కాఠ్మాండు: నేపాల్‌లోని పర్వత ప్రాంతంలో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్ వైపు వెళ్లే మార్గంలోని సోలుఖుంబు ప్రాంతంలో రెండు హెలికాప్టర్లు ఢీకొన్నాయి. ల్యాండింగ్ అవుతున్న సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఒక విదేశీయుడు ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి గాయపడ్డాడు. ఈ ఘటనతో కలకలం చెలరేగింది.
సోలుఖుంబు హెలిప్యాడ్ వద్ద ప్రమాదం
నేపాల్‌లోని సోలుఖుంబు హెలిప్యాడ్ వద్ద మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఫిష్‌టెయిల్ ఎయిర్, డైనాస్టీ ఎయిర్ సంస్థలకు చెందిన రెండు హెలికాప్టర్లు ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నేపాల్ పోలీసుల ప్రాథమిక నివేదిక ప్రకారం.. మంగళవారం ఉదయం సుమారు 8.11 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. రెండు హెలికాప్టర్లు హెలిప్యాడ్ వద్ద దిగేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఢీకొన్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ప్రమాదంలో ఒక విదేశీయుడు మరణించగా, మరో వ్యక్తి గాయపడ్డారు. అయితే మృతుడు, గాయపడిన వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. ప్రమాదానికి సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని హెలికాప్టర్‌లో లుక్లాకు తరలించారు. అక్కడ అతడికి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు. రెండు హెలికాప్టర్లు ఒకే సమయంలో ల్యాండింగ్ అవుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం చెబుతోంది. ఘటనకు సంబంధించి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.


