స్మిట్‌ మచ్చార్‌ పుర్రెకు ఫ్రాక్చర్‌, మెమరీ లాస్‌, చూపు దెబ్బతిని.. | Fresh Details Reveal Flydubai Pilot Smit Machchhars Injuries | Sakshi
Sakshi News home page

స్మిట్‌ మచ్చార్‌ పుర్రెకు ఫ్రాక్చర్‌, మెమరీ లాస్‌, చూపు దెబ్బతిని..

Oct 6 2026 3:33 PM | Updated on Oct 6 2026 4:01 PM

Fresh Details Reveal Flydubai Pilot Smit Machchhars Injuries

ఫ్లై దుబాయ్ విమానంలో జరిగిన దాడికి సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. విమాన కాక్‌పిట్‌లో భారత పైలట్ కెప్టెన్ స్మిట్‌ మచ్చార్‌పై ఒమానీ సహ పైలట్ హమామ్ అల్-హమ్మామి గొడ్డలితో దాడి చేసిన ఘటనలో ఆయనకు పుర్రెకు తీవ్ర గాయమైనట్లు తెలుస్తోంది. తలకు, చేతికి కూడా తీవ్రమైన గాయాలైనట్లు సమాచారం. దాడిలో ఆయన చూపు, జ్ఞాపకశక్తిపై కూడా ప్రభావం పడినట్లు తెలుస్తోంది.

సీఎన్‌ఎన్-న్యూస్18తో తెలిపిన వివరాల ప్రకారం.. గొడ్డలి దెబ్బతో స్మిట్‌ మచ్చార్ పుర్రెకు పగులు ఏర్పడింది. ఆ దెబ్బ ఆయన కంటి నరాలపై ప్రభావం చూపడంతో చూపు దెబ్బతిన్నట్లు సమాచారం. ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో జరిగిన సంభాషణలో స్మిట్‌ మచ్చార్ ఈ ఘటనను వివరించారు. “నేను అతడిని ఆపేందుకు ప్రయత్నించాను. కానీ మొదట పడిన దెబ్బల కారణంగా నా చూపు దాదాపు పూర్తిగా పోయింది. అంతా పూర్తిగా మసకగా కనిపించింది” అని ఆయన చెప్పారు.

మత్తు, నొప్పి తగ్గించే మందులు 
విమానం సౌదీ అరేబియాలో దిగిన సమయంలో  స్మిట్‌ మచ్చార్ తలకు, చేతికి తీవ్ర గాయాలైనట్లు ఆయన పరిస్థితి గురించి తెలిసిన వర్గాలు తెలిపాయి. సౌదీ అధికారులు ఆయనకు పుర్రె పగులుకు చికిత్స అందించారు. అనంతరం తదుపరి చికిత్స కోసం ఆయనను యూఏఈకి తరలించారు. ఈ గాయాల ప్రభావం ఆయన జ్ఞాపకశక్తిపైనా పడింది.

స్మిట్‌ మచ్చార్ భార్య సోనల్ మచ్చార్‌ మాట్లాడుతూ.. ఆయనపై ఒత్తిడి పడకూడదన్న ఉద్దేశంతో దాడికి సంబంధించిన వివరాలను కుటుంబం ఆయనతో చర్చించడం లేదని తెలిపారు. తీవ్రమైన తలనొప్పులతో బాధపడుతున్న ఆయనకు అధిక మోతాదులో మత్తు, నొప్పి తగ్గించే మందులు ఇస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. నరాల పనితీరును కూడా వైద్యులు పరిశీలిస్తున్నారు.

ప్రస్తుతం అబుదాబిలోని ప్రత్యేక వైద్య కేంద్రంలో చికిత్స పొందుతున్న స్మిట్‌ మచ్చార్ కొద్దికొద్దిగా నడుస్తూ, ఆహారం తీసుకోవడం ప్రారంభించారని ఆయన పరిస్థితి గురించి తెలిసిన ఓ అధికారి తెలిపారు. కుటుంబం కూడా అందుతున్న వైద్యంపై సంతృప్తి వ్యక్తం చేసింది. యూఏఈ దర్యాప్తు సంస్థలు ఆయన ప్రాథమిక వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు సమాచారం.

మళ్లీ విమానం నడపాలని స్మిట్‌ మచ్చార్ కోరుకుంటున్నారు. ఆయన చూపు పూర్తిగా కోలుకునేలా, భవిష్యత్తులో పైలట్‌గా కొనసాగేందుకు అది అడ్డంకిగా మారకుండా వైద్యులు ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. ఈ ఘటన నుంచి కోలుకుంటున్న సమయంలోనూ ఆయన సానుకూలంగా ఉండటం కుటుంబానికి, వైద్య బృందానికి ఆశాజనకంగా మారింది.

ఇదీ చదవండి: 2,700 పిల్లుల చోరీ.. వాటితో ఏం చేస్తారు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement