ఇరాన్‌పై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు.. గల్ఫ్‌లో హైటెన్షన్‌! | US Trump Serious Comments On Iran | Sakshi
Sakshi News home page

ఇరాన్‌పై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు.. గల్ఫ్‌లో హైటెన్షన్‌!

Nov 9 2026 7:58 AM | Updated on Nov 9 2026 8:01 AM

US Trump Serious Comments On Iran

వాషింగ్టన్‌: అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. ఇరాన్‌తో చర్చలు విఫలమైతే మరోసారి సైనిక దాడులకు దిగేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు. అవసరమైతే కేవలం గంటలో 38 వంతెనలను ధ్వంసం చేయగలమంటూ హెచ్చరించడం సంచలనంగా మారింది. ఇప్పటికే మూడు విమాన వాహక యుద్ధనౌకలను రంగంలోకి దించినట్లు ప్రకటించారు. ఒకవైపు అణు ఒప్పందం కోసం చర్చలు జరుపుతూనే.. మరోవైపు యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేస్తున్న అమెరికా వైఖరితో మధ్యప్రాచ్యంలో మరోసారి ఆందోళన మొదలైంది. ఇరాన్‌ అమెరికా షరతులకు అంగీకరిస్తుందా? లేక మరోసారి యుద్ధం తప్పదా? అన్న ఉత్కంఠ నెలకొంది.

ఆదివారం సీఎన్‌ఎన్‌కు ఇచ్చిన ఫోన్‌ ఇంటర్వ్యూలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోసారి దాడులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడటం అత్యంత అసంభవమని ఐదుసార్లు పునరుద్ఘాటించారు. అదే సమయంలో అమెరికా సైన్యం పూర్తి అప్రమత్తంగా ఉందని స్పష్టం చేశారు. ఇరాన్‌తో కుదిరే ఒప్పందం చాలా బలంగా ఉండాలని ట్రంప్‌ స్పష్టం చేశారు. ఇప్పటికే అమెరికా దాడుల వల్ల ఇరాన్‌ సైనిక, ఆర్థిక సామర్థ్యాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఇరాన్‌లో ద్రవ్యోల్బణం 301 శాతానికి చేరిందని చెబుతూ ఆ దేశ ఆర్థిక పరిస్థితిపై విమర్శలు చేశారు. ఇదే సమయంలో అవసరమైతే మరోసారి దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. అమెరికా ఇప్పటికే ఇరాన్‌పై తీవ్రంగా దాడులు చేసిందని, అవసరమైతే మరింత కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు.

గల్ఫ్‌లో మూడు యుద్ధనౌకలు..
మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక బలగాలను సిద్ధంగా ఉంచినట్లు ట్రంప్‌ వెల్లడించారు. మూడు అమెరికా విమాన వాహక యుద్ధనౌకలు ఈ ప్రాంతంలో ఉన్నాయని, అవి పూర్తి యుద్ధ సన్నద్ధతతో ఉన్నాయని తెలిపారు. ఇరాన్‌లోని విద్యుత్‌ కేంద్రాలు, వంతెనలు సహా కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా గుర్తించినట్లు చెప్పారు. అవసరమైతే కేవలం గంట వ్యవధిలో 38 వంతెనలను ధ్వంసం చేయగలమని వ్యాఖ్యానించారు. అయితే అలాంటి చర్యలు తీసుకుంటే ఇరాన్‌ కోలుకోవడానికి చాలా ఏళ్లు పడుతుందని, అందుకే వాటిని నివారించాలనుకుంటున్నట్లు తెలిపారు. మరోవైపు అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు పలు దేశాలు దౌత్య ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఖతార్‌ రాజు షేక్‌ తమీమ్‌ బిన్‌ హమద్‌ అల్‌ థానీతో ట్రంప్‌ చర్చలు జరిపినట్లు ఖతార్‌ వెల్లడించింది.

ఇరాన్‌ సైతం చర్చలు.. 
ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ సౌదీ అరేబియా, యూఏఈ, ఒమన్‌, పాకిస్థాన్‌, కువైట్‌, జోర్డాన్‌, టర్కీ, సైప్రస్‌, ఖతార్‌ దేశాల ప్రతినిధులతోనూ చర్చలు జరిపారు. ఈ పరిణామాలు మధ్యప్రాచ్యంలో శాంతి ప్రయత్నాలకు ప్రాధాన్యత పెరిగినట్లు సూచిస్తున్నాయి. అయితే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాత్రం త్వరలోనే ఒప్పందం కుదురుతుందని ఆశించలేమని స్పష్టం చేశారు. ఇరాన్‌ ప్రతిపాదనలు ఆమోదయోగ్యం కానివిగా ఉన్నాయని, చర్చల్లో ఇప్పటివరకు చెప్పుకోదగ్గ పురోగతి లేదని వ్యాఖ్యానించారు.

మొత్తంగా.. ఇరాన్‌తో మరోసారి యుద్ధం వద్దని ట్రంప్‌ చెబుతున్నప్పటికీ, సైనిక చర్యలకు సిద్ధంగా ఉన్నామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒకవైపు దౌత్య చర్చలు, మరోవైపు యుద్ధ సన్నద్ధత.. ఈ రెండింటి మధ్య ఇరాన్‌-అమెరికా సంబంధాలు ఉత్కంఠగా మారాయి. ఇరాన్‌ అమెరికా షరతులకు అంగీకరిస్తుందా? హార్ముజ్‌ జలసంధిలో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయా? లేక మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయా? అన్నది ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇదీ చదవండి: సౌదీ గుండెల్లో గుబులు.. గల్ఫ్‌లో యుద్ధ మేఘాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement