వాషింగ్టన్: పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరాన్‌లోని కీలకమైన ఖేష్మ్ ద్వీపంపై అమెరికా రహస్యంగా దాడులు జరిపినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. అమెరికా అధికారులు అందించిన సమాచారాన్ని ఉదహరిస్తూ ఈ కథనాన్ని ప్రచురించింది. హార్ముజ్ జలసంధిలో ఉన్న ఈ ద్వీపంపై దాడుల నేపథ్యంలో వరుస పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ ఐఆర్ఎన్ఏ తెలిపింది. ఇటీవలి కాలంలో అమెరికా చేపట్టిన పరిమిత సైనిక చర్యల్లో భాగంగానే ఈ దాడులు జరిగినట్లు సమాచారం. ఇరాన్‌పై పూర్తిస్థాయి సైనిక చర్యలను తిరిగి ప్రారంభిస్తున్న సంకేతాలు వెళ్లకుండా వీటిని రహస్యంగా నిర్వహించినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.
మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఇరాన్‌పై మళ్లీ దాడులు చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కోరుతున్నట్లు ఆక్సియోస్ వెల్లడించింది. అమెరికా మధ్యంతర ఎన్నికలు ముగిసిన తర్వాత సైనిక చర్యలు చేపట్టాలని ఆయన సూచించినట్లు తెలిపింది. అయితే, ప్రస్తుతానికి దౌత్యపరమైన చర్చలకు అవకాశం ఇవ్వాలని ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం.
శనివారం ట్రంప్, నెతన్యాహు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఇరాన్‌తో చర్చలు, సైనిక చర్యల పునఃప్రారంభంపై వీరిద్దరూ చర్చించినట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉండగా, ఇరాన్‌పై మళ్లీ దాడులు చేసే ఆలోచన ఉందా అని సోమవారం మీడియా ప్రశ్నించగా ట్రంప్ ‘లేదు’ అని సమాధానమిచ్చారు. మరోవైపు, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఇరాన్‌తో చర్చల ద్వారా ఒప్పందం కుదిరే అవకాశాలపై ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన పరిష్కారం కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
ఇదీ చదవండి: విమాన ప్రమాదం.. ప్రముఖ వ్యాపారవేత్త కుటుంబం మృతి!


