గురుగ్రామ్: హర్యానాలోని గురుగ్రామ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ తన భార్యను గొంతు నులిమి హత్య చేసిన అనంతరం ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. చనిపోయే ముందు అతడు తన కంపెనీ ఉన్నతాధికారులకు ఈమెయిల్ పంపి, తన తండ్రికి, ఇంటి యజమానికి సమాచారం ఇవ్వాలని కోరాడు.
సెక్టార్-68లోని ఎంథ్రీఎం మెరీనా అపార్ట్మెంట్లో అక్టోబర్ 15న ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతులను కేరళకు చెందిన ఫర్హానా (28), బెంగళూరుకు చెందిన మహమ్మద్ అస్లాం (30)గా పోలీసులు గుర్తించారు. అస్లాం గురుగ్రామ్‌లోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు, తన భార్య ఫర్హానా గృహిణి.
ఘటనకు ముందు తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు తన కంపెనీ ఉన్నతాధికారులకు అస్లాం ఈమెయిల్ పంపాడు. ఆ ఈమెయిల్లో తన తండ్రి, ఇంటి యజమాని ఫోన్ నంబర్లు ఇచ్చి వారికి సమాచారం అందించాలని కోరాడు. దీంతో కంపెనీ అధికారులు ఇంటి యజమానికి సమాచారం ఇవ్వగా, పోలీసులకు విషయం తెలిసింది. అయితే పోలీసులు అక్కడికి చేరుకునే సమయానికి దంపతులు ఇద్దరూ మృతి చెందారు.
ఘటనా స్థలంలో పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. “మేము ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్తున్నాము” అని రాసి ఉన్న ఒక లేఖను దర్యాప్తు అధికారులు కనుగొన్నారు. ఫర్హానా ధరించిన దుస్తులపై “ఐ లవ్ యూ” (I love you) అని చేతిరాతతో రాసి ఉండటాన్ని కూడా గుర్తించారు.
అస్లాం మొదట భార్యను హత్య చేసి, అనంతరం ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో భావిస్తున్నారు. అయితే ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
సాఫ్ట్వేర్ ఇంజినీర్ అస్లాం, ఫర్హానా ఇద్దరూ కేరళకు చెందినవారు. వీరు మూడు నెలల క్రితం బెంగళూరు నుంచి గురుగ్రామ్‌కు మారారు. ఈ జంటకు 2023లో వివాహం జరిగింది. ఫర్హానా కూడా ఒక ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తూ ఇంటి నుంచే పని చేసేవారు. ఈ జంట మధ్య చాలా సన్నిహిత బంధం ఉందని, వారి వైవాహిక జీవితంలో ఎలాంటి మనస్పర్థలు లేవని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇదీ చదవండి: సీజేపీకి స్టాలిన్ మద్దతు.. కాంగ్రెస్‌పై సంచలన ఆరోపణ


