నెతన్యాహుకు షాక్‌.. ప్రతిపక్షానికి అరబ్ పార్టీల మద్దతు! | Eisenkot vows to use Knesset majority against Netanyahu | Sakshi
Sakshi News home page

నెతన్యాహుకు షాక్‌.. ప్రతిపక్షానికి అరబ్ పార్టీల మద్దతు!

Nov 1 2026 12:14 PM | Updated on Nov 1 2026 12:14 PM

Eisenkot vows to use Knesset majority against Netanyahu

జరూసలేం: ఇజ్రాయెల్‌లో ఎన్నికల అనంతరం ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహును అధికారానికి దూరం చేసేందుకు ప్రతిపక్ష కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో యషార్ పార్టీ నేత గడి ఐసెన్‌కాట్ కీలక ప్రకటన చేశారు. కొత్తగా ఎన్నికైన పార్లమెంటు (కెన్నెసెట్)లో ప్రతిపక్షానికి ఉన్న మెజారిటీని వెంటనే వినియోగించుకుంటామని వెల్లడించారు. అక్టోబర్ 7 నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో నెతన్యాహు వ్యతిరేక పార్టీలకు మొత్తం 67 స్థానాలు లభించాయి. అయితే, నెతన్యాహును వ్యతిరేకించే జియోనిస్ట్ పార్టీలకు 48 సీట్లు మాత్రమే వచ్చాయి. మరోవైపు రెండు ప్రధాన అరబ్ పార్టీలు రామ్, జాయింట్ లిస్ట్‌కు కలిపి 19 స్థానాలు దక్కాయి. ఈ రెండు పార్టీల మద్దతు ఐసెన్‌కాట్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమికి కీలకంగా మారింది. నెతన్యాహు నేతృత్వంలోని ప్రస్తుత కూటమికి 53 స్థానాలే రావడంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ లభించలేదు. మొత్తం 120 స్థానాలున్న కెన్నెసెట్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 61 మంది సభ్యుల మద్దతు అవసరం.

ప్రభుత్వ మార్పుతోపాటు పలు కీలక సంస్కరణలు చేపడతామని ఐసెన్‌కాట్ ప్రకటించారు. 2023 అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడిని ముందుగా గుర్తించడంలో, అడ్డుకోవడంలో విఫలమైన అంశాలపై స్వతంత్ర ప్రభుత్వ విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇజ్రాయెల్ పౌరులందరికీ సైనిక సేవ తప్పనిసరి చేస్తామని, ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద న్యాయవ్యవస్థ సంస్కరణ చట్టాలను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. దేశంలో మార్పు కావాలని ఇజ్రాయెల్ ప్రజలు 5 లక్షలకు పైగా ఓట్ల తేడాతో తీర్పునిచ్చారని ఆయన వ్యాఖ్యానించారు.

మరోవైపు, నెతన్యాహు ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు రామ్, జాయింట్ లిస్ట్ పార్టీలు బయటి నుంచి ప్రతిపక్షానికి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిచ్చాయి. అయితే, ప్రభుత్వంలో నేరుగా భాగస్వాములు కావాలనే ఉద్దేశం లేదని జాయింట్ లిస్ట్ నేత అహ్మద్ తిబీ స్పష్టం చేసినట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ పేర్కొంది. మరో అరబ్ రాజకీయ నాయకుడు జాఫర్ ఫరా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ రెండు పార్టీలు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌ను కలిసి తమ మద్దతు విషయాన్ని తెలియజేయనున్నాయి. తదుపరి ప్రధానమంత్రిగా మాజీ ఇజ్రాయెల్ సైన్యాధిపతి గడి ఐసెన్‌కాట్ పేరును ప్రతిపాదించనున్నట్లు సమాచారం. ఈ పరిణామాలతో నెతన్యాహు రాజకీయ భవిష్యత్తుపై ఉత్కంఠ నెలకొంది. 

ఇదీ చదవండి: హాలోవీన్ వేళ యూరప్‌లో జెన్‌జీ నిరసనల సెగ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement