breaking news
Technical failure
-
ఘోర విషాదాలు
న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం దేశ ప్రజలను ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. దేశంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదాల్లో ఇది కూడా ఒకటని చెబుతున్నారు. గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి. వందలాది మంది ప్రయాణికులు గమ్యస్థానం చేరకుండానే కన్నుమూశారు. చాలావరకు సాంకేతిక లోపాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులతోపాటు మానవ తప్పిదాలు సైతం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. → 2020 ఆగస్టు 7: కేరళలోని కోజికోడ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు రన్‌వేపై ఎయిర్ ఇండియా 1344 విమానం ల్యాండవుతున్న సమయంలో అదుపు తప్పింది. పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. విమానం రెండు ముక్కలు కావడంతో అందులో ఉన్న 190 మంది ప్రయాణికుల్లో 21 మంది మృతిచెందారు. భారీ వర్షం, ప్రతికూల వాతావరణం కారణంగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు పైలట్లు సైతం ఉన్నారు. → 2010 మే 22: కర్ణాటకలోని మంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 737–800 విమానం ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పి లోయలో పడిపోయింది. విమానంలో వెంటనే మంటలు చెలరేగడంలో 158 మంది మరణించారు. ఇది టేబుల్‌టాప్ రన్‌వే కావడంతో విమానాన్ని ల్యాండింగ్ చేయడంలో పైలట్ తడబడినట్లు గుర్తించారు. → 2000 జూలై 17: బిహార్ రాజధాని పాటా్నలో అలయెన్స్ ఎయిర్ ఫ్లైట్ 7412 జనావాసాలపై కుప్పకూలింది. 60 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 55 మంది విమాన ప్రయాణికులు కాగా, ఐదుగురు ఇళ్లల్లోని నివాసితులు. → 1996 నవంబర్ 12: సౌదీ అరేబియా విమానం 763, కజకిస్తాన్ ఎయిర్లైన్స విమానం 1907 హరియాణాలోని చార్కీ దాద్రీ గగనతలంలో పరస్పరం ఢీకొని కుప్పకూలాయి. ఏకంగా 349 మంది మరణించారు. సమాచార మారి్పడిలో లోపం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. → 1990 ఫిబ్రవరి 14: ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం 605 బెంగళూరు హెచ్ఏఎల్ ఎయిర్‌పోర్టులో ల్యాండయ్యే ముందు అదుపుతప్పింది. రన్‌వే పక్కన భూమిని ఢీకొని పక్కనే ఉన్న గోల్ఫ్ కోర్సులోకి దూసుకెళ్లింది. విమానంలో 146 మంది ఉండగా, వీరిలో 92 మంది మృతిచెందారు. → 1988 అక్టోబర్ 19: గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 113 ల్యాండింగ్ సమయంలో రన్‌వే పక్కన చెట్లను ఢీకొట్టింది. వెంటనే మంటలు చెలరేగడంతో 135 మంది ప్రయాణికులకు గాను 133 మంది విగత జీవులయ్యారు. పొగమంచు అధికంగా ఉండడం వల్ల రన్‌వే కనిపించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. → 1978 జనవరి 1: ముంబై నుంచి దుబాయ్‌కి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 855 అరేబియా సముద్రంలో కూలిపోయింది. విమానంలోని మొత్తం 213 మంది ప్రయాణికులు మరణించారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ దుర్ఘటన జరిగింది. → 1973 మే 31: ఢిల్లీ పాలమ్ ఎయిర్‌ఫోర్టులో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం 440 ల్యాండింగ్ కంటే ముందు హైటెన్షన్ విద్యుత్ వైర్లను ఢీకొట్టింది. దాంతో అందులో మంటలు వ్యాపించడంతో 65 మందికిగాను 48 మంది ప్రయాణికులు బలయ్యారు. ప్రతికూల వాతావరణం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుంది. -
సెల్యూట్ పైలట్ సిద్ధార్థ్!
అంతా బాగున్నప్పుడు కాదు, ప్రమాదపుటంచున ఉన్నప్పుడు ఎలా స్పందిస్తామన్నది మన వ్యక్తిత్వానికి కొలమానంగా నిలుస్తుంది. బుధవారం రాత్రి గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో కూలిపోయిన భారత వైమానిక దళ జాగ్వార్ ఫైటర్ జెట్ పైలట్ సిద్ధార్థ్ యాదవ్ అలాంటి గొప్ప వ్యక్తిత్వమున్న వారి కోవకే వస్తారు. సాంకేతిక లోపాలతో విమానం కుప్పకూలనుందని అర్థమైంది. 28 ఏళ్ల యువకుడు. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు. పైగా 10 రోజుల కిందే నిశ్చితార్థం కూడా అయింది. కో పైలట్‌తో కలిసి సురక్షితంగా ఎజెక్టయ్యే అవకాశముంది. అయినా సిద్ధార్థ్ తన ప్రాణాల కోసం పాకులాడలేదు. ప్రజల భద్రత గురించే ఆలోచించారు. విమానంజనావాసాల్లో పడకుండా జాగ్రత్తపడ్డారు. సురక్షితంగా మైదానంలో కూలిపోయేలా చూశారు. తద్వారా ఎంతోమంది పౌరుల మరణాలను నివారించారు. ఆ క్రమంలో దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయినా తన సాటిలేని త్యాగంతో జాతి గుండెల్లో చిరంజీవిగా మిగిలిపోయారు. కో పైలట్ సురక్షితంగా ఎజెక్టయినా గాయాలపాలయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. చివరి క్షణాల్లోనూ... బయల్దేరిన కాసేపటికే విమానంలో సాంకేతిక వైఫల్యం తలెత్తింది. విమానాన్ని నియంత్రించడానికి ప్రయత్నించినా లాభం లేకపోయింది. ప్రమాదం తప్పదని స్పష్టమైంది. దాంతో పైలెట్లిద్దరూ ఎజెక్షన్ ప్రారంభించారు. అంతటి క్లిష్ట సమయంలోనూ ముందు కో పైలట్ సురక్షితంగా బయటపడేలా సిద్ధార్థ్ జాగ్రత్త తీసుకున్నారు. తర్వాత కూడా విమానాన్ని వెంటనే వదిలేయకుండా నివాస ప్రాంతాలకు దూరంగా తీసుకెళ్లారు. ఆ క్రమంలో ప్రాణాలనే పణంగా పెట్టారు. కుటుంబమంతా దేశ సేవలోనే.. ఫ్లైట్ లెఫ్టినెంట్ సిద్ధార్థ్ స్వస్థలం హరియాణాలోని రేవారీ. వారిది తరతరాలుగా సైనిక కుటుంబమే. ఆయన ముత్తాత బ్రిటిష్ హయాంలో బెంగాల్ ఇంజనీర్స్ విభాగంలో పనిచేశారు. తాత పారామిలటరీ దళాల్లో సేవలందించారు. తండ్రి కూడా వైమానిక దళంలో పనిచేశారు. సిద్ధార్థ్ 2016లో వైమానిక దళంలో చేరారు. రెండేళ్ల సర్వీసు తర్వాత ఫ్లైట్ లెఫ్టినెంట్‌గా పదోన్నతి పొందారు. మార్చి 23నే నిశ్చితార్థం జరనిగింది. నవంబర్ 2న పెళ్లి జరగాల్సి ఉంది. మార్చి 31 దాకా కుటుంబీకులతో గడిపి ఇటీవలే విధుల్లో చేరారు. ఆయన మరణవార్తతో కుటుంబం, స్నేహితులే గాక పట్టణమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. విమానంలో ప్రయాణించాలని, దేశానికి సేవ చేయా లని సిద్ధార్థ్ ఎప్పుడూ కలలు కనేవాడని చెబుతూ తండ్రి సుజీత్ యాదవ్ కన్నీటిపర్యంతమయ్యారు. ‘‘సిద్ధార్థ్ తెలివైన విద్యారి్థ. తనను చూసి ఎప్పుడూ గర్వపడేవాళ్లం. ప్రజల ప్రాణాలు కాపాడుతూ తన ప్రాణాలర్పించాడు. నా కొడుకును చూసి చాలా గర్వపడుతున్నా. మాకు ఒక్కగానొక్క కొడుకు తను’’అంటూ గుండెలవిసేలా రోదించారు. సిద్ధార్థ్ పారి్థవదేహం శుక్రవారం రేవారీకి చేరింది. పూర్వీకుల గ్రామం భలాకి మజ్రాలో పూర్తి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సాంకేతిక లోపమే కారణం
► హిరాఖండ్ ప్రమాదంపై రైల్వే సేఫ్టీ కమిషన్ ప్రాథమిక అంచనా ► రైలు లైన్ మారే సమయంలో విరిగిన టంగ్‌రైల్ పట్టా ► విద్రోహచర్య కాకపోవచ్చు... సాక్షి, హైదరాబాద్: నలభై మంది ప్రాణాలు బలిగొన్న హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి సాంకేతిక లోపమే కారణమని రైల్వే సెక్యూరిటీ కమిషన్ ప్రాథమికంగా అభిప్రాయానికి వచ్చింది. విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరులో జరగిన ఈ ప్రమాదం వెనక విద్రోహచర్య ఉందన్న అభిప్రాయాల నేపథ్యంలో రైల్వే సేఫ్టీ కమిషన్ అభిప్రాయం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై లోతైన దర్యాప్తు జరపాల్సి ఉన్నప్పటికీ ప్రాథమిక అంచనాలో మాత్రం సాంకేతిక లోపమే కారణమై ఉంటుందన్న అభిప్రాయాన్ని రైల్వే బోర్డు ముందుంచినట్టు తెలిసింది. రైలు ట్రాక్ మారే తరుణంలో టంగ్‌రైల్ (ట్రాక్ మారేందుకు ఉపయోగపడే సన్నటి పట్టా) విరిగిపోవటంతోనే చక్రాలు పట్టాలు తప్పాయని దాదాపు నిర్ధారణకు వచ్చింది. ఆ సమయంలో టంగ్‌రైల్ పట్టాపై విపరీతమైన ఒత్తిడి, రాపిడి జరిగినట్టు భావిస్తున్నారు. వీల్ యాక్సిల్ లోపం వల్లనా, టంగ్‌రైల్ మార్పు సరిగా జరగకపోవటం వల్లనా అన్నది తేలాల్సి ఉంది. అయితే అసలు టంగ్ రైల్ పట్టా పటుత్వంలో లోపం ఉంటే సులభంగా విరుగుతుందనే అభిప్రాయాన్ని కొందరు అధికారులు వ్యక్తం చేశారు. దీంతో ఆ పట్టా నమూనాలను పరీక్షించాలని నిర్ణయించినట్టు తెలిసింది. సాధారణంగా చలి తీవ్రత ఉన్న సమయంలో పట్టాలు విరిగే అవకాశం ఉంటుంది. చిన్నపాటి పగళ్లున్నా చలికి సంకోచించినప్పుడు ఒత్తిడికిలోనై విరుగుతాయి. ఈ క్రమంలో విరిగిన పట్టా నాణ్యతను కూడా అంచనా వేయనున్నారు. గత సంవత్సరం కాన్పూరు వద్ద రైలు పట్టాలుతప్పి 125 మంది మృతికి కారణమైన ఘోర ప్రమాదానికి కూడా పట్టా విరిగిపోవటమే కారణమని తాజాగా తేలిన నేపథ్యంలో... అధికారులు పేర్కొంటున్న అభిప్రాయాలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. నిర్వహణ లోపం ఉన్నట్టే... సాధారణ పట్టాల కంటే... రైలును మరో మార్గంలో మళ్లించే అతి కీలక టంగ్‌రైల్ పట్టాలపై మరింత శ్రద్ధ అవసరం. ఇది పూర్తిగా ఇంజనీరింగ్ వ్యవస్థతో అనుసంధానమై పనిచేస్తున్నందున దాన్ని అత్యంత శ్రద్ధగా నిర్వహించాల్సి ఉంటుంది. అది పటుత్వం కోల్పోయిందా, రెండు మార్గాలకు అనుసంధానించేలా అటూఇటూ కదలిక సరిగ్గా జరుగుతోందా లేదా అన్న విషయంలో నిరంతరం పరిశీలన అవసరం. అలాంటి తరుణంలో ఇంతటి భారీ ప్రమాదం జరిగిందంటే సంబంధిత సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టేనని ఓ రైల్వే ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. రంగంలోకి ఎన్ఐఏ... ఈ ఘోర రైలు ప్రమాదం వెనుక విద్రోహుల కుట్ర ఉందా? ఇదే కోణంలో అనుమానిస్తున్నాయి కేంద్ర నిఘా వర్గాలు. ఈ నేపథ్యంలోనే ప్రాథమిక దర్యాప్తు నిమిత్తం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక బృందం సోమవారం ఘటనాస్థలికి చేరుకుంది. కాగా, ఇండోర్–పట్నా ఎక్స్‌ప్రెస్ గత ఏడాది నవంబర్ 21న పుఖర్యాన్లోని కాన్పూర్‌లో పట్టాలు తప్పి 148 మంది మరణించారు. అంతా ప్రమాదమని భావిస్తున్న తరుణంలో... దీని వెనుక విద్రోహ కోణం ఇటీవల బయటపడింది. పాక్ నిఘా సంస్థ కనుసన్నల్లో పని చేస్తూ దుబాయ్, సౌదీ అరేబియా, బంగ్లాదేశ్‌ల కేంద్రంగా కార్యకలాపాలు నడుపుతున్న గ్యాంగ్ పనని తేలింది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఎన్ఐఏ అధికారులు కూనేరు ప్రమాదం వెనుకా ఇలాంటి కోణాలు ఉన్నాయేమోనని ఆరా తీస్తున్నారు. నలుగురు అధికారులతో కూడిన ప్రత్యేక బృందం ఆధారాల కోసం కూనేరులో హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదస్థలికి వెళ్లినట్లు ఎన్ఐఏ పీఆర్ఓగా వ్యవహరిస్తున్న ఐజీ అలోక్ మితలానీ ధృవీకరించారు. ఈ కేసు దర్యాప్తును స్వీకరించాలా? వద్దా? అనేది ఇంకా నిర్ణయించలేదని, ప్రస్తుతం ప్రాథమిక పరిశీలన జరుగుతోందని పేర్కొన్నారు. -
వంగపల్లిలో నిలిచిపోయిన గూడ్సు రైలు
యాదగిరిగుట్ట (నల్గొండ జిల్లా) : యాదగిరిగుట్ట మండలం వంగపల్లి రైల్వే గేటు మధ్యలో గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో గూడ్సు రైలు ఆగిపోయింది. సాంకేతిక సమస్య వల్ల రైలు ఆగిపోయినట్లు రైల్వే సిబ్బంది తెలిపారు. రైలు సరిగ్గా రోడ్డు మార్గానికి అడ్డంగా ఆగిపోవడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.