టెల్ అవీవ్: ఇజ్రాయెల్‌లో ఎన్నికలు ముగిశాయి. ఫలితాలూ వచ్చేశాయి. ఏ కూటమికీ నేరుగా అధికారం దక్కే పరిస్థితి లేకపోవడంతో ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు చర్చోపచర్చలు నడుస్తున్నాయి. అయితే... ప్రభుత్వ ఏర్పాటుకు మార్గాలేవి? మొత్తం 120 స్థానాలున్న ఇజ్రాయెలీ పార్లమెంటు నెసెట్‌లో నెతన్యాహూ కూటమికి 53, గాడి ఐసన్‌కోట్ కూటమికి 48 సీట్లు మాత్రమే దక్కాయి. అరబ్ పార్టీల కూటమికి 19 స్థానాలు దక్కాయి. అధికారం కావాలంటే 61 స్థానాలు అవసరమైన పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడ రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రభుత్వం ఏర్పడేందుకు అవకాశమున్న నాలుగు రకాల మార్గాలను పరిశీలిస్తే...
1. అరబ్ పార్టీలతో ఐసన్‌కోట్ జట్టు
ఈ ఏర్పాటు వినేందుకు చాలా సులువుగా అనిపిస్తుంది. 48 + 19 = 67. అంతేగా అనవచ్చు కానీ.. ఐసన్‌కోట్‌కు మద్దతుగా యూదు పార్టీలు దీనికి అంగీకరించే అవకాశం లేదు. మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అరబ్ పార్టీలు బయటి నుంచి మద్దతిచ్చేలా చేసేందుకూ వీరు ఒప్పుకునే పరిస్థితులు లేవు. 1948లో యుద్ధం తరువాత ఇజ్రాయెల్‌లోనే ఉండిపోయిన పాలస్తీనీయుల మద్దతుతో అరబ్‌పార్టీలు 19 స్థానాలు దక్కించుకోవడం ఇందుకు కారణం. వివాదాస్పద గాజాప్రాంతంతోపాటు, వెస్ట్‌బ్యాంక్‌లోని వారితోనూ వీరికి సంబంధాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెలీ యూదుల్లో చాలామందికి వీరిపై అనుమానం ఎక్కువ. గతంలో ఒకే ఒక్కసారి అరబ్ పార్టీలు (2021) ప్రభుత్వంలో భాగంగా ఉన్నాయి. ఆ ప్రభుత్వం కాస్తా 18 నెలల్లో కూలిపోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అరబ్ పార్టీలతో జట్టు కట్టవద్దరి నెతన్యాహూ ఇప్పటికే ఇతర కూటములను హెచ్చరించారు.
2. ఐక్య ప్రభుత్వం...
ఇజ్రాయెల్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు నెతన్యాహూ నేరుగా ఐసన్‌కోట్ కూటమితో జట్టుకట్టడం ఒక మార్గం. ఈ ఏర్పాటుతో నెతన్యాహూకు నెసెట్‌లో మెజారిటీ లభిస్తుంది. అదే సమయంలో అరబ్ పార్టీలతోపాటు, కరడుకట్టిన యూదు భావజాలపు, అతివాద జాతీయవాద నేతలందరూ ప్రతిపక్షం అయిపోతారు. ఈ రకమైన కూటమి యూదులకు మిలటరీ సేవల మినహాయింపు వంటి సంక్లిష్టమైన అంశాలను సులువుగా పరిష్కరించగలదు. అయితే ఇందుకు ఐసన్‌కోట్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇచ్చిన వాగ్ధానాన్ని భంగం చేయాల్సి ఉంటుంది. నెతన్యాహూతో కలిసి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏర్పాటు చేయబోమని ఐసన్‌కోట్ కూటమి భాగస్వామ్య పార్టీలు గట్టి హామీ ఇచ్చాయి. 2023 అక్టోబర్ నాటి హమాస్ దాడికి నెతన్యాహూ బాధ్యతారాహిత్యమే కారణమని కూడా ఐసన్‌కోట్ కూటమి వాదించింది. నెతన్యాహూ కూడా ఇప్పటివరకూ అంటకాగిన అతివాద పార్టీలను వదులుకోవాల్సి ఉంటుంది.
