దుబాయ్‌లో జరిగిన అరబ్ రీడింగ్ ఛాలెంజ్‌లో 11 ఏళ్ల చిన్నారి మయార్ ఒత్మాన్ అల్ షోర్‌బగీ సుమారు రూ. 1.25 కోట్లు గెలుచుకుంది. అక్టోబర్ 29న దుబాయ్‌లో జరిగిన 10వ అరబ్ రీడింగ్ ఛాలెంజ్‌లో అత్యున్నత పురస్కారం అందుకున్నప్పుడు ఆ చిన్నారి మయార్ తీవ్ర భావోద్వేగానికిలోనైంది. ఆమె పేరు ప్రకటించగానే ఆ చిన్నారి కన్నీళ్లతో మోకరిల్లి నేలను ముద్దాడింది.
ఆమె దుబాయ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ చేతుల మీదుగా ఆ ట్రోఫీని అందుకుంది. అంతేగాదు షేక్ మహమ్మద్ తన బ్యాడ్జ్‌ని తీసి ఆమె దుస్తులకు గుచ్చడమే గాక ఆమెను దగ్గరకు తీసుకుని తలపై ముద్దుపెట్టుకున్నారు. కాగా, ఈ పోటీల్లో మొత్తం 60 దేశాలకు చెందిన 40,286,428 మంది విద్యార్థులతో పోటీపడి మాయర్ ఈ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ పోటీలో ఆమె మొత్తం 60 పుస్తకాలు చదివింది.
తన దేశంలో 17.6 మిలియన్లకు పైగా పాల్గొన్నవారి నుంచి ఎంపికై, ఈజిప్ట్ ప్రతినిధిగా నిలిచింది. ఈ మేరకు మయార్ మాట్లాడుతూ..రీడింగ్ పట్ల ఆసక్తి పెరిగేలా ప్రోత్సహించిన తన పాఠశాలకు, కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపింది. కవిత్వంతో అరబిక్ పుస్తకాలపై ఆసక్తి పెరిగిందని పేర్కొంది.
అంతేగాదు తన దేశ సాంస్కృతిక ప్రాముఖ్యతను కాపాడుకునేందుకు ఈజిప్ట్ సమాచార శాఖ మంత్రి కావాలని ఆశిస్తున్నట్లు వెల్లడించింది. సంఘర్షణ శక్తిని అధిగమించడానికి, మెరుగైన భవిష్యత్తుని నిర్మించుకోవడానికి విద్య, జ్ఞానం అత్యవసరమైన సాధనాలుగా పేర్కొంటూ అందరూ కూడా పఠనాసక్తిని పెంచుకోవాలని కోరింది మయార్. ఇక ఆ చిన్నారి తాను గెలుచుకున్న మొత్తాన్ని తన పాఠశాల గ్రంథాలయాన్ని నిర్మించడానికి ఉపయోగించాలనుకోవడం విశేషం.
ఇదీ చదవండి: వారెన్ బఫెట్ గత 48 ఏళ్లుగా నీళ్లు తాగలేదట..! అదే ఇష్టమట..


