వాషింగ్టన్: పశ్చిమాసియాలో మరోసారి భౌగోళిక రాజకీయాల వేడి తారాస్థాయికి చేరుకుంది. ఇరాన్‌ను ఆర్థికంగా, సైనికపరంగా అష్టదిగ్బంధనం చేసే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇరాన్‌పై ఇప్పటికే సముద్ర మార్గాల్లో ఉక్కుపాదం మోపిన ట్రంప్.. ఇప్పుడు తాజాగా ఆ దేశ భూగోళ సరిహద్దులు, కాస్పియన్ సముద్రం మీదుగా సాగుతున్న అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు నడుం బిగించారు. ఇందులో భాగంగానే అమెరికా సెంట్రల్ కమాండ్ చీఫ్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ ‘టాస్క్ ఫోర్స్ ఐరన్ గేట్’ను ప్రకటించారు. అమెరికా తెరపైకి తెచ్చిన ఇప్పుడీ ‘ఐరన్ గేట్’ అంతర్జాతీయంగా చర్చకు దారి తీసింది.
ఇరాన్‌ను ఆర్థికంగా కుంగదీయాలనే వ్యూహంలో భాగంగా అమెరికా ఇప్పటికే ఆ దేశ చమురు ఎగుమతులపై కఠినమైన నౌకాదళ దిగ్బంధం అమలు చేస్తూ వస్తోంది. హర్మూజ్ జలసంధిలో రాకపోకల్ని తన ఆదీనంలోకి తీసుకుంది. ఈ దెబ్బకు ఇరాన్ చేయాల్సిన వేల కోట్ల విలువైన ముడి చమురు వ్యాపారం నిలిచిపోయింది. ఈ సముద్ర దిగ్బంధనం కారణంగా ఇరాన్ చేయాల్సిన సుమారు 25 బిలియన్ డాలర్ల విలువైన ముడి చమురు ఎగుమతులు నిలిచిపోయినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది.
అయితే,సముద్ర మార్గాలు మూసుకుపోవడంతో ఇరాన్ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. రష్యా, మధ్య ఆసియా, చైనా వంటి దేశాల మధ్య ఉన్న భూమార్గాలు, అలాగే కాస్పియన్ సముద్ర జలాలను వినియోగించుకుంటూ మధ్యవర్తుల ద్వారా రహస్యంగా ఆయుధాలు, విడిభాగాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటున్నట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి.అమెరికా ఆంక్షలను తప్పించుకునేందుకు ఇరాన్ వినియోగిస్తున్న ఈ లొసుగులను పూర్తిగా పూడ్చివేయడమే లక్ష్యంగా తాజా టాస్క్ ఫోర్స్ తెరపైకి వచ్చింది.
ఫ్లోరిడాలోని టెంపా కేంద్రంగా కార్యకలాపాలు సాగించనున్న ఈ ప్రత్యేక బృందంలో కేవలం 20 మంది పౌర, సైనిక సిబ్బంది మాత్రమే ఉండవచ్చు. సంఖ్యాపరంగా ఇది చిన్న బృందమే అయినప్పటికీ, దీని వ్యూహాత్మక పరిధి మాత్రం చాలా పెద్దది. ఇరాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చకుండా, తన ఆయుధ కర్మాగారాలను పునరుద్ధ రించకుండా సైనిక సామగ్రిని తిరిగి నింపుకోకుండా ఈ టాస్క్ ఫోర్స్ నిరంతరం నిఘా వేయనుంది.
అంతర్జాతీయ రాజకీయాలపై ప్రభావం
అమెరికా అనుసరిస్తున్న ఈ ఏకపక్ష ‘ఎక్స్‌ట్రా టెరిటోరియల్’(దేశ సరిహద్దులు దాటి ఆంక్షలు విధించే) విధానం మరోసారి అంతర్జాతీయ చట్టాల పరిధిపై చర్చకు దారితీస్తోంది. కాస్పియన్ సముద్ర తీర ప్రాంత దేశాలతో ప్రత్యక్ష సంబంధం లేకపోయినా, తన డాలర్ ఆధిపత్యం, దౌత్యపరమైన ఒత్తిళ్లతో అమెరికా గ్లోబల్ నెట్‌వర్క్‌ను శాసిస్తోంది. వీటో పవర్‌లతో కూడిన అమెరికా ఈ సరికొత్త టాస్క్ ఫోర్స్ ఇరాన్‌ను మరింత ఏకాకిగా మారుస్తుందా? లేక పశ్చిమాసియాలో కొత్త ఉద్రిక్తతలకు దారితీస్తుందా? అనేది కాలమే నిర్ణయించాలి
ఇదీ చదవండి : మూడోసారి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్?


