కాన్‌బెర్రా: ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో పంజాబ్‌కు చెందిన సిక్కు మహిళా ప్రజాప్రతినిధి డాక్టర్ పర్వీందర్ కౌర్ గురునానక్ దేవ్ బోధనలను వినిపించి ప్రశంసలు అందుకున్నారు. పశ్చిమ ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో నిర్వహించిన గురునానక్ దేవ్ 557వ జయంతి వేడుకల్లో ఆమె ప్రసంగించారు. సమానత్వం, సేవాభావం, సోదరభావం వంటి సిక్కు మత విలువలను వివరించారు.
ఈ సందర్భంగా గురునానక్ ప్రారంభించిన లంగర్ సంప్రదాయం గురించి ప్రస్తావించారు. చిన్నతనంలో గురునానక్ తండ్రి మెహతా కలూ వ్యాపారం కోసం రూ.20 ఇచ్చారని, మార్గమధ్యంలో ఆకలితో ఉన్న సాధువులను చూసిన ఆయన ఆ డబ్బుతో వారికి భోజనం పెట్టారని వివరించారు. డబ్బు సంపాదించడం కంటే ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడమే నిజమైన కర్తవ్యం అని గురునానక్ భావించారని తెలిపారు. ఈ ఆలోచనే లంగర్ సంప్రదాయానికి పునాదిగా మారిందన్నారు.
కులం, మతం, ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అందరూ ఒకేచోట కూర్చుని భోజనం చేయడమే లంగర్ ప్రత్యేకతని చెప్పారు. నిజాయతీగా సంపాదించడం, సంపాదించిన దానిని ఇతరులతో పంచుకోవడం, భగవంతుడిని స్మరించుకోవడం సిక్కు మతంలోని మూడు ప్రధాన సూత్రాలని వివరించారు. పంజాబ్‌లోని నవాన్‌షహర్ సమీప గ్రామానికి చెందిన పర్వీందర్ కౌర్ పశ్చిమ ఆస్ట్రేలియా లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ఎన్నికైన తొలి సిక్కు మహిళగా గుర్తింపు పొందారు. ఆమె ప్రముఖ బయోటెక్నాలజీ శాస్త్రవేత్త కూడా. 2013లో సైన్స్ అండ్ ఇన్నోవేషన్ అవార్డు, 2019లో మైక్రోసాఫ్ట్ ఏఐ ఫర్ ఎర్త్ అవార్డును అందుకున్నారు.
ఇదీ చదవండి: 2027లో యోగికి, 2029లో మోదీకి చెక్: ఓవైసీ శపథం!


