బంగారం ధరలు ప్రస్తుతం ఆకాశాన్ని తాకేలా పలుకుతున్నాయి. ఈ తరుణంలో రెండు భారీ చెవిపోగులు పెద్ద సెన్సేషన్‌ని క్రియేట్ చేశాయి. చేతితో రూపొందించిన చెవిపోగులు రెండు గిన్నిస్ ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టింది. ఆ చెవిపోగుల్లో స్పెషాల్టీ తెలిస్తే..విస్తుపోవాల్సిందే. ఇవేమి ఆషామాషి చెవిపోగులు కాదు. సుమారు 16 కేజీలకు పైగా బరువున్న ఒక జత భారీ బంగారు ఝుంకాలు. ప్రముఖ జాయలుక్కాస్ జ్యువెలరీ సంస్థ రూపొందించిన ఈ చెవిపోగులును స్వయంగా చేతితో డిజైన్ చేసినవి.
ప్రపంచంలోనే అత్యంత బరువైన అతిపెద్ద బంగారు చెవిపోగులు. ఈ చెవిపోగులను వెయ్యి నెమళ్లు అని అర్థం వచ్చేలా మయూర సహస్ర ఝుంకాలు అని పిలుస్తారు. దాదాపు 22 క్యారెట్ల బంగారు చెవిపోగులు ఇవి. ఇటీవలే అక్టోబర్ 24న దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్‌లోని జ్యువెల్ ఆఫ్ జాయ్ షోరూమ్‌లో యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రి ఆవిష్కరించారు. దీన్ని సుమారు 55 మంది కళాకారులు దాదాపు 5,840 గంటలు వెచ్చించి మరి డిజైన్ చేశారట. భారతీయ సంస్కృతిలో సౌందర్యానికి, హుందాతనానికి ప్రతీక అయిన నెమలి, దక్షిణాసియా వివాహాల్లో సాధారణంగా ధరించే సాంప్రదాయ గంట ఆకారం తదితరాలను ప్రేరణగా చేసుకుని డిజైన్ చేశారు.
ఈ ఝమ్కాల తయారీ వెనుకున్న స్ఫూర్తి గురించి జాయలుక్కాస్ సీఈవో ఇలా వివరించారు. దుబాయ్‌ను ఎప్పుడూ బంగారు నగరం అని పిలుస్తారు. ఈ బంగారు చెవిపోగులు ఆ పేరుకు మరింత వన్నె తెస్తాయి. దీని క్రెడిట్ మొత్తం దుబాయ్‌కి, అలాగే రూపొందించిన కళకారులకే ఇచ్చారు. అలాగే ఒక క్రియేషన్ రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులను కొల్లగొట్టడం అనేది సుమారు 13 దేశాల్లో ఉన్న జోయలుక్కాస్ బృందాలకు, దశాబ్దాలుగా మమ్మల్ని విశ్వసిస్తున్న తమ కస్టమర్లకు ఎంతో గర్వకారణమని అన్నారు. ఈ అందమైన చెవిపోగులు ఒక్కసారి తమ కనులారా చూడాలంటే.. దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్‌లోని 'జ్యూయల్ ఆఫ్ జాయ్ బై జాయలుక్కాస్' షోరూమ్‌కి వెళ్లాల్సిందే.
ఇదీ చదవండి: అయోధ్య రామ మందిరాన్ని తలపించే వాచ్..! ఎన్నెన్నో ప్రత్యేకతలు..


