ఇజ్రాయెల్ రాజకీయాల్లో నెలకొన్న ప్రతిష్టంభన కీలక మలుపు తిరిగింది. ఇన్నాళ్లూ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు మరో రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ప్రత్యర్థి, ప్రతిపక్ష నేత ఐసెన్‌కోట్‌కు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం లభించింది. ఐసెన్‌కోట్‌ను తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా అధ్యక్షుడ ఐజాక్ హెర్జోగ్ ఆహ్వానం పంపించారు. దీంతో ఇజ్రాయెల్ రాజకీయాల్లో అధికారం ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ మొదలైంది. నెతన్యాహు రాజకీయ భవితవ్యానికి ఈ పరిణామం కీలక పరీక్షగా మారింది.
అధ్యక్ష భవనంలో జరిగే కార్యక్రమంలో హెర్జోగ్ అధికారికంగా ఐజెన్‌కాట్‌కు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన బాధ్యతలను అప్పగించనున్నారు. అనంతరం కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆయనకు 28 రోజుల గడువు ఉంటుంది. అవసరమైతే అధ్యక్షుడు మరో 14 రోజుల సమయం పొడిగించవచ్చు.
ఎన్నికల్లో నెతన్యాహు నేతృత్వంలోని కూటమి అతిపెద్ద రాజకీయ శక్తిగా నిలిచినప్పటికీ.. పార్లమెంట్‌లో మెజారిటీ సాధించలేకపోయింది. మరో వైపు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 61 స్థానాల మద్దతు ఏ కూటమికీ స్పష్టంగా లేకపోవడంతో ఇజ్రాయెల్‌లో రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు రానున్న వారాల్లో కీలక చర్చలు జరగనున్నాయి.
ఇజ్రాయెల్ అధ్యక్ష పదవి ప్రధానంగా లాంఛనప్రాయమైనదే అయినప్పటికీ.. ఎన్నికల అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరికి తొలి అవకాశం ఇవ్వాలనే విషయంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో భాగంగా 120 మంది సభ్యులున్న పార్లమెంట్ (నెస్సెట్)లో ఎన్నికైన పార్టీలతో అధ్యక్షుడు హెర్జోగ్ సంప్రదింపులు జరిపారు. ఈ ప్రక్రియలో ఐసెన్‌కోట్‌కు స్పష్టమైన ఆధిక్యం లభించింది. టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ కథనం ప్రకారం.. ప్రధానిగా ఐసెన్‌కోట్ పేరును 67 మంది ఎంపీలు సిఫార్సు చేయగా.. నెతన్యాహుకు 46 మంది మద్దతు తెలిపారు.
‘‘ఐసెన్‌కోట్‌ను అధ్యక్ష భవనానికి ఆహ్వానించాం. రేపు ఆయనకు ప్రభుత్వ ఏర్పాటుకు బాధ్యతలు అప్పగించనున్నాం’’ అని అధ్యక్షుడి అధికార ప్రతినిధి వెల్లడించారు. అయితే ఈ 67 మంది ఎంపీల మద్దతు అంటే ఐసెన్‌కోట్‌కు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ ఉన్నట్లు కాదు. కేవలం ప్రభుత్వ ఏర్పాటుకు తొలి అవకాశం మాత్రమే లభించింది. సంక్లిష్టమైన రాజకీయ సమీకరణాల మధ్య ఆయన మెజారిటీని ఎలా కూడగడతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్ పార్టీ 27 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. అయితే ఆయన కూటమికి మొత్తం 53 స్థానాలే లభించాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 61 స్థానాల మెజారిటీకి ఇంకా ఎనిమిది స్థానాలు తక్కువయ్యాయి. మరోవైపు ఐసెన్‌కోట్‌కు చెందిన యాషర్ పార్టీ 21 స్థానాలు సాధించి రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఆయన నేతృత్వంలోని నాలుగు పార్టీల కూటమికి 48 స్థానాలున్నాయి. ఇజ్రాయెల్‌లోని అరబ్ మైనారిటీకి ప్రాతినిధ్యం వహించే రెండు పార్టీలు కలిపి 19 స్థానాలు సాధించాయి. అధ్యక్షుడితో సంప్రదింపుల సందర్భంగా అవి ఐసెన్‌కోట్‌కు మద్దతు తెలిపాయి.
ప్రభుత్వ ఏర్పాటుకు ఐసెన్‌కోట్ ముందు పలు మార్గాలున్నాయి. అరబ్ ఎంపీల బయటి మద్దతుతో మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఒకటి. గతంలో నెతన్యాహుకు మద్దతుగా నిలిచిన అల్ట్రా ఆర్థడాక్స్ పార్టీలతో ఒప్పందం కుదుర్చుకోవడం మరో మార్గం. నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్‌తో కలిసి విస్తృత ఐక్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇంకో అవకాశం. అయితే చివరి మార్గానికి ప్రధాన అడ్డంకి ఉంది. నెతన్యాహు నేతృత్వంలోని ప్రభుత్వంలో తాను భాగస్వామిగా ఉండబోనని ఐజెన్‌కాట్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు.
అంతేకాకుండా కూటమిలో భాగస్వాములయ్యే పార్టీలకు ఆయన నాలుగు షరతులు విధించారు. ఇజ్రాయెల్‌ను యూదు, ప్రజాస్వామ్య, ఉదారవాద, సమానత్వ విలువలు కలిగిన దేశంగా గుర్తించాలి. దేశ స్వాతంత్య్ర ప్రకటనలోని విలువలను గౌరవించాలి. పౌరులందరికీ సైనిక లేదా జాతీయ సేవ తప్పనిసరి చేయడానికి మద్దతు ఇవ్వాలి. హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా గుర్తించడంతోపాటు గాజాలో దాని సైనిక, పాలనా సామర్థ్యాలను పూర్తిగా నిర్వీర్యం చేయడానికి అంగీకరించాలి.
ఈ షరతుల కారణంగా కూటమి చర్చలు మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది. ఐజెన్‌కాట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైతే మరో నేతకు అవకాశం ఇవ్వవచ్చు. ఆ ప్రయత్నం కూడా విఫలమైతే పార్లమెంట్ సభ్యులు మరో అభ్యర్థిని ప్రతిపాదించవచ్చు. ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేసేందుకు ఇజ్రాయెల్‌కు సుమారు 100 రోజుల గడువు ఉంది. ఈ వ్యవధిలో ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే మరోసారి ఎన్నికలకు వెళ్లాల్సి రావచ్చు.
ఐసెన్‌కోట్ పేరును అధ్యక్షుడు ప్రతిపాదించడంపై నెతన్యాహు ఇప్పటికే ఎదురుదాడికి దిగారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా జాతీయ ఐక్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అరబ్ పార్టీల మద్దతుపై ఆధారపడే ప్రభుత్వం దేశ భద్రతకు ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. ‘‘ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చేవారితో కలిసి వచ్చే వారమే హడావుడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కొందరు చూస్తున్నారు’’ అని నెతన్యాహు వ్యాఖ్యానించారు.
‘‘ఇజ్రాయెల్ దేశాన్ని అంతం చేయాలని కోరుకునే వారితో కలిసి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు’’ అని విమర్శించారు. అరబ్ పార్టీల మద్దతుతో ఏర్పడే ప్రభుత్వం హమాస్‌ను ఎదుర్కోలేదని, ఇజ్రాయెల్ సైనికులను కాపాడలేదని ఆరోపించారు.


