అమెరికా: తీరని విమాన కష్టాలు.. 530 రద్దు, 430 ఆలస్యం! | America FAA Technical Failure, US Flight Cancellations | Sakshi
Sakshi News home page

అమెరికా: తీరని విమాన కష్టాలు.. 530 రద్దు, 430 ఆలస్యం!

Nov 15 2026 7:44 AM | Updated on Nov 15 2026 7:56 AM

America FAA Technical Failure, US Flight Cancellations

వాషింగ్టన్‌: అమెరికాలో విమాన ప్రయాణాల కష్టాలు ఇంకా తొలగలేదు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ) ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కమ్యూనికేషన్ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తడంతో దేశవ్యాప్తంగా విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శనివారం వేలాది విమానాలు రద్దు కాగా, మరికొన్ని గంటల తరబడి ఆలస్యంగా నడిచాయి. ఆదివారం కూడా పరిస్థితి పూర్తిస్థాయిలో సాధారణ స్థితికి వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఎఫ్‌ఏఏ అధికారులు వెల్లడించారు. ఫ్లైట్‌అవేర్ గణాంకాల ప్రకారం.. శనివారం సాయంత్రం 6.45 గంటల ఈటీ సమయానికి అమెరికాలో 6,150కి పైగా విమానాలు రద్దయ్యాయి. మరో 7,300కుపైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఆదివారం ప్రయాణించాల్సిన విమానాల్లోనూ 530కి పైగా సర్వీసులను ముందుగానే రద్దు చేశారు.

డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అక్కడ శనివారం 430 విమానాలు ఆలస్యంగా నడవగా, 380కిపైగా సర్వీసులు రద్దయ్యాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు. ఈ అంతరాయంపై ఎఫ్‌ఏఏ చీఫ్ బ్రయాన్ బెడ్‌ఫోర్డ్ ప్రయాణికులకు క్షమాపణలు తెలిపారు. విమానయాన వ్యవస్థను స్థిరీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఆదివారం చివరి నాటికి కార్యకలాపాలు చాలావరకు సాధారణ స్థితికి వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. విమానాలు, పైలట్లు, ఇతర సిబ్బందిని తిరిగి సర్దుబాటు చేయడం ఎయిర్‌లైన్స్‌కు సవాలుగా మారింది.

శుక్రవారం ఎఫ్‌ఏఏ గ్రౌండ్ స్టాప్ ఆదేశాలు జారీ చేయడంతో దాదాపు ఐదు గంటలపాటు అమెరికాలో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. 9/11 దాడుల తర్వాత అమెరికా విమానయాన రంగంలో ఇంత సుదీర్ఘ అంతరాయం ఇదే. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలోని హార్డ్‌వేర్ పాతబడిపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని అమెరికా రవాణా శాఖ మంత్రి షాన్ డఫీ తెలిపారు. కొత్త వ్యవస్థ కోసం కాంగ్రెస్ పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాలని అధ్యక్షుడు ట్రంప్‌ గత ఏడాది నుంచి కోరుతున్నారన్నారు. ఇది సైబర్ దాడి కాదని కూడా స్పష్టం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement