వ్యాపార ప్రపంచంలో వైఫల్యం అనేది ముగింపు కాదు, అది ఒక కొత్త ఆరంభానికి పునాది అని నిరూపించారు గుజరాత్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఏఐఏ ఇంజినీరింగ్ వ్యవస్థాపకులు భద్రేశ్ కాంతిలాల్ షా. తొలి వ్యాపారం ప్రారంభించిన ఏడాదిలోపే పెట్టుబడి మొత్తం కోల్పోయి ఫ్యాక్టరీకి తాళం వేయాల్సిన పరిస్థితి ఎదురైనా ఆయన కుంగిపోలేదు. తండ్రి ఇచ్చిన ఆర్థిక అండ, తన సాంకేతిక పరిజ్ఞానంపై ఉన్న నమ్మకంతో మళ్లీ అడుగులు వేశారు. నేడు సుమారు రూ.35 వేల కోట్ల మార్కెట్ విలువ కలిగిన అంతర్జాతీయ దిగ్గజ సంస్థను నిర్మించి దేశీయ పారిశ్రామిక రంగానికే ఆదర్శంగా నిలిచారు.
డాక్టర్ల కుటుంబం నుంచి ఇంజినీరింగ్ వైపు..
1951 అక్టోబర్ 7న వైద్యుల కుటుంబంలో జన్మించిన భద్రేశ్ షా కుటుంబ సంప్రదాయానికి భిన్నంగా ఇంజినీరింగ్ రంగాన్ని ఎంచుకున్నారు. ప్రతిష్టాత్మక ఐఐటీ కాన్పూర్ నుంచి మెటలర్జికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి 1976లో గుజరాత్‌లో ఒక చిన్న ఫౌండ్రీని స్థాపించారు. కంప్రెషర్లు, వస్త్ర పరిశ్రమలకు అవసరమైన మెటల్ కాస్టింగ్స్ తయారు చేయాలన్నది ఆయన లక్ష్యం. ఇందుకోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రుణం తీసుకోవడంతో పాటు తండ్రి నుంచి కొంత పెట్టుబడి సమకూర్చుకున్నారు. అయితే, తొలి ప్రయత్నంలోనే ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. తయారు చేసిన ఉత్పత్తులు వినియోగదారుల నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో ఏడాది తిరగకముందే ఆ పరిశ్రమ మూతపడింది. పెట్టిన పెట్టుబడి మొత్తం ఆవిరైపోయింది.
సాంకేతికతను నమ్ముకుని..
ఈ పరాజయం భద్రేశ్ షా ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చివేసింది. సాధారణ మెటల్ కాస్టింగ్స్ మార్కెట్‌లో ధరల పోటీ విపరీతంగా ఉంటుందని, ప్రత్యేక సాంకేతిక నైపుణ్యంతో కూడిన ఉత్పత్తుల్లోనే అసలైన భవిష్యత్తు ఉందని గ్రహించారు. 1977లో పవర్ ప్లాంట్లకు అవసరమైన రీప్లేస్‌మెంట్ విడిభాగాల తయారీపై దృష్టి సారించారు. 1978 నవంబర్ 4న ‘అహ్మదాబాద్ ఇండక్షన్ అల్లాయ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ను స్థాపించారు. బొగ్గు, ఇతర ఖనిజాలను గ్రైండ్ చేసే యంత్రాలకు అవసరమైన ప్రత్యేక స్టీల్ అల్లాయ్స్, ఐరన్ కాస్టింగ్స్ తయారీలో నాణ్యతకు పెద్దపీట వేశారు.
అంతర్జాతీయ ఒప్పందాలు
1988లో బెల్జియంకు చెందిన స్లెగ్టెన్ సంస్థతో సాంకేతిక సహకార ఒప్పందం కుదుర్చుకోవడం సంస్థకు కీలక మలుపు. ఆ తర్వాత అమెరికన్ సంస్థలతోనూ భాగస్వామ్యాలు ఏర్పరుచుకున్నారు. 1991లో బెల్జియం కంపెనీ మాగోటోక్స్‌తో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయడంతో అత్యున్నతమైన ‘హైక్రోమియం’ సాంకేతికత అందుబాటులోకి వచ్చింది.
రూ.40 కోట్లతో తిరిగి సంస్థపై పట్టు
మాగోటోక్స్‌తో ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్‌లో విదేశీ సంస్థకు 51 శాతం మెజారిటీ వాటా ఉండేది. క్రమేణా వ్యాపార వ్యూహాల విషయంలో విదేశీ భాగస్వామితో భద్రేశ్ షాకు విభేదాలు తలెత్తాయి. దీంతో ఆయన వెనక్కి తగ్గకుండా కంపెనీ లా బోర్డును ఆశ్రయించి న్యాయపోరాటం చేశారు. చివరకు 2000 సంవత్సరంలో కుదిరిన ఒప్పందం మేరకు సుమారు రూ.40 కోట్లు చెల్లించి మాగోటోక్స్ వాటాను కొనుగోలు చేశారు. సంస్థపై పూర్తి నియంత్రణ సాధించిన అనంతరం కంపెనీ పేరును ఏఐఏ ఇంజినీరింగ్ లిమిటెడ్‌గా మార్చారు.
ఆ తర్వాత సంస్థ విస్తరణ వేగవంతమైంది. 2003లో బ్రిటన్‌కు చెందిన వేగా ఇండస్ట్రీస్‌ను కొనుగోలు చేసి అమెరికా, కెనడా, చిలీ, ఘనా, ఆస్ట్రేలియా, పెరూ దేశాల్లో విక్రయాలను విస్తరించారు. 2005లో పబ్లిక్ ఇష్యూకు వెళ్లి రూ.148.05 కోట్లు సమీకరించగా ఈ ఇష్యూ ఏకంగా 27.30 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ కావడం మార్కెట్‌లో ఈ సంస్థకున్న క్రేజ్‌కు నిదర్శనం.
మైనింగ్ రంగంలోకి ప్రవేశం
2009లో మైనింగ్ పరిశ్రమకు అవసరమైన హైక్రోమియం గ్రైండింగ్ మీడియా, మిల్ ఇన్‌టర్నల్స్ సరఫరా ప్రారంభించడం ఏఐఏ ఇంజినీరింగ్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది. ఇనుప ఖనిజం, సిమెంట్, థర్మల్ పవర్ ప్లాంట్లలో యంత్రాల నిర్వహణ వ్యయాన్ని తగ్గించే మన్నికైన విడిభాగాలను అందిస్తున్నట్ల అధికారులు చెప్పారు.
లాభాల వెల్లువ
2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.1,270.16 కోట్ల నికర లాభాన్ని ఆర్జించి కంపెనీ తన సత్తా చాటుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) తొలి అర్ధభాగంలో ఆదాయం రూ.2,280.79 కోట్లకు పెరిగినప్పటికీ ముడిసరుకు వ్యయాలు ఇతరత్రా కారణాలతో నికర లాభం రూ.550.43 కోట్ల వద్ద కొంత ఒత్తిడిని ఎదుర్కొంది. అయినప్పటికీ, అక్టోబర్ 2026 చివరి నాటికి కంపెనీ మార్కెట్ విలువ సుమారు రూ.34,700 కోట్ల నుంచి రూ.35,000 కోట్ల మధ్య స్థిరంగా కొనసాగుతోంది.
ఇదీ చదవండి: ఓపెన్‌ఏఐ, గూగుల్, ఆంత్రోపిక్‌పై కోర్టులో పిటిషన్!


