జెన్సెన్‌ను వెనక్కి తీసుకొద్దాం : మరో దిగ్గజం మద్దతు, వినూత్న పోరు | Uber CoFounder Backs Former Nvidia Huang says We Gotta Bring him Back | Sakshi
Sakshi News home page

జెన్సెన్‌ను వెనక్కి తీసుకొద్దాం : మరో దిగ్గజం మద్దతు, వినూత్న పోరు

Nov 20 2026 3:06 PM | Updated on Nov 20 2026 3:14 PM

Uber CoFounder Backs Former Nvidia Huang says We Gotta Bring him Back

ఎన్విడియా (Nvidia) మాజీ సీఈఓగా జెన్సెన్ హువాంగ్‌ను  మళ్లీ  తిరిగి తీసుకు రావాలనే ప్రయత్నాలకు ఉబర్ (Uber) సహ వ్యవస్థాపకుడు ట్రావిస్ కలనిక్  మద్దతు  నిలిచారు.  ఇప్పటికే తమ  సీఈఓను తిరిగి తీసుకు రావాలని పోరు చేస్తున్న ఉద్యోగులకు తోడుగా  ఇప్పటికే కొంతమంది టెక్‌ దిగ్గజాలు హువాంగ్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తుండగా, ఇపుడు ఆ జాబితాలో కలనిక్  చేరారు. ఈ పోరాటాన్ని నేరుగా  ఎన్విడియా ప్రధాన కార్యాలయం వద్దకు తీసుకెళ్తానని   ప్రతిజ్ఞ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

అంతేకాకుండా ఉద్యోగులు, కంపెనీ వ్యవస్థాపకులు, వ్యాపార దిగ్గజాలను కలుపుకుని వాకౌట్ (విధుల బహిష్కరణ) చేయిస్తానని హెచ్చరించారు. ఇందుకోసం  సిలికాన్ వేఫర్లతో నిండిన మెగాఫోన్ అనే వినూత్న నిరసన ఆయుధాన్ని కూడా ఎంచుకున్నారు. బుధవారం టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో జరిగిన 'టుమారోఎక్స్ సమ్మిట్' (TomorrowX Summit)లో కలనిక్  హువాంగ్‌ను తిరిగి నియమించాలనే ప్రచారానికి తన పూర్తి మద్దతు ప్రకటిస్తూ మాట్లాడారు.  

ఎలాన్ మస్క్‌కు దీర్ఘకాలిక సన్నిహితుడైన ఇన్వెస్టర్ ఆంటోనియో గ్రేసియాస్‌తో జరిగిన సంభాషణలో కలనిక్ మాట్లాడుతూ,  జెన్సెన్‌ను తిరిగి తీసుకురావాలన్నారు. కలనిక్ ధరించిన నల్లటి లెదర్ జాకెట్ (హువాంగ్ ట్రేడ్‌మార్క్ దుస్తుల తరహాలో) గురించి గ్రేసియాస్ ప్రస్తావించడంతో ఈ చర్చ ఆసక్తికర మలుపు తిరిగింది. ఈ సందర్భాన్ని కలనిక్ తన వైఖరిని స్పష్టం చేయడానికి ఉపయోగించుకున్నారు. సిలికాన్ వేఫర్లతో నిండిన మెగాఫోన్ పట్టుకుని, వాకౌట్ చేయాలనుకునే వేలాది మంది ఎన్విడియా ఉద్యోగులు, సీఈఓలు, వ్యవస్థాపకులతో కలిసి  తాను  ఎన్విడియా ప్రధాన కార్యాలయానికి వెళ్తానని వెల్లడించారు. <

 > "న్యాయం కోసం పోరాడుదాం, మన వంతు ప్రయత్నం చేద్దాం. ఫలితం మన చేతుల్లో లేకపోవచ్చు, కానీ గట్టిగా పోరాడుదాం" అని కలనిక్ వ్యాఖ్యానించారు. కలనిక్ మరో టెక్ నాయకుడికి మద్దతు తెలపడం మాత్రమే కాదు. హువాంగ్ నిష్క్రమణతో 2017లో ఉబర్ నుండి తాను వివాదాస్పదంగా తప్పుకున్న సందర్భాన్ని పోల్చారు.

ఉబర్‌లో పని వాతావరణంపై దర్యాప్తు, లైంగిక వేధింపుల ఆరోపణలు, పెట్టుబడిదారుల ఒత్తిడి కారణంగా 2017లో కలనిక్ ఉబర్ సీఈఓ పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో తనను తిరిగి ఉబర్‌లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వచ్చిన పిటిషన్ తాలూకు వార్తా కథనాల స్క్రీన్‌షాట్‌లను హువాంగ్‌కు పంపినట్లు కలనిక్ చెప్పారు. పిటిషన్ మంచిదే, కానీ వాకౌట్ ఇంకా బెటర్ అని తాను సందేశం పంపానని, అయితే హువాంగ్ దానికి స్పందించలేదని కలనిక్ తెలిపారు.

