కోట్లాది రూపాయల సంపద ఉన్నవారికి అదనపు పన్ను వేయాలా? వద్దా? ఈ ప్రశ్నకు అమెరికాలోని కాలిఫోర్నియా ప్రజలు తమ ఓటుతో సమాధానమిచ్చారు. బిలియనీర్ల సంపదపై 5 శాతం పన్ను విధించాలన్న ప్రతిపాదనను తిరస్కరించారు. దీంతో అత్యంత ధనవంతులపై పన్ను వేసి ఆరోగ్య రంగానికి నిధులు సమకూర్చాలన్న ప్రయత్నానికి బ్రేక్ పడింది.
కాలిఫోర్నియాలో మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్, కిమ్ కర్దాషియాన్, ఓప్రా విన్‌ఫ్రే వంటి సుమారు 200 మంది బిలియనీర్లు ఉన్నారు. వీరిలో 110 కోట్ల డాలర్లకు (సుమారు రూ.9 వేల కోట్లకు పైగా) మించి సంపద ఉన్నవారిపై ఈ పన్ను విధించాలని ‘ప్రపోజిషన్ 40’ పేరుతో ప్రతిపాదన తీసుకొచ్చారు. దాంతోపాటుగా వీరి మొత్తం ఆస్తులు, షేర్ల విలువపై ఒకేసారి 5 శాతం పన్ను వసూలు చేయాలనుకున్నారు.
ఈ పన్నుతో సుమారు 10,000 కోట్ల డాలర్లు సమకూరుతాయని అంచనా వేశారు. అయితే, ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన పన్నులు, ఖర్చులకు సంబంధించిన కొత్త చట్టం కారణంగా కాలిఫోర్నియాలో ఆరోగ్య రంగానికి కేంద్ర నిధులు తగ్గనున్నాయి. ఈ లోటును పూడ్చడంతోపాటు వైద్య సేవలకు ఆ డబ్బును ఉపయోగించాలని ప్రతిపాదకులు భావించారు. కాని, ఈ ప్రతిపాదనకు డెమొక్రాట్లు, కార్మిక సంఘాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
మరోవైపు, గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్, కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్‌లు ఈ పన్నును వ్యతిరేకించారు. పన్ను విధిస్తే బిలియనీర్లు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతారని, దీంతో రాష్ట్రానికి వచ్చే ఆదాయపు పన్ను కూడా తగ్గుతుందని గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రతిపాదనను అడ్డుకునేందుకు సెర్గీ బ్రిన్ ఏకంగా 10 కోట్ల డాలర్లకు పైగా ఖర్చు చేసినట్లు వార్తలు వచ్చాయి.
అయితే, ఈ పన్నుకు మద్దతు ఇచ్చిన కార్మిక సంఘాల నాయకుడు డేవ్ రీగన్ మరోసారి ప్రయత్నిస్తామని ప్రకటించారు. 2028లో బిలియనీర్లపై పన్ను విధించే ప్రతిపాదనను మళ్లీ తీసుకొస్తామని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న కాలిఫోర్నియాలో ధనవంతులు, పేదల మధ్య భారీ ఆర్థిక వ్యత్యాసం ఉంది. అయినప్పటికీ బిలియనీర్లపై అదనపు పన్ను విధించాలన్న ప్రతిపాదనకు ఓటర్లు మద్దతు ఇవ్వకపోవడమనేది చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చదవండి: ఎన్విడియా సీఈఓ వివాదం.. ఎవరీ అలిస్ హువాంగ్?