3. అయారాం, గయారాంలతో..
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ఇంకోసారి అధికారంలోకి వచ్చేందుకు ఉన్న మరో మార్గం ప్రతిపక్షాలను చీల్చడం. గతంలో భాగస్వాములుగా ఉన్న పార్టీలు, నేతలు.. ఉదాహరణకు నఫ్తాలీ బెనెట్, అవిగ్దోర్ లైబర్‌మెన్‌ను తనవైపునకు తిప్పుకునే ప్రయత్నం చేయడం. వీరిద్దరూ వెస్ట్‌బ్యాంకులో సెటిల్మెంట్ల విస్తరణ వంటి జాతీయ వాద విధానాలకు మద్దతిచ్చేవారే. అదే సమయంలో అరబ్ పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం వీరికి అంతగా రుచించని అంశం. అయితే వీరిద్దరూ నెతన్యాహూతో విభేదించిన వారు కావడం గమనార్హం. ఏళ్లుగా వ్యక్తిగత స్థాయిలో నెతన్యాహూతో వీరికి భేదాభిప్రాయాలు ఉన్నాయి. అంతేకాకుండా నెతన్యాహూ కూటమి కలిసి ఉండేందుకు ప్రధాన కారణమైన అంశం... యూదులకు మిలటరీ సేవల మినహాయింపును బెనెట్, లైబర్‌మాన్‌లు వ్యతిరేకించారు. పైగా ఈ వర్గాల వారు నెతన్యాహూతో చాలాకాలంగా కలిసి ఉంటున్నారు.
4. మళ్లీ ఎన్నికలు...
ఇది ఆఖరి అస్త్రం. ఏ కూటమి కూడా అధికారానికి కావాల్సిన 61 స్థానాలను కూడగట్టుకోలేకపోతే మరోసారి ఎన్నికలు జరిగే అవకాశం ఏర్పడుతుంది. కాకపోతే ఇవి వచ్చే ఏడాది వరకూ సాధ్యం కావు. అప్పటివరకూ నెతన్యాహూనే ఆపద్ధర్మ ప్రభుత్వాధినేతగా కొనసాగుతారు. ప్రత్యర్థులకు ఈ ఏర్పాటు ప్రాణ సంకటం. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పుడు వీరు ముందంజలోనే ఉన్నారు. కానీ ఫలితాల నాటికి పరిస్థితిలో స్వల్ప తేడా వచ్చింది. విదేశాల నుంచి వచ్చి మరీ వేలాది మంది ఇజ్రాయెలీలు వీరికి ఓటేశారు. మళ్లీ ఎన్నికలంటే వీళ్లంతా మరోసారి ఇజ్రాయెల్‌కు వస్తారా? అన్నది అనుమానం. ఈ లోపు నెతన్యాహూ తన కూటమిని విస్తరించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుంది. పార్లమెంటులో స్థానానికి అవసరమైనన్ని ఓట్లు సంపాదించలేని చిన్న పార్టీలు మరోసారి ఎన్నికల బరిలో దిగే అవకాశాలు తక్కువ. అప్పుడు సహజంగానే నెతన్యాహూ కూటమి పార్టీలకు పడే ఓట్లు పెరుగుతాయి. లేదా... ఈ పార్టీల మద్దతుదారులు పెద్ద పార్టీలవైపు మళ్లవచ్చు. 2019లో దాదాపు ఇలాంటి పరిస్థితులే ఎదురుకాగా.. మూడున్నరేళ్లలో ఇజ్రాయెల్ ఐదుసార్లు ఎన్నికలు జరుపుకోవడం కొసమెరుపు!


