చెన్నై: ఎన్నికల ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR), ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలకు డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్ మద్దతు ప్రకటించారు. అయితే కాంగ్రెస్ పార్టీని ‘వెన్నుపోటుదారు’గా అభివర్ణించారు. ఆ పార్టీతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
నేడు (శనివారం) స్టాలిన్ అధ్యక్షతన జరిగిన డీఎంకే ఎంపీల సమావేశంలో జ్ఞానేశ్ కుమార్ను పదవి నుంచి తొలగించాలని, SIR ప్రక్రియను రద్దు చేయాలని, బ్యాలెట్ పేపర్లను తిరిగి ప్రవేశపెట్టాలని తీర్మానించారు. విద్యార్థులు, యువత చేపడుతున్న నిరసనలకు డీఎంకే మద్దతు ప్రకటించింది.
సీజేపీ (CJP) నాయకుల అరెస్టులను స్టాలిన్ గతంలో తీవ్రంగా ఖండించారు. శాంతియుత నిరసనలను అణచివేసే ప్రయత్నాలు ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. సీజేపీ పోరాటానికి డీఎంకే న్యాయపరమైన సహాయం అందిస్తుందని కూడా ప్రకటించారు.
కాంగ్రెస్ ఉద్యమం ఊపందుకున్న తర్వాతే మద్దతు ప్రకటించిందని డీఎంకే ఆరోపించింది. మరోవైపు కాంగ్రెస్కు దూరమైన డీఎంకే.. సీజేపీ, ఇతర ప్రాంతీయ పార్టీలతో కలిసి కొత్త రాజకీయ కూటమి ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఇండియా కూటమిలో విభేదాలు మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే 22 మంది ఎంపీలున్న డీఎంకే మద్దతును పొందేందుకు బీజేపీ కూడా ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇదీ చదవండి: రష్యాపై ఆంక్షల సడలింపు చారిత్రాత్మకం: పుతిన్ ప్రతినిధి


