పట్నా: బిహార్‌లో ఇటీవల పెరిగిన చక్కెర ధరలను సమర్థిస్తూ రాష్ట్ర మంత్రి శ్రవణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మధుమేహం (డయాబెటిస్) బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నందున, ప్రజలు చక్కెర వాడకాన్ని తగ్గిస్తున్నారని, అందుకే ఈ ధరల పెంపు వినియోగదారులపై పెద్దగా ప్రభావం చూపదని ఆయన వింత వాదన తెరపైకి తెచ్చారు.
‘ప్రజలు ఇప్పటికే చక్కెర వాడకాన్ని తగ్గించారు. అందరూ మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ రోజుల్లో అసలు స్వీట్లు ఎవరు తింటున్నారు? చక్కెర ధర పెరిగినా దానివల్ల ఎలాంటి తేడా రాదని నా భావన. దీనిపై ఆందోళన చెందాల్సిన పనేలేదు’ అని ఆయన పేర్కొన్నారు. బిహార్‌లో గతంలో కిలో రూ.48 నుంచి రూ.50 వరకు ఉన్న చక్కెర ధర ప్రస్తుతం రూ.65 దాటింది. మరోవైపు బిహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా కూడా ఈ పెంపును సమర్థించారు. తమ రాష్ట్ర రైతుల పంట ఉత్పత్తులకు అధిక ధర లభిస్తే వ్యక్తిగతంగా తాను సంతోషిస్తానని ఆయన అన్నారు. అయితే ధరల పెరుగుదలకు గల కారణాలపై సంబంధిత శాఖ మంత్రి నుంచి సమాచారం కోరతామని, సమగ్ర విచారణ అవసరమని పేర్కొన్నారు.
మంత్రి శ్రవణ్ కుమార్ వ్యాఖ్యలపై స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆవు పేడపై ఎంత నెయ్యి పోసినా అది పేడలాగే ఉంటుంది. ఇలాంటి మంత్రుల నుంచి ఇంకేం ఆశించగలం? గ్యాస్, టమోటా ధరలు పెరిగినప్పుడు స్మృతి ఇరానీ వంటి నేతలు నిలదీశారు. ఇప్పుడు చక్కెర ధరలు పెరుగుతుంటే డయాబెటిస్ గురించి మాట్లాడుతున్నారు. అసలు ప్రభుత్వమే పెద్ద డయాబెటిస్’ అంటూ దుయ్యబట్టారు. పండుగల సీజన్ సమీపిస్తున్న వేళ ధరలు పెరగడం ప్రజలకు మరింత భారంగా మారింది.
ఇది కూడా చదవండి: రూ. 5 కోట్ల లంచం.. సీఎం భార్యపై సంచలన ఆరోపణలు


