కల్యాణ్ చౌబే
క్రీడా మంత్రికి మాజీ ఫుట్‌బాలర్ల విజ్ఞప్తి
న్యూఢిల్లీ: భారత్ ఫుట్‌బాల్ పరిస్థితి చాలా దయనీయంగా ఉందని, పరిస్థితులు చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని మాజీ ఆటగాళ్లు కోరుతున్నారు. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్)ను ప్రక్షాళన చేయాలని, ప్రస్తుత అధ్యక్షుడు కల్యాణ్ చౌబేను తొలగించి... కొత్త అధ్యక్షుడిని నియమించాలని 15 మంది మాజీ ఫుట్‌బాలర్లు కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయాకు విజ్ఞప్తి చేశారు. భైచుంగ్ భూటియా నేతృత్వంలోని ఈ బృందంలో దీపక్ మొండల్, అరిందమ్ భట్టాచార్య, రెనెడీ సింగ్, అన్వర్ అలీ, ధనచంద్ర సింగ్, సతీశ్ భారతి, అల్విటో డి కన్హా, మన్‌జీత్ సింగ్, బల్వంత్ సింగ్, సెహనాజ్ సింగ్, కరణ్‌జిత్ సింగ్, హర్‌ప్రీత్ సింగ్, బల్‌దీప్ సింగ్, హర్మన్‌జోత్ సింగ్ ఉన్నారు.
‘ప్రస్తుతం మన దేశంలో ఫుట్‌బాల్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. గత మూడేళ్లలో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్ 95 నుంచి 138వ స్థానానికి పడిపోయింది. కాబట్టి కేంద్ర మంత్రి కల్పించుకోవాలి. ఇప్పటికే తన సమర్థతను నిరూపించుకున్న వ్యక్తిని ఎవరినైనా ఏఐఎఫ్‌ఎఫ్ అధ్యక్షుడిగా నియమించాలి. ప్రస్తుత స్థితిలో మన దేశపు ఫుట్‌బాల్‌కు చక్కదిద్దాలంటే దశాబ్దాలు పట్టవచ్చు. ఫుట్‌బాల్ లీగ్‌లు నిర్వహించేందుకు డబ్బులు లేవన్న ఫెడరేషన్ బ్రెజిల్, ఉరుగ్వేలతో మ్యాచ్‌లు జరిపి పబ్లిసిటీ స్టంట్ చేసింది’ అని భూటియా విమర్శించారు. డిసెంబర్ 20న ఏఐఎఫ్‌ఎఫ్‌కు ఎన్నికలు జరగనున్నాయి.


