Maya Jama: ‘లవ్‌ ఐలాండ్‌’కు గుడ్‌బై.. కొత్త ప్రయాణానికి అడుగులు... | Maya Jama Quits Love Island Host | Sakshi
Sakshi News home page

Maya Jama: ‘లవ్‌ ఐలాండ్‌’కు గుడ్‌బై.. కొత్త ప్రయాణానికి అడుగులు...

Nov 9 2026 9:24 AM | Updated on Nov 9 2026 9:24 AM

Maya Jama Quits Love Island Host

మూడేళ్లుగా ప్రేక్షకులను అలరించిన ప్రముఖ రియాలిటీ షో ‘లవ్‌ ఐలాండ్‌’కు టీవీ వ్యాఖ్యాత 'మాయా జామా' గుడ్‌బై చెప్పారు. ఇకపై ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించబోనని ప్రకటించారు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు, తన కెరీర్‌లో మరో అడుగు ముందుకు వేసేందుకు ఇదే సరైన సమయమని ఆమె తెలిపారు. ఈ షోతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ అభిమానులకు భావోద్వేగ సందేశం ఇచ్చారు.

32 ఏళ్ల మాయా జామా ఇన్‌స్టాగ్రామ్‌లో తన షో ప్రయాణానికి సంబంధించిన వీడియోను పంచుకున్నారు. '28 ఏళ్ల వయసులో హోస్ట్‌గా బాధ్యతలు చేపట్టానని, తొమ్మిది సిరీస్‌లలో ఎంతోమంది మంచి వ్యక్తులను కలుసుకున్నానని.., అలాగే షోలోని ప్రత్యేక నడకలు, ఫైర్‌ పిట్‌ సన్నివేశాలు, ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాలన్నీ మరిచిపోలేని అనుభూతులుగా నాలో మిగిలిపోతాయని' ఆమె పేర్కొన్నారు. ఇకపై దూరం నుంచే ఈ షోకు మద్దతుగా ఉంటానని చెప్పారు.

లారా విట్‌మోర్‌ స్థానంలో మాయా.. 2023లో హోస్ట్‌గా ఎంట్రీ
2023లో మాయా జామా ‘లవ్‌ ఐలాండ్‌’ హోస్ట్‌గా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన లారా విట్‌మోర్‌ స్థానంలో ఆమెకు అవకాశం లభించింది. ఈ షోలో పాల్గొనే యువతీ యువకులను జంటలుగా ఏర్పాటు చేసి వివిధ టాస్క్‌లు నిర్వహిస్తారు. తమకు సరైన జీవిత భాగస్వామిని వెతుక్కునే క్రమంలో వారు జంటలను మార్చుకుంటూ పోటీలో కొనసాగుతారు. బ్రిటన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోలలో ఇది ఒకటి.

మాయాకు ఐటీవీ ప్రశంసలు..
మాయా జామా తప్పుకోవడంపై ఐటీవీ ప్రతినిధి స్పందిస్తూ.. గత మూడేళ్లుగా ఆమె అద్భుతమైన హోస్ట్‌గా ప్రేక్షకుల అభిమానాన్ని పొందారని తెలిపారు. షోకు ఆమె అందించిన సేవలకు కృతజ్ఞతలు చెబుతూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

అయితే, ‘లవ్‌ ఐలాండ్‌’పై గతంలో విమర్శలు కూడా వచ్చాయి. కొందరు పోటీదారుల ప్రవర్తన మహిళల పట్ల వివక్షపూరితంగా ఉందని, వేధింపులు చోటుచేసుకుంటున్నాయని ఆరోపిస్తూ బ్రిటన్‌ మీడియా నియంత్రణ సంస్థ ఆఫ్‌కామ్‌కు వేల సంఖ్యలో ఫిర్యాదులు అందాయి.

రేడియో నుంచి టీవీ వరకు.. వ్యాఖ్యాతగా ప్రత్యేక గుర్తింపు..
మాయా జామా తొలుత రేడియో వ్యాఖ్యాతగా కెరీర్‌ ప్రారంభించారు. రిన్స్‌ ఎఫ్‌ఎంలో పనిచేసిన ఆమె 2018లో బీబీసీ రేడియో 1లో ప్రెజెంటర్‌గా అవకాశం దక్కించుకున్నారు.

అనంతరం ఛానల్‌ 4లోని ‘స్టాండ్‌ అప్‌ టు క్యాన్సర్‌’, ఐటీవీ2లోని ‘డోంట్‌ హేట్‌ ద ప్లేయాజ్‌’ వంటి కార్యక్రమాలను నిర్వహించారు. 2021లో బీబీసీ త్రీలో ‘గ్లో అప్‌: బ్రిటన్స్‌ నెక్స్ట్‌ మేకప్‌ స్టార్‌’ షోకు హోస్ట్‌గా వ్యవహరించారు. 2017లో మార్విన్‌ హ్యూమ్స్‌తో కలిసి మోబో అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించిన అతి పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందారు.

ఇటీవల ‘సెలబ్రిటీ ట్రైటర్స్‌’ షో ఫైనల్‌లోనూ మాయా జామా పాల్గొని ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. నటుడు రిచర్డ్‌ ఈ. గ్రాంట్‌, యూట్యూబర్‌ కింగ్‌ కెన్నీ, హాస్యనటుడు జేమ్స్‌ అకాస్టర్‌తో కలిసి పోటీపడ్డారు. విజేతగా నిలవకపోయినా తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు పొందారు. అలాగే, నెట్‌ఫ్లిక్స్‌ డ్రామా ‘ది జెంటిల్‌మెన్‌’ రెండో సిరీస్‌తో నటిగానూ అరంగేట్రం చేశారు. రేడియో నుంచి టీవీ వరకు, నటన నుంచి రియాలిటీ షోల వరకు తనదైన ముద్ర వేసిన మాయా జామా.. ఇప్పుడు కొత్త అవకాశాల వైపు అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇదీ చదవండి: కూలీగా మొదలై.. వందల మందికి బాస్‌గా ఎదిగి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement