హోరాహోరీగా తలపడటంతో స్కోర్లు 12–12 నుంచి 18–18 వరకు చేరాయి. ఈ దశలో ట్రెసా క్రాస్‌ కోర్ట్‌ విన్నర్‌తో భారత్‌కు పాయింట్‌ దక్కగా, టాన్‌ వరుసగా రెండు సార్లు షటిల్‌ను నెట్‌కు కొట్టడంతో గేమ్‌ ముగిసింది.

అభిమానుల ప్రోత్సాహం మధ్య ఆట కొనసాగించిన భారత జోడి రెండో గేమ్‌లోనూ మెరుగైన ప్రదర్శనతో స్కోరును 12–12 వరకు చేర్చింది. అయితే ఈ స్థితిలో ఒక్కసారిగా చైనా జోడి చెలరేగిపోయింది. పూర్తి ఆధిక్యం ప్రదర్శిస్తూ వరుసగా 8 పాయింట్లు సొంతం చేసుకొని 20–12కు దూసుకుపోయింది. 

ఆ తర్వాత మరో పాయింట్‌ సాధించడంతో గేమ్‌ చైనా వశమైంది. మూడో గేమ్‌లో పూర్తిగా చైనా హవానే సాగింది. 3–2తో ముందంజ వేసిన తర్వాత చైనా ఎక్కడా తగ్గలేదు. 8–5 నుంచి 15–5 వరకు ఆధిక్యంలో ఉన్న చైనా ఆ తర్వాత అలవోక పాయింట్లతో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement