source: X
ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. సౌదీ ప్రో లీగ్‌లో భాగంగా అల్ రియాద్‌తో జరిగిన మ్యాచ్‌లో (అల్ నస్ర్ తరఫున) గోల్ చేయడంతో వరుసగా 25 సీజన్లలో గోల్ చేసిన తొలి ఫుట్‌బాలర్‌గా చరిత్ర సృష్టించాడు.
రొనాల్డో 2002-03 సీజన్ నుంచి ఇప్పటివరకు ప్రతి సీజన్‌లో కనీసం ఒక గోల్ చేశాడు. రొనాల్డోకు ముందు ఈ రికార్డు స్వీడన్ దిగ్గజం జ్లాటన్ ఇబ్రహిమోవిచ్ పేరిట ఉండేది. ఇబ్రహిమోవిచ్ 1999-2000 నుంచి 2022-23 వరకు వరుసగా 24 సీజన్లలో గోల్ చేయగా.. తాజాగా రొనాల్డో ఆ రికార్డును బద్దలు కొట్టాడు.
మరో 23 గోల్స్ దూరంలో..!
అల్ రియాద్‌పై సాధించిన గోల్ రొనాల్డో కెరీర్‌లో 977వ అధికారిక గోల్. దీంతో చారిత్రాత్మక 1,000 గోల్స్ మైలురాయికి అతను కేవలం 23 గోల్స్ దూరంలో ఉన్నాడు.
రొనాల్డో సాధించిన గోల్స్:
* రియల్ మాడ్రిడ్: 450
* మాంచెస్టర్ యునైటెడ్: 145
* జువెంటస్: 101
* స్పోర్టింగ్: 5
* అల్ నస్ర్: 130
* పోర్చుగల్ (జాతీయ జట్టు): 146
మొత్తం: 977 గోల్స్
2026-27 సీజన్ తన ప్రొఫెషనల్ కెరీర్‌లో చివరి సీజన్ కావచ్చని రొనాల్డో ఇటీవల సంకేతాలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో 1,000 గోల్స్ మైలురాయిని అందుకోవాలన్న అతని ప్రయత్నం నెరవేరుతుందో లేదో చూడాలి.
కాగా, అల్ రియాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అల్ నస్ర్ 4-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. తద్వారా సీజన్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. అల్ నస్ర్ తరఫున రొనాల్డోతో పాటు అబ్దులెలాహ్ అల్ అమ్రీ, గాబ్రియేల్ ఏంజెలో, జోవో ఫెలిక్స్ గోల్స్ చేశారు.


