‘పూర్వాసంధ్యా దిగంత సీమల నవారుణోదయమెగసినది/ చిర నూతన చేతనోత్సాహమై నవజీవనకళ మెరిసినది/ అభినవ మధుకోకిల స్వనంలో స్వరసురచాపము అలరినది/ వేనవేల రాగాల మేళనం విధవిధాలుగా విరిసినది!’ అంటూ కన్నడ హృదయ సామ్రాట్టు ‘కువెంపు’ 90 యేళ్ళకిందటే గానం చేశారు. ‘కువెంపు’ ఆయన పుట్టు పేరు కాదు– అది ఆయన పెట్టు పేరు! కళా జగత్తులో ఎందరో యోధానుయోధులు, పుట్టు పేరుతో కాకుండా పెట్టు పేరుతో ప్రసిద్ధులైన వారున్నారు.
గుడిపాటి వెంకటచలం ఎందరో పాఠకురాళ్ళకు అపరిచితుడు కావచ్చు కానీ, ‘చలం’ మాత్రం సుపరిచితుడు. రేడియోలో వార్తలు చదివిన శ్రీరంగం శ్రీనివాసరావు పేరైనా వినని వాళ్ళక్కూడా ‘శ్రీశ్రీ’ సుపరిచితుడు. భాగవతుల శంకరశాస్త్రి ఎవరో తెలీని వాళ్ళక్కూడా ‘ఆరుద్ర’ సుపరిచితుడు. అలాగే, కుప్పళి వెంకటప్ప పుట్టప్ప ఎవరో తెలియని సామాన్య కన్నడిగులకు సైతం కు.వెం.పు.పేరు కచ్చితంగా తెలిసే వుంటుంది.
‘నవోదయ’ నాయకుడు
కవిగానూ, రూపకకర్తగానూ, నవలాకారుడిగానూ, విమర్శకుడిగానూ కు.వెం.పు. సుప్రసిద్ధులు! అందుకనే కు.వెం.పు.ను ‘కన్నడ హృదయ సామ్రాట్టు’గా పిల్చుకుంటారు కన్నడిగులు. కు.వెం.పు. నాయకత్వం వహించిన సాహిత్య ఉద్యమానికి ఆనాటి కన్నడ జర్నలిస్టులు ‘నవోదయ’ అని పేరుపెట్టారు. అదే కన్నడ సాహిత్య చరిత్రలో నిల్చిపోయింది.
అలాంటి మహారచయిత 1967లో జ్ఞానపీఠ పురస్కారం గెలుచుకోవడంలో వింతేముంది? (గుజరాతీ మహాకవి, రూపకకర్త, కథానికా రచయిత ఉమాశంకర్ జోషీతో ఆయన ఈ పురస్కారాన్ని పంచుకున్న సంగతి చదువుకున్న వారికి తెలిసిందే! జ్ఞానపీఠ పురస్కార చరిత్రలో ఇలా ఇద్దరికి ఈ పురస్కారం ఇచ్చిన సందర్భాలకు ఇది మొదలు మాత్రమే– మరో అయిదుసార్లు సైతం ఇలాగే ఇద్దరికి కలిపి పురస్కారం ఇచ్చిన సందర్భాలు కనిపిస్తున్నాయి!) అంతకుముందూ ఆ తర్వాతా కూడా కు.వెం.పు. ఎన్నో పురస్కారాలు పొందారు. 1955లోనే– జ్ఞానపీఠం గెల్చుకోవడానికి ఓ పుష్కరం ముందే– కు.వెం.పు. కేంద్రసాహిత్య అకాడెమీ పురస్కారం గెల్చుకున్నారు.
మరో మూడేళ్ళకు, ఆయనకు పద్మభూషణ పురస్కారం ప్రకటించి సత్కరించింది నాటి కేంద్ర ప్రభుత్వం. మూడు దశాబ్దాల తర్వాత– 1988లో– నాటి కేంద్ర ప్రభుత్వం కు.వెం.పు. కవికి పద్మవిభూషణ పురస్కారం ప్రకటించింది. మరో నాలుగేళ్ళ తర్వాత ఆయనకు కర్ణాటక రాష్ట్రప్రభుత్వం ‘కర్ణాటక రత్న’ పురస్కారం ప్రకటించి తనను తాను గౌరవించుకుంది. కు.వెం.పు. దేశమాతను స్తుతిస్తూ ‘జయభారత జననీయ తనూజతే!’ అనే గీతం గానంచేశారు. ఆ పాట కర్ణాటక రాష్ట్రంలో నలుమూలలా ఇప్పటికీ వినిపిస్తూనే వుంటుంది. ‘సుకవి జీవించు ప్రజల నాల్కలయందు’ అన్న మాట కు.వెం.పు. విషయంలో మరోసారి రుజువైంది.
తొలి సంకలనం ఇంగ్లిష్‌లో...
ఆయన తన కవితా ప్రస్థానాన్ని కౌమారంలోనే ప్రారంభించారు. పదిహేడేళ్ళ ప్రాయంలోనే కు.వెం.పు. తన తొలి కవితా సంకలనం వెలువరించారు. అయితే, అది కన్నడంలో రాసింది కాదు! 1921లో కు.వెం.పు. రాసిన ఏడు ఆంగ్ల కవితలను చిన్న ‘పుస్తిక’గా కూర్చి, ‘బిగినర్స్ మ్యూజ్’ పేరిట మరుసటి సంవత్సరం ప్రచురించారు.
అయితే, ఆయన్ను కన్నడ సాహిత్య సమాజం నెత్తికెత్తుకొని మోసింది ఈ ఇంగ్లిష్ కవితలు చూసి కాదు! ఆయన రామాయణాన్ని ఆధునిక దృక్కోణంతో పునఃరచించారు. కు.వెం.పు. తన మహాకావ్యాన్ని సనాతన భావాలతో నింపిపెట్టలేదు. ముఖ్యంగా సీతనూ, రాముణ్ణీ పాతకొత్తల మేలుకలయికగా దిద్దితీర్చారు కు.వెం.పు. సామాజిక న్యాయం, స్త్రీపురుష సమానత్వం, విశ్వజనీనమైన తాత్త్వికత వారిలో అణువణువునా నింపారు.
తెరకెక్కిన నవల
తొంభయ్యేళ్ళ కిందటే కు.వెం.పు. ‘కానూరు హెగ్గడితి’ (కానూరు పెత్తందారిణి) అనే నవల రాశారు. స్వాతంత్య్రం రావడానికి పదేళ్ళు ముందు, కర్ణాటకలోని మలెనాడు ప్రాంతంలో ఉనికిలో ఉన్న సామాజిక– సాంస్కృతిక జీవనరంగాలను ఆయన ఆ నవల్లో గొప్పగా చిత్రించారు. ఇంగ్లిష్ చదువు చదువుకుని, పల్లెకి తిరిగి వచ్చిన ఇద్దరు యువకులు ఈ నవలకు ప్రధాన పాత్రలు.
చంద్రయ్య గౌడ అనే పెత్తందారు వెనకబడిన పద్ధతులను ఎదిరిస్తారు ఈ యువకులు. వయసులో ఎంతో చిన్నదైన సుబ్బమ్మను పెళ్ళాడేందుకు పెత్తందారు చేసిన ప్రయత్నాన్ని వాళ్ళు ఎదుర్కొంటారు. సంప్రదాయానికీ, ఆధునికతకు– పురుషస్వామ్యానికీ, స్త్రీ స్వాతంత్య్రానికీ మధ్య జరిగిన సంఘర్షణను కు.వెం.పు. నేర్పుగా చిత్రించారు. 1999లో గిరీష్ కర్నాడ్ ఈ నవల ఆధారంగా రుపొందించిన చిత్రం రచయితకూ దర్శకుడికీ ఇద్దరికీ పేరు తెచ్చిపెట్టింది; సినిమాకు అవార్డును కూడా సాధించిపెట్టింది.
తన తొమ్మిదిపదుల జీవనంలో ఓ మహాకావ్యం, ఓ ఖండకావ్యం, ఓ ఆత్మకథ, ఓ వ్యాస సంపుటి, 23 కవితా సంకలనాలూ, రెండు కథాసంకలనాలూ, రెండు నవలలూ, డజను రూపకాలూ, అరడజను విమర్శనాత్మక రచనలూ, రెండు అనువాదాలూ, ఐదు ప్రసంగ సంకలనాలూ– లేఖాసంపుటులూ, పిల్లల కోసం తొమ్మిది పుస్తకాలూ, ‘కన్నడ డిండిమ’ అనే జానపద గేయసంపుటి రచించారు కు.వెం.పు.
ఆయన కుమారుడు పూర్ణచంద్ర తేజస్వి కాకుండా మరో ముగ్గురు కు.వెం.పు. జీవితకథనాలను రచించడం విశేషం. కన్నడ రచయితలకు జ్ఞానపీఠ పురస్కారం సాధించిపెట్టడానికి కు.వెం.పు. పట్టిన మునుము ఘనఫలితాలను సాధించింది. ఇంతవరకూ ఏడుగురు కన్నడ రచయితలు జ్ఞానపీఠ పురస్కారం గెల్చుకోవడం చరిత్ర కెక్కిన విషయమే!
మందలపర్తి కిషోర్


