కాంస్యంతో సరిపెట్టుకున్న ట్రీసా-గాయత్రీ జోడీ | BWF World Championships, Treesa Jolly-Gayatri Gopichand Win Bronze After Semifinal Defeat, Check Out More Details | Sakshi
Sakshi News home page

కాంస్యంతో సరిపెట్టుకున్న ట్రీసా-గాయత్రీ జోడీ

Aug 22 2026 6:52 PM | Updated on Aug 22 2026 7:43 PM

BWF World Championships: Treesa Jolly, Gayatri Gopichand Pair Clinch Bronze After Loss

source: X

BWF వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత మహిళల జోడీ ట్రీసా జాలీ-గాయత్రీ గోపీచంద్ కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌ వన్‌, టాప్‌ సీడ్‌ జోడీ లియు షెంగ్షు-టాన్ నింగ్ చేతిలో 21-18, 12-21, 8-21 తేడాతో ఓడిపోయింది. ఈ టోర్నీలో భారత్‌ తరఫున పతకం సాధించిన ఏకైక జోడీగా ట్రీసా-గాయత్రీ నిలిచారు.

దూకుడుగా ప్రారంభించినప్పటికీ..!
ట్రీసా-గాయత్రీ జోడీ మ్యాచ్‌ను దూకుడుగా ప్రారంభించారు. 3-0 ఆధిక్యంలోకి వెళ్లినప్పటికీ చైనా జోడీ వేగంగా పుంజుకుని 7-7తో స్కోరును సమం చేసింది. విరామ సమయానికి లియు-టాన్ 11-7తో ఆధిక్యంలో నిలిచారు.

అయితే భారత జోడీ వెనక్కి తగ్గలేదు. విరామం తర్వాత వరుస పాయింట్లతో పుంజుకుని 12-12తో స్కోరును సమం చేసింది. చివర్లో 18-18 వద్ద కీలకంగా ఆడిన ట్రీసా-గాయత్రీ వరుసగా మూడు పాయింట్లు సాధించి 21-18తో తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నారు.

రెండో గేమ్‌లో పుంజుకున్న ప్రత్యర్ది
రెండో గేమ్‌లో లియు-టాన్ దూకుడుగా ఆడారు. గాయత్రీ చైనా జోడీ బ్యాక్‌హ్యాండ్‌ను లక్ష్యంగా చేసుకుని వ్యూహం మార్చడంతో భారత్‌ కొంత మేర ఫలితం సాధించింది. ఒక దశలో భారత్‌ 11-10తో ఆధిక్యంలోకి కూడా వచ్చింది.

అయితే ఆ తర్వాత నెట్‌ వద్ద జరిగిన పొరపాట్లు భారత జోడీని దెబ్బతీశాయి. అనవసర తప్పిదాలతో చైనా జోడీ 18-12 ఆధిక్యంలోకి వెళ్లింది. ట్రీసా-గాయత్రీ తిరిగి పుంజుకోలేకపోవడంతో రెండో గేమ్‌ను 12-21తో కోల్పోయారు.

నిర్ణయాత్మక గేమ్‌లో ఆధిపత్యం
మూడో గేమ్‌ ఆరంభంలో ఇరు జోడీలు సమానంగా పోరాడినా.. లియు షెంగ్షు-టాన్ నింగ్ క్రమంగా మ్యాచ్‌పై పట్టు సాధించారు. భారత జోడీ ఆటను చైనా క్రీడాకారిణులు సమర్థంగా చదివి వ్యూహం మార్చడంతో ట్రీసా-గాయత్రీకి పాయింట్లు రావడం కష్టమైంది.

విరామ సమయానికి చైనా జోడీ 11-5తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత కూడా ఒత్తిడిని కొనసాగిస్తూ వరుస పాయింట్లు సాధించింది. చివరకు నిర్ణయాత్మక గేమ్‌ను 21-8తో గెలిచి, మ్యాచ్‌ను 2-1తో సొంతం చేసుకుంది.

సెమీఫైనల్లో ఓటమి ఎదురైనా.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ట్రీసా జాలీ-గాయత్రీ గోపీచంద్‌ ప్రదర్శన భారత బ్యాడ్మింటన్‌కు భారీ ఊరటనిచ్చింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement