సోషల్ మీడియాలో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న హిప్పో ఫియోనా.. ఓ చిన్న టోపీ కారణంగా ప్రాణాలు కోల్పోయింది. సందర్శకుడు పొరపాటున విసిరిన అల్లిన టోపీని మింగడంతో తీవ్ర అనారోగ్యానికి గురై చివరకు కన్నుమూసింది. అమెరికాలోని సిన్సినాటి జూలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
2017లో నెలలు నిండకుండానే జన్మించిన ఫియోనా.. పుట్టినప్పుడు కేవలం 13 కిలోల బరువుతో ఉండేది. అప్పట్లో ప్రాణాలతో బయటపడేందుకు తీవ్రంగా పోరాడిన ఆమె.. ఆ తర్వాత కోలుకుని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆమె కథ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలవడంతో పాటు సోషల్ మీడియాలోనూ స్టార్‌గా మారింది.
సుమారు 10 రోజుల క్రితం ఓ సందర్శకుడు విసిరిన టోపీ సీలింగ్ ఫ్యాన్‌కు తగిలి ఎగిరి ఫియోనా ఆవరణలోని చిన్న ఖాళీ ద్వారా లోపలికి వెళ్లింది. దాన్ని మింగిన తర్వాత తొలుత సాధారణంగానే కనిపించిన ఆమె.. కొద్ది రోజులకే ఆహారం తీసుకోవడం తగ్గించింది. దీంతో జూ వైద్యులు అత్యవసర చికిత్స ప్రారంభించారు.
టోపీ చిన్నపేగుల్లో కదులుతున్నట్లు అల్ట్రాసౌండ్‌లో గుర్తించిన వైద్యులు.. అది సహజంగా బయటకు వచ్చేందుకు పలు ప్రయత్నాలు చేశారు. ఆహారం తినేలా ప్రోత్సహించడంతో పాటు వైబ్రేషన్ ప్లాట్‌ఫామ్‌పై నిలబెట్టే ప్రయత్నం కూడా చేశారు. అయితే వైద్యులు, సంరక్షకులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరకు ఫియోనా ప్రాణాలు కోల్పోయింది.
ఫియోనా మరణంతో సిన్సినాటి నగరమంతా విషాదంలో మునిగిపోయింది. ఆమె నగరానికి ఆనందం, పట్టుదలకు ప్రతీకగా నిలిచిందని మేయర్ ఆఫ్తాబ్ పురేవాల్ పేర్కొన్నారు. సాధారణంగా హిప్పోలు 50 ఏళ్ల వరకు జీవిస్తుండగా.. ఫియోనా జీవితం ఇలా అర్ధాంతరంగా ముగియడం అభిమానులను కలచివేస్తోంది. ఆమె జ్ఞాపకాలు మాత్రం ఎందరో హృదయాల్లో నిలిచిపోనున్నాయి.
ఇదీ చదవండి: రోహింగ్యాలపై మారణహోమం.. మయన్మార్‌కు చారిత్రాత్మక తీర్పు!


