ఇజ్రాయెల్‌లో బిగ్‌ పొలిటికల్‌ ట్విస్ట్‌.. మళ్లీ ఎన్నికలు? | Israel Election Twist, Can Netanyahu Stage A Comeback? Here’s The Story About Latest Developments | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌లో బిగ్‌ పొలిటికల్‌ ట్విస్ట్‌.. మళ్లీ ఎన్నికలు?

Nov 3 2026 9:28 AM | Updated on Nov 3 2026 10:03 AM

Israel Election Twist Fresh Hopes for Netanyahu Here Full Story

ఇజ్రాయెల్‌ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. గాజా యుద్ధం, ప్రాంతీయ సంఘర్షణల తర్వాత తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో ఏ కూటమికీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని కూటమి, గడి ఐసెన్‌కోట్ నేతృత్వంలోని ప్రత్యామ్నాయ కూటమి రెండూ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోలేకపోయాయి. దీంతో ఇజ్రాయెల్‌లో తదుపరి ప్రభుత్వం ఎవరిది అనే ప్రశ్న ఆసక్తికరంగా మారింది.

ఇజ్రాయెల్ కేంద్ర ఎన్నికల కమిటీ గణాంకాల ప్రకారం.. నెతన్యాహు కూటమికి 53 స్థానాలు, ఐసెన్‌కోట్ కూటమికి 48 స్థానాలు లభించాయి. 120 మంది సభ్యులున్న పార్లమెంట్‌ (కెనెసెట్‌)లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 61 మంది సభ్యుల మద్దతు అవసరం. మరోవైపు అరబ్ పార్టీల కూటమి జాయింట్ లిస్ట్, రామ్‌ కలిపి రికార్డు స్థాయిలో 19 స్థానాలు సాధించాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటులో ఈ పార్టీల మద్దతు కీలకంగా మారింది. ఇక, అక్టోబర్‌ 27న జరిగిన ఎన్నికల్లో 77.9 శాతం పోలింగ్ నమోదైంది. 1999 తర్వాత ఇదే అత్యధిక ఓటింగ్ శాతంగా నమోదైంది. నవంబర్‌ 4న అధికారిక ఫలితాలు ప్రకటించనుండగా.. ఆ తర్వాత అధ్యక్షుడు ఐజాక్ హెర్జాగ్ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన సంప్రదింపులు ప్రారంభించనున్నారు.

ప్రభుత్వ ఏర్పాటుకు ఏడు అవకాశాలు.. 
ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ప్రస్తుతం ఏడు అవకాశాలు చర్చకు వస్తున్నాయి. వీటిలో కొన్ని నెతన్యాహుకు అనుకూలంగా ఉండగా.. మరికొన్ని ఐసెన్‌కోట్‌కు అధికారం దక్కే మార్గాలను సూచిస్తున్నాయి.

1. నెతన్యాహు నేతృత్వంలో ఐక్య ప్రభుత్వం: లికుడ్ పార్టీతో పాటు యషార్, బి'యాచాద్, యిస్రాయెల్ బెటెనూ పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఒక అవకాశం. అయితే దీనికి నెతన్యాహు తన ప్రస్తుత మిత్రపక్షాలకు దూరం కావాల్సి ఉంటుంది. మరోవైపు ఐసెన్‌కోట్, నఫ్తాలి బెన్నెట్, యైర్ లాపిడ్, అవిగ్డోర్ లీబర్‌మన్‌లు నెతన్యాహు నాయకత్వంలో పనిచేయబోమన్న తమ ఎన్నికల హామీని మార్చుకోవాల్సి ఉంటుంది.

2. నెతన్యాహు, ఐసెన్‌కోట్ మధ్య అధికార మార్పిడి: ఇద్దరూ చెరోసారి ప్రధానిగా వ్యవహరించే రొటేషన్ ప్రభుత్వం మరో ప్రతిపాదన. ఇందులో తొలుత నెతన్యాహు ప్రధానిగా బాధ్యతలు చేపట్టి, రెండేళ్ల తర్వాత ఐసెన్‌కోట్‌కు అవకాశం ఇవ్వాలనేది ఒక ఆలోచన. అయితే ఐసెన్‌కోట్ ఈ ప్రతిపాదనను ఇప్పటికే తిరస్కరించారు. నెతన్యాహు పార్టీ కూడా రొటేషన్ విధానానికి వ్యతిరేకంగా ఉంది.

3. ప్రత్యర్థి కూటమి నుంచి సభ్యులను ఆకర్షించడం: ప్రస్తుతం ఉన్న మిత్రపక్షాలతోనే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు నెతన్యాహు ప్రయత్నించవచ్చు. ఇందుకోసం ఐసెన్‌కోట్ కూటమిలోని కనీసం ఎనిమిది మంది సభ్యులను తనవైపు తిప్పుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు కథనాలు పేర్కొంటున్నాయి. అయితే పార్టీలు మారే సభ్యులు తమ ఎన్నికల హామీలకు విరుద్ధంగా వ్యవహరించాల్సి ఉంటుంది.

4. ఐసెన్‌కోట్‌కు యూటీజే మద్దతు: నెతన్యాహుకు దీర్ఘకాలంగా మద్దతిస్తున్న అల్ట్రా ఆర్థడాక్స్ పార్టీ యునైటెడ్ తోరా జుడాయిజం (యూటీజే) ఇప్పుడు ఐసెన్‌కోట్‌కు మద్దతిచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆ పార్టీ ప్రభుత్వంలో చేరకుండా బయట నుంచి మద్దతు ఇచ్చినా ఐసెన్‌కోట్‌కు ప్రయోజనం కలగవచ్చు. అయితే యూదుల మత విద్యాసంస్థల్లో చదువుకునే యువకులకు సైనిక సేవ నుంచి మినహాయింపులు కల్పించే చట్టం తీసుకురావాలన్నది యూటీజే ప్రధాన డిమాండ్. ఐసెన్‌కోట్ మాత్రం అందరికీ జాతీయ సేవ తప్పనిసరి చేయాలనే విధానాన్ని ప్రకటించారు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరడం కష్టంగా కనిపిస్తోంది.

5. అరబ్ పార్టీల బయటి మద్దతుతో మైనారిటీ ప్రభుత్వం: ఐసెన్‌కోట్ నేతృత్వంలో 48 మంది సభ్యులున్న కూటమి మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. జాయింట్ లిస్ట్, రామ్‌ పార్టీలు ప్రభుత్వంలో చేరకుండా బయట నుంచి మద్దతిస్తే.. విశ్వాస పరీక్షలో 67 మంది సభ్యుల మద్దతు లభించే అవకాశం ఉంటుంది. అయితే అరబ్ పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోమని ఐసెన్‌కోట్ కూటమిలోని పలువురు నేతలు గతంలో ప్రకటించారు. దీంతో ఈ ప్రతిపాదనపైనా సందిగ్ధత నెలకొంది.

6. రామ్ పార్టీతో కలిసి ఐసెన్‌కోట్ ప్రభుత్వం: 2021లో బెన్నెట్‌-లాపిడ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరహాలోనే రామ్ పార్టీని కూటమిలో చేర్చుకోవడం మరో అవకాశం. అలా చేస్తే ఐసెన్‌కోట్ కూటమి బలం 56కు చేరుతుంది. జాయింట్ లిస్ట్ బయటి నుంచి మద్దతు ఇచ్చినా లేదా ఓటింగ్‌కు దూరంగా ఉన్నా ప్రభుత్వం నిలబడే అవకాశం ఉంటుంది. అయితే అరబ్ పార్టీలపై ఆధారపడే ప్రభుత్వానికి మద్దతివ్వబోమని లీబర్‌మన్ స్పష్టం చేశారు.

7. మళ్లీ ఎన్నికలు: ఈ అన్ని ప్రయత్నాలు విఫలమైతే కెనెసెట్ రద్దయ్యి మరోసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుత అంచనాల ప్రకారం 2027 ఏప్రిల్‌-మే మధ్య మళ్లీ ఎన్నికలు జరిగే పరిస్థితి రావచ్చు. అప్పటివరకు నెతన్యాహు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతారు.

19 మంది అరబ్ ఎంపీలే కీలకమా?
ఈ ఎన్నికల్లో అరబ్ పార్టీలకు లభించిన 19 స్థానాలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నెతన్యాహు, ఐసెన్‌కోట్ కూటముల్లో ఏ ఒక్కటీ 61 స్థానాల మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకోలేదు. దీంతో అరబ్ పార్టీల మద్దతు ఎవరికి లభిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఐసెన్‌కోట్ కూటమిలోని కొందరు నేతలు అరబ్ పార్టీల మద్దతుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

నవంబర్ 11 కీలక గడువు.. 
నవంబర్‌ 4న అధికారిక ఫలితాలు ఇజ్రాయెల్‌ అధికారిక గెజిట్‌ 'రెషుమోట్‌'లో ప్రచురితం కానున్నాయి. అనంతరం అధ్యక్షుడు ఐజాక్ హెర్జాగ్ అన్ని పార్టీల ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతారు. ఎన్నికల్లో స్థానాలు సాధించిన పార్టీలు రాష్ట్రపతి భవనానికి వెళ్లి ప్రధానమంత్రి పదవికి తమ అభ్యర్థిని సూచిస్తాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల అవకాశాలు ఎక్కువగా ఉన్న ఎంపీకి రాష్ట్రపతి బాధ్యతలు అప్పగిస్తారు. ఈ ఎంపీ తప్పనిసరిగా అతిపెద్ద పార్టీకి చెందిన నాయకుడే కావాల్సిన అవసరం లేదు. నవంబర్‌ 11 నాటికి ప్రభుత్వ ఏర్పాటుపై కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మొదట బాధ్యతలు అందుకున్న అభ్యర్థికి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు 28 రోజుల గడువు ఉంటుంది. అవసరమైతే మరో 14 రోజులు పొడిగించవచ్చు. ఈ ప్రయత్నం విఫలమైతే రాష్ట్రపతి మరో ఎంపీకి అవకాశం ఇవ్వవచ్చు. రెండో అభ్యర్థికి 28 రోజుల గడువు ఉంటుంది. దీనికి పొడిగింపు ఉండదు.

రెండో ప్రయత్నం కూడా విఫలమైతే కెనెసెట్‌లోని 120 మంది సభ్యుల్లో కనీసం 61 మంది ఒక అభ్యర్థికి మద్దతుగా రాష్ట్రపతికి లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసే అవకాశం ఉంటుంది. అలా ఎంపికైన వ్యక్తికి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు 14 రోజుల సమయం లభిస్తుంది. ఈ ప్రయత్నం కూడా విఫలమైతే పార్లమెంట్ రద్దై మళ్లీ ఎన్నికలు జరుగుతాయి.

ఇదీ చదవండి: ఇజ్రాయెల్‌లో ఉత్కంఠ.. ప్రధాని రేసులో కీలక పరిణామం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement