వాషింగ్టన్: మధ్యంతర ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కీలక మార్పుల దిశగా అడుగులు వేస్తున్నారు. ఓటమి తర్వాత తన టీమ్‌లో ప్రక్షాళనకు దిగిన ట్రంప్.. ఏకంగా వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌నే మార్చేశారు. తనకు అత్యంత నమ్మకస్తురాలైన సూసీ వైల్స్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించి.. ఆమె స్థానంలో అత్యంత సన్నిహితుడైన స్టీఫెన్ మిల్లర్‌కు పగ్గాలు అప్పగించారు. అయితే ఈ మార్పులకు, ఎన్నికల ఓటమికి సంబంధం లేదని ట్రంప్ చెబుతున్నారు.
మిల్లర్ నవంబర్ 9 నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే సూసీ వైల్స్‌ను పూర్తిగా పక్కన పెట్టడం లేదు. ఆమెను ట్రంప్ రాజకీయ వ్యవహారాల విభాగానికి బదిలీ చేశారు. ఈ విషయాన్ని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో వెల్లడించారు. ‘స్టీఫెన్ మిల్లర్ నా అత్యంత విశ్వసనీయ సలహాదారుల్లో ఒకరు. నా రాజకీయ ప్రస్థానం ప్రారంభం నుంచి ఆయన నాతోనే ఉన్నారు. ఆయనకు రాజకీయాలపై మంచి అవగాహన ఉంది. చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా అద్భుతంగా పనిచేస్తారని నమ్ముతున్నాను. సూసీ వైల్స్ కూడా తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించారు. ఆమె సేవలకు కృతజ్ఞతలు’’ అంటూ ట్రంప్ పేర్కొన్నారు.
41 ఏళ్ల స్టీఫెన్ మిల్లర్ శుక్రవారం ట్రంప్‌తో కలిసి ఫ్లోరిడా పర్యటనలోనూ పాల్గొన్నారు. వైట్‌హౌస్ నుంచి బయలుదేరే సమయంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ట్రంప్ స్పందిస్తూ.. మిల్లర్ సమర్థవంతుడని.. కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారని చెప్పారు. మధ్యంతర ఎన్నికల్లో పార్టీ ఎదుర్కొన్న పరాజయంతో అసంతృప్తితోనే ఈ మార్పు చేశారా? అన్న ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ.. ఎన్నికల్లో ఓటమి కారణంగా ఈ నిర్ణయం తీసుకోలేదని.. ఇది సరైన సమయం అని భావించాను. కొన్నిసార్లు మార్పులు చేయాల్సి ఉంటుంది. ఆ ఎన్నికల్లో నేను పోటీ చేయలేదంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.
చీఫ్ ఆఫ్ స్టాఫ్ పదవి నుంచి వైదొలగడంపై సూసీ వైల్స్ కూడా స్పందించారు. ‘‘ఈ రోజు వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నా చివరి రోజు. అధ్యక్షుడు ట్రంప్‌తో కలిసి వైట్‌హౌస్‌లో పనిచేయడం నా జీవితంలో మరిచిపోలేని గౌరవం. దేశ సరిహద్దుల భద్రత బలోపేతం, పన్నులు తగ్గింపు, ఆర్థిక వ్యవస్థ బలోపేతం, అమెరికా ప్రయోజనాల్లో భాగస్వామిని కావడం గర్వంగా ఉందంటూ ఆమె పేర్కొన్నారు.
ట్రంప్ ప్రస్తుత అధ్యక్ష పదవీకాలంలో అత్యధిక కాలం చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పనిచేసిన వ్యక్తిగా సూసీ వైల్స్ నిలిచారు. కాగా, ట్రంప్ తన తొలి నాలుగేళ్ల పదవీకాలంలో ఈ బాధ్యతలను నలుగురికి అప్పగించారు. 2024 ఎన్నికల తర్వాత ట్రంప్ తొలుత నియమించిన వ్యక్తి కూడా సూసీ వైల్సే. వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు.
స్టీఫెన్ మిల్లర్ ట్రంప్‌నకు అత్యంత సన్నిహితంగా ఉండే సహాయకుల్లో ఒకరు. ప్రస్తుతం హోంల్యాండ్ సెక్యూరిటీ సలహాదారుగా, డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా వ్యవహరిస్తున్నారు. 2016లో ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచార బృందంలో ప్రసంగ రచయితగా చేరారు. ముఖ్యంగా ట్రంప్ వలస విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. అయితే, వలస విధానాల అమలుపై ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఈ ఏడాది జనవరిలో వలస నియంత్రణ అధికారులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు నిరసనకారులు మరణించిన ఘటన తర్వాత ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి.
ట్రంప్ బృందంలో చేరడానికి ముందు.. అలబామాకు చెందిన రిపబ్లికన్ మాజీ సెనేటర్ జెఫ్ సెషన్స్ వద్ద పనిచేశారు. అనంతరం సెషన్స్ ట్రంప్ తొలి ప్రభుత్వంలో అటార్నీ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. మిల్లర్ నియామకంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందిస్తూ.. సూసీతో ఉన్న స్నేహానికి, అధ్యక్షుడికి, దేశానికి ఆమె చేసిన సేవలకు కృతజ్ఞతలు. స్టీఫెన్ మిల్లర్ గొప్ప దేశభక్తుడు. ఆయన కొత్త బాధ్యతల్లో అద్భుతంగా రాణిస్తారు. ఈ పదోన్నతికి ఆయన అర్హడంటూ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఇరాన్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఈసారి బిగ్ స్కెచ్!