ఇదీ చదవండి: డెబ్యూతోనే ప్రశంసలు : ఒరాకిల్‌ నుంచి ‘తార’ గా ఎవరీ భామ?

 

హువాంగ్‌ను తిరిగి తీసుకురావాలనే పిటిషన్‌పై 2 లక్షల సంతకాలు
హువాంగ్‌ను తిరిగి పదవిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రారంభమైన ఆన్‌లైన్ పిటిషన్‌కు ఇప్పటి వరకు 2 లక్షలకు పైగా సంతకాలు వచ్చాయి. టెక్, పెట్టుబడి రంగాల్లోని ప్రముఖులు దీనికి మద్దతుగా నిలుస్తున్నారు.  టెస్లా సీఈఓ  ఎలాన్‌ మస్క్ ఈ ప్రచారానికి బహిరంగంగా మద్దతు తెలిపారు. 

ఎన్విడియా నిర్ణయాన్ని గెలుస్తున్న జట్టు నుండి బాస్కెట్‌బాల్ దిగ్గజం మైఖేల్ జోర్డాన్‌ను తొలగించడంతో మస్క్‌  పోల్చారు.  అంతేకాదు జెన్సెన్‌ను ఎవరు నియమించుకోవాలనుకోరు అంటూ కొత్త సంకేతాలివ్వడం గమనార్హం. 

ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్,  ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రాక్‌మన్ హువాంగ్‌కు మద్దతు పలికారు.  ఇంకా అండూరిల్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు పామర్ లక్కీ, వెంచర్ క్యాపిటలిస్ట్ రాన్ కాన్వే, పెర్షింగ్ స్క్వేర్ వ్యవస్థాపకుడు బిల్ అక్‌మన్ వంటి ప్రముఖులు కూడా హువాంగ్ నిష్క్రమణకు దారి తీసిన పరిస్థితులపై ప్రశ్నలు లేవనెత్తారు. ఎన్విడియాకు  కృత్రిమ మేధస్సు (AI)  హువాంగ్ చేసిన సేవలు ఎనలేనివని, ఆయనను తొలగించే ముందు సరైన విచారణ జరిపారా అనే సందేహాలను ఆయన మద్దతుదారులు వ్యక్తం చేస్తున్నారు.

తిరిగి రావడానికి సిద్ధమే : జెన్సెన్ హువాంగ్
పదవి నుండి తప్పుకున్న తర్వాత తన మొదటి బహిరంగ ప్రకటనలో, తిరిగి సీఈఓ బాధ్యతలు చేపట్టడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు హువాంగ్ సూచించారు. వాటాదారులు, ఉద్యోగులు, కంపెనీ మరియు అమెరికా ప్రయోజనాల దృష్ట్యా అది సరైనదని ఎన్విడియా బోర్డు భావిస్తే, తిరిగి రావడాన్ని గౌరవంగా భావిస్తానని ఆయన అన్నారు.

అలాగే, తన భార్యకు నమ్మకద్రోహం చేసినందుకు ఆయన క్షమాపణలు చెప్పారు. అయితే, టెక్ దిగ్గజాల మద్దతు, భారీ పిటిషన్లు ఉన్నప్పటికీ, హువాంగ్‌ను తిరిగి నియమించే ప్రసక్తే లేదని ఎన్విడియా బోర్డు స్పష్టం చేసింది.

ట్రావిస్ కలనిక్  పోరాటానికి కారణం?
ఏఐ భవిష్యత్తుకు హువాంగ్  చాలా కీలకమైన వ్యక్తి అని, ఏఐ అనేది మనుషులను నియంత్రించే శక్తిగా కాకుండా, మానవాళి నిబంధనలకు లోబడి పనిచేసే దిశగా నడిపించగల అత్యుత్తమ వ్యక్తులలో హువాంగ్ ఒకరని కలనిక్ అభిప్రాయపడ్డారు.ఆ స్వేచ్ఛను ఇవ్వగల నంబర్ 1 వ్యక్తి జెన్సెన్, ఆయన దాని కోసమే నిలబడ్డారని కలనిక్ అన్నారు. ఈ అంశం కేవలం హువాంగ్ పాత పదవికి తిరిగి రావడం గురించి మాత్రమే కాదని, ఇది న్యాయం, సరైన విచారణ ప్రక్రియకు సంబంధించినదని ఆయన నొక్కి చెప్పారు.

ఇదీ చదవండి: బుడ్డోడి ఫోజులకు ఫిదా : సర్‌ప్రైజ్‌ ఆఫర్‌

కాగా వివాహేతర సంబంధాలు, విదేశీ గూఢచార సంస్థలతో సంబంధాలపై జరుగుతున్న దర్యాప్తు వివాదం నేపథ్యంలో హువాంగ్ గత వారం ఎన్విడియా సీఈఓ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement