ప్రపంచ ఏఐ రంగాన్ని శాసిస్తున్న అమెరికా దిగ్గజం ఎన్విడియా మరోసారి అంతర్జాతీయ వాణిజ్య, దర్యాప్తు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అత్యాధునిక ఏఐ చిప్‌లు అక్రమ మార్గాల్లో చైనాకు తరలుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఎన్విడియా మాజీ అధికారి, భారత సంతతికి చెందిన అజయ్ కుమార్ (జే) పురి పేరు తెరపైకి వచ్చింది. సర్వర్ తయారీ సంస్థ సూపర్‌మైక్రో మాజీ ఉద్యోగిని సెంలీ చెన్‌తో ఆయనకు సంబంధం ఉన్నట్లు అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ ‘మడ్డీ వాటర్స్’ ఆరోపించింది.
మడ్డీ వాటర్స్ నివేదిక సారాంశం..
‘ఎన్విడియా: మోర్ చైనా’ పేరిట మడ్డీ వాటర్స్ విడుదల చేసిన నివేదిక ఈ వివాదానికి ఆజ్యం పోసింది. ఎన్విడియాలో 21 ఏళ్లకు పైగా పనిచేసి గ్లోబల్ ఫీల్డ్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా సంస్థ విక్రయాలను శాసించిన జే పురి, సూపర్‌మైక్రో మాజీ ఉద్యోగిని సెంలీ చెన్ 2024–26 మధ్య కలిసి ఉన్నట్లు కొన్ని ఫొటోలను ఆ నివేదికలో ప్రస్తావించారు. వీరిద్దరి వ్యక్తిగత, వ్యాపార సంబంధాలు చిప్‌ల ఎగుమతుల వ్యవహారంలో ప్రభావం చూపాయా అన్న కోణంలో మడ్డీ వాటర్స్ ప్రశ్నలు లేవనెత్తింది.
అయితే, ఆ ఫొటోల్లో ఉన్న మహిళ సెంలీ చెన్ ఒక్కరేనని స్వతంత్రంగా నిర్ధారించే ఆధారాలు లేవు. దీనిపై చెన్ ప్రస్తుతం సీఈఓగా ఉన్న ‘క్రోనోస్కేల్’ సంస్థను మడ్డీ వాటర్స్ వివరణ కోరినా స్పందన రాలేదు. మరోవైపు, జే పురి 2026 జూన్‌లో రోజువారీ బాధ్యతల నుంచి తప్పుకుని సంస్థలో సీనియర్ సలహాదారుగా కొనసాగుతున్నారు.
ఆరోపణలకు, వాస్తవాలకు మధ్య తేడా
అమెరికా జాతీయ భద్రతా నిబంధనల నేపథ్యంలో ఏఐ చిప్‌ల సరఫరా గొలుసులో పారదర్శకతపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో కార్పొరేట్ వర్గాల మధ్య సాగే షార్ట్ సెల్లర్ల నివేదికలను, అధికారిక దర్యాప్తు సంస్థల ఆధారాలను విడివిడిగా విశ్లేషించాల్సి ఉంది. కాగా, చిప్‌ల అక్రమ రవాణాలో జే పురి కానీ, సెంలీ చెన్ ప్రమేయం ఉన్నట్లు అమెరికా ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటనా చేయలేదు, నేరారోపణలూ నమోదు చేయలేదు. కేవలం మడ్డీ వాటర్స్ లేవనెత్తిన ప్రశ్నలను నిర్ధారిత నేరాలుగా పరిగణించలేమని న్యాయ, వాణిజ్య విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అమెరికా దర్యాప్తు సంస్థల తదుపరి విచారణలోనే ఈ వ్యవహారంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: ‘ప్రైవేటు బైక్ ట్యాక్సీకి అనుమతులివ్వండి’


