బెర్లిన్: యూరప్‌లో ‘జెన్‌జీ’ యువత నిరసనలు ఉధృతమయ్యాయి. హాలోవీన్ వేడుకల వేళ జర్మనీ, ఫ్రాన్స్ దేశాల్లో వేలాది మంది యువత రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. మెరుగైన విద్యా సదుపాయాలు కల్పించాలని, పెరుగుతున్న జీవన వ్యయాన్ని తగ్గించాలని, తమ భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాల్లో యువతకు భాగస్వామ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. యూరప్‌లోని ఇతర దేశాల్లో జరుగుతున్న నిరసనల స్ఫూర్తితో జర్మనీలోనూ ఈ ఉద్యమం విస్తరించింది.
జర్మనీలో జెన్‌జీ నిరసనలు నిర్వహించారు. బెర్లిన్, ఫ్రాంక్‌ఫర్ట్, కొలోన్, మ్యూనిచ్ వంటి ప్రధాన నగరాల్లో ఆందోళనలకు పిలుపునిచ్చారు. నిరసనల్లో పెద్ద సంఖ్యలో యువత పాల్గొనేలా, తమ డిమాండ్లపై అందరి దృష్టి పడేలా నిర్వాహకులు హాలోవీన్ రోజును ఎంచుకున్నారు. శనివారం దేశవ్యాప్తంగా వేలాది మంది ర్యాలీలు నిర్వహించారు.
పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, నిధుల కొరతతో ఇబ్బందులు పడుతున్న పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, పర్యావరణ సమస్యలు యువత నిరసనలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. అంతేకాకుండా జర్మనీలో మళ్లీ తప్పనిసరి సైనిక సేవను ప్రవేశపెట్టే అవకాశాలపైనా యువత ఆందోళన వ్యక్తం చేస్తోంది. తమ భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకునేటప్పుడు యువత అభిప్రాయాలను పట్టించుకోవడం లేదని నిర్వాహకులు విమర్శించారు.
‘మా భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలను మా ప్రమేయం లేకుండానే తీసుకుంటుంటే ఇక చూస్తూ ఉండలేం’ అని నిర్వాహకులు తమ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. ఈ నిరసనలు శాంతియుతంగా కొనసాగాలని పిలుపునిచ్చారు. హాలోవీన్ దుస్తులు ధరించినప్పటికీ ముఖాలను కనిపించేలా ఉంచాలని సూచించారు. మరోవైపు ఫ్రాన్స్‌లోనూ నిరసనలు కొనసాగుతున్నాయి. ఎల్లో వెస్ట్స్ ఉద్యమం మళ్లీ తెరపైకి రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. హాలోవీన్ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందన్న ఆందోళనతో భద్రతను కట్టుదిట్టం చేసి, బహిరంగ సమావేశాలపై ఆంక్షలు విధించారు.
ఇదీ చదవండి: Nepal: ఆరుగురు భారత ట్రెక్కర్లు అదృశ్యం!


