మియామీ: అమెరికాలో విమాన ప్రయాణాల గందరగోళం కొనసాగుతున్న వేళ మరో ప్రమాదం చోటుచేసుకుంది. మియామీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు విమానాలు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. శనివారం రాత్రి సుమారు 9.15 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
పనామా సిటీ నుంచి వచ్చిన కోపా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానంలో 166 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. విమానం విమానాశ్రయంలోని ట్యాక్సీవేపై కదులుతున్న సమయంలో యూపీఎస్‌కు చెందిన బోయింగ్ 767 కార్గో విమానాన్ని ఢీకొంది. కోపా విమానం రెక్క చివరి భాగం కార్గో విమానం ముందు భాగాన్ని తాకింది. ప్రమాదం అనంతరం కోపా విమానంలోని ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించారు. గాయపడిన ఇద్దరికి విమానాశ్రయ వైద్య సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించారు. మిగిలిన ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది క్షేమంగా ఉన్నారని కోపా ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. ఘటనపై అధికారులకు పూర్తిగా సహకరిస్తామని తెలిపింది.
‘మమ్మల్ని ఎవరో ఢీకొట్టారు’
ఈ ప్రమాదానికి సంబంధించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సంభాషణ ప్రస్తుతం వైరల్‌గా మారింది. కోపా విమాన పైలట్ తమ విమానాన్ని మరో విమానం ఢీకొట్టిందని కంట్రోలర్‌కు తెలిపాడు. దీనికి యూపీఎస్ విమాన పైలట్ స్పందిస్తూ.. తాము కొంత ముందుకు వెళ్లామని, తమ విమానం రెక్క కోపా విమానాన్ని తాకిందని వివరించాడు. కోపా విమానానికి ఎడమవైపు రెక్క చివరి భాగం దెబ్బతిన్నట్లు పైలట్ గుర్తించాడు.
ఒక్కసారిగా పక్కకు కదిలిన విమానం
ప్రమాద సమయంలో విమానంలో ఉన్న ప్రయాణికుడు సీజర్ ఫెరీరా తన అనుభవాన్ని వెల్లడించాడు. విమానం సాధారణ వేగంతో ట్యాక్సీవేపై కదులుతుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించిందని, ఆ తర్వాత మరో విమానం తమ విమానాన్ని ఢీకొట్టినట్లు అనిపించిందని చెప్పాడు. విమానం ఒక్కసారిగా పక్కకు కదిలిందని వివరించాడు. అయితే విమాన సిబ్బంది వెంటనే స్పందించి ప్రయాణికులను ప్రశాంతంగా ఉండాలని సూచించారని తెలిపాడు.
రెండు నెలల్లో రెండో ఘటన
మియామీ విమానాశ్రయంలో రెండు నెలల వ్యవధిలో చోటుచేసుకున్న రెండో పెద్ద ప్రమాదం ఇది. సెప్టెంబర్ 6న ప్యూర్టోరికోలోని శాన్ జువాన్ నుంచి వచ్చిన అమెజాన్ కార్గో విమానం రన్‌వేపై అదుపుతప్పి బయటకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు. విమానం రెండు వాహనాలను ఢీకొట్టినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
అమెరికాలో విమాన సేవలకు అంతరాయం
మరోవైపు అమెరికాలో విమాన ప్రయాణాలు ఇంకా సాధారణ స్థితికి చేరుకోలేదు. శుక్రవారం ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ) ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తడంతో దేశవ్యాప్తంగా విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. రేడియో ఫ్రీక్వెన్సీల నిర్వహణకు సంబంధించిన నెట్‌వర్క్‌లో లోపం కారణంగా దాదాపు ఐదు గంటలపాటు విమానాల రాకపోకలు నిలిచిపోయాయి.
JUST IN: UPS Boeing 767 collides with Copa Airlines 737 while taxiing at Miami International Airport in Florida, according to local radio station WMEN. "Yeah, we went too far and he clipped us with the wing," according to ATC audio. https://t.co/ogPvmAIhfA
— AZ Intel (@AZ_Intel_) November 15, 2026


