ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం జరిగింది. గిజా ప్రావిన్స్‌లో ఆదివారం 2 ప్రయాణికుల రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 88 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని ఈజిప్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ ప్రమాదం రాజధాని కైరోకు దక్షిణంగా సుమారు 76 కిలోమీటర్ల దూరంలో చోటుచేసుకుంది.
రైల్వే శాఖ అధికారుల సమాచారం ప్రకారం.. గిజా నుంచి ఫయ్యూమ్‌కు వెళ్తున్న రైలు.. కైరో నుంచి అస్వాన్‌కు బయల్దేరిన మరో రైలును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో రెండో రైలులోని పలు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
ఈ ఘటనపై ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సీసీ తీవ్రంగా స్పందించారు. ప్రమాదంపై తక్షణమే దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ప్రత్యేక ప్రకటన విడుదల చేసినట్లు సమాచారం.
మరోవైపు ప్రమాద స్థలంలో సహాయక బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. పట్టాలు తప్పిన బోగీల శిథిలాలను తొలగించేందుకు సిబ్బంది పనిచేస్తున్నారు. రైల్వే మార్గాన్ని తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు.
కైరో నుంచి ఎగువ ఈజిప్టు ప్రాంతాలకు వెళ్లే రైల్వే మార్గంలో సేవలను పునరుద్ధరించడమే లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. అయితే రైళ్ల రాకపోకలు తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయనే విషయాన్ని వెల్లడించలేదు.
ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు, సహాయక చర్యలు ప్రస్తుతం కీలకంగా మారాయి. బాధ్యుల గుర్తింపు, రైల్వే సేవల పునరుద్ధరణపై అధికారులు తీసుకునే తదుపరి చర్యలపై దృష్టి నెలకొంది.


