ఉత్తరాఖండ్ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ కీలక తీర్పు వెలువరించింది. బస్సు ప్రయాణంలో ప్రయాణికుడు కండక్టర్‌కు అప్పగించిన సూట్‌కేస్ కనిపించకుండా పోవడంతో.. కండక్టర్ నిర్లక్ష్యమే కారణమని తేల్చింది. సూట్‌కేస్, అందులోని వస్తువులకు రూ.25,000, మానసిక వేదనకు రూ.15,000, న్యాయపరమైన ఖర్చులకు రూ.3,000 చొప్పున మొత్తం రూ.43,000 చెల్లించాలని ఉత్తరాఖండ్ రవాణా సంస్థను ఆదేశించింది. రూ.25,000 మొత్తాన్ని తీర్పు వెలువడిన రెండు నెలల్లో చెల్లించకపోతే.. 2016 మార్చి 11 నుంచి వాస్తవ చెల్లింపు వరకు ఆ మొత్తంపై ఏటా 9 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
కమిషన్ ఉత్తర్వుల ప్రకారం.. 2015 నవంబర్ 8న ఓ ప్రయాణికుడు, ఆయన భార్య ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌కు డీలక్స్ బస్సులో ప్రయాణించారు. ఒక్కొక్కరు రూ.318 చొప్పున టికెట్ చార్జీ చెల్లించారు. ప్రయాణికుడు తన సూట్‌కేస్‌ను బస్సులోని సామాను ఉంచే ప్రదేశంలో పెట్టేందుకు కండక్టర్‌కు అప్పగించారు. అయితే ఖటౌలీకి చేరుకునే సమయానికి సూట్‌కేస్ కనిపించలేదు. అందులో దుస్తులు, నగలు, మందులు తదితర వస్తువులు ఉన్నాయని పేర్కొంటూ ప్రయాణికుడు ఫిర్యాదు చేశారు.
జిల్లా వినియోగదారుల కమిషన్ తొలుత సూట్‌కేస్, అందులోని వస్తువులకు రూ.57,500, మానసిక వేదనకు రూ.15,000, న్యాయపరమైన ఖర్చులకు రూ.3,000 చెల్లించాలని ఆదేశించింది. దీనిపై కండక్టర్ రాష్ట్ర కమిషన్‌ను ఆశ్రయించారు. ప్రయాణికుల సామానుకు వారే బాధ్యత వహించాలంటూ బస్సులో హెచ్చరిక కూడా ఉందని ఆయన వాదించారు.
కండక్టర్ నిర్లక్ష్యం వల్లే సూట్‌కేస్ మాయం
అయితే అధ్యక్షురాలు కుమ్‌కుమ్ రాణి, సభ్యుడు సి.ఎం.సింగ్‌తో కూడిన ధర్మాసనం ఆ వాదనను అంగీకరించలేదు. ప్రయాణికుడు సూట్‌కేస్‌ను కండక్టర్‌కు అప్పగించారని, కండక్టర్ దాన్ని తీసుకున్న తర్వాత సామాను ఉంచే భాగానికి తాళం వేశారని రికార్డులు చూపుతున్నాయని పేర్కొంది. ఉత్తరాఖండ్ రవాణా సంస్థకు చెందిన మరో ఉత్తర్వులోనూ కండక్టర్ ధర్మవీర్ సింగ్ నిర్లక్ష్యం వల్లే సూట్‌కేస్ పోయిందని నిర్ధారించిన విషయాన్ని కమిషన్ పరిగణనలోకి తీసుకుంది.
అయితే సూట్‌కేస్‌లోని వస్తువుల అసలు ధరను నిరూపించే బిల్లులు, రశీదులను ప్రయాణికుడు సమర్పించలేదని కమిషన్ గుర్తించింది. దీంతో రూ.57,500 బదులుగా రూ.25,000ను ఏకమొత్తంగా నిర్ణయించింది. కండక్టర్ రవాణా సంస్థ ఉద్యోగి కావడంతో, ఆయన నిర్లక్ష్యానికి సంస్థ బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఈ తీర్పుతో ప్రజా రవాణాలో ప్రయాణికుల సామానును సిబ్బంది స్వీకరించిన తర్వాత దాని భద్రతపై బాధ్యతకు సంబంధించి వినియోగదారుల ఫిర్యాదుల్లో కీలక అంశం మరోసారి స్పష్టమైంది.
ఇదీ చదవండి: స్మిట్ మచ్చార్ పుర్రెకు ఫ్రాక్చర్, మెమరీ లాస్, చూపు దెబ్బతిని..


