ఫ్లై దుబాయ్ విమానంలో జరిగిన ప్రమాదకర ఘటన నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడిన భారతీయ పైలట్ స్మిట్ మచ్ఛార్ తన అనుభవాలను వెల్లడించారు. విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించాడనే ఆరోపణలున్న ఒమన్‌కు చెందిన కో-పైలట్ హమ్మామ్ అల్-హమ్మామీ తనపై గొడ్డలితో దాడి చేసినట్లు తెలిపారు.
సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఎఫ్‌జెడ్1073 విమానంలో ఈ ఘటన జరిగింది. దాడిలో తీవ్రంగా గాయపడిన స్మిట్ స్పృహ కోల్పోయి కిందపడిపోయారు. ఆ సమయంలో మరో పైలట్ విమాన నియంత్రణ చేపట్టి పెను ప్రమాదాన్ని నివారించారు.
“ఆ రోజు విమానాన్ని కాపాడిన నా సహచరుడి ధైర్యాన్ని చనిపోయే వరకు గుర్తుంచుకుంటా” అని స్మిట్ పేర్కొన్నారు. ప్రయాణికులు కూడా కాక్‌పిట్‌లోకి ప్రవేశించి నిందితుడిని అదుపులోకి తీసుకోవడంలో సహకరించారు.
విమానంలో ఉన్న 174 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉండగా, విమానం సౌదీ అరేబియాలోని తబుక్‌లో ల్యాండ్ అయింది. ప్రస్తుతం అబుదాబిలో చికిత్స పొందుతున్న స్మిట్ కోలుకుంటున్నారు.
సీఎన్ఎన్-న్యూస్18తో తెలిపిన వివరాల ప్రకారం.. గొడ్డలి దెబ్బతో స్మిట్ మచ్చార్ పుర్రెకు పగులు ఏర్పడింది. ఆ దెబ్బ ఆయన కంటి నరాలపై ప్రభావం చూపడంతో చూపు దెబ్బతిన్నట్లు సమాచారం. ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో జరిగిన సంభాషణలో స్మిట్ మచ్చార్ ఈ ఘటనను వివరించారు. “నేను అతడిని ఆపేందుకు ప్రయత్నించాను. కానీ మొదట పడిన దెబ్బల కారణంగా నా చూపు దాదాపు పూర్తిగా పోయింది. అంతా పూర్తిగా మసకగా కనిపించింది” అని ఆయన చెప్పారు.
ఇదీ చదవండి: మేము ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాము


